లక్ష్యానికి సుదూరం

ABN , First Publish Date - 2021-02-27T05:49:42+05:30 IST

జిల్లాలో ధాన్యం కొనుగోలు మందకొడిగా సాగుతోంది. సేకరించాల్సిన దానిలో ఇంతవరకు 30 శాతం మాత్రమే కొనుగోలు చేశారు.

లక్ష్యానికి సుదూరం

జిల్లాలో మందకొడిగా ధాన్యం సేకరణ

కొనుగోలు చేయాల్సింది లక్ష టన్నులు

ఇంతవరకు సేకరించింది 32 వేల టన్నులే!

ఏజెన్సీలో 400 టన్నులే కొనుగోలు

డబ్బు చెల్లింపుల్లో తీవ్రజాప్యం

తడిసిన ధాన్యం కొనుగోలుకు విముఖం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ధాన్యం కొనుగోలు మందకొడిగా సాగుతోంది. సేకరించాల్సిన దానిలో ఇంతవరకు 30 శాతం మాత్రమే కొనుగోలు చేశారు. గత ఖరీఫ్‌లో వరి సాగు విస్తీర్ణం, ధాన్యం దిగుబడిని దృష్టిలో పెట్టుకుని లక్ష టన్నులు సేకరించాలని జిల్లా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు కేవలం 32 వేల టన్నులే సేకరించారు. ప్రభుత్వం విధించిన పలు నిబంధనల కారణంగా ధాన్యం అమ్మకానికి రైతులు అంతగా ఆసక్తి చూపలేదు.

గత ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో లక్ష హెక్టార్లకుపైగా విస్తీర్ణంలో వరి సాగు చేపట్టారు. భారీవర్షాలు, వరదల వల్ల కొన్ని మండలాల్లో పంట దెబ్బతిన్నప్పటికీ మొత్తం మీద ధిగుబడి ఆశాజనకంగానే ఉంది. దీంతో లక్ష టన్నుల ధాన్యాన్ని సేకరించాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం 150 కేంద్రాలను ఏర్పాటుచేశారు. వీటిల్లో 40 ఏజెన్సీలోనే ఉన్నాయి. ప్రాథమిక సహకార సంఘాలు, డ్వాక్రా సంఘాలకు కొనుగోలు బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యం కొనుగోలు చేసిన వారం, పది రోజుల్లో సంబంధిత రైతు బ్యాంకు ఖాతాకు డబ్బులు జమ అవుతాయని అధికారులు చెప్పారు. ముందుగా కొనుగోళ్లు ప్రారంభించిన ఏజెన్సీలో...గిరిజన రైతుల నుంచి కనీస స్థాయిలో కూడా స్పందన రాలేదు. గిరిజన రైతులు పంట నూర్చిన వెంటనే సమీపంలోని వారపు సంతకు తీసుకువెళ్లి అమ్ముకుంటుంటారు. కొనుగోలుదారులు అక్కడికక్కడే డబ్బులు ఇస్తుంటారు. అయితే ధాన్యం విక్రయించిన పది రోజుల తరువాత డబ్బులు బ్యాంకు ఖాతాలో పడతాయని చెప్పడంతో ప్రభుత్వం ఏర్పాటుచేసిన కేంద్రాలకు అతికొద్దిమంది మాత్రమే తీసుకువచ్చారు. అంతేకాక వరి సాగుచేసే రైతులు, ప్రభుత్వం ఏర్పాటుచేసే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలంటే ముందుగా ఆర్‌బీకేల్లో పేరు, సాగు వివరాలను నమోదు చేసుకోవాలని నిబంధన విధించింది. కౌలు రైతులు, చిన్నకారు రైతులకు ఇది ఇబ్బందిగా మారింది. ఇటువంటి వారంతా ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం విక్రయించారు. మన్యంలో సుమారు 40 వేల హెక్టార్లలో వరి సాగు చేయగా, ఇంతవరకు 400 టన్నులు మాత్రమే ధాన్యం సేకరించారు. మొత్తం మీద లక్ష టన్నులకుగాను ఈ నెల 24వ తేదీనాటికి 32 వేల టన్నులు మాత్రమే సేకరించగలిగారు.


సొమ్ము చెల్లింపులో తీవ్ర జాప్యం

ప్రభుత్వం ఏర్పాటుచేసిన సేకరణ కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన వారం లేదా పది రోజుల్లో ఆయా రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతాయని అధికారులు చెప్పారు. కానీ మూడు వారాలకు కూడా సొమ్ములు జమ కావడం లేదు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో జనవరి నెలాఖరు వరకు సరఫరా చేసిన ధాన్యానికి మాత్రమే ఆయా రైతుల బ్యాంకు ఖాతాలకు సొమ్ము జమ అయ్యింది. ఈ నెల ఐదో తేదీ తరువాత ధాన్యం విక్రయించిన వారికి డబ్బులు జమ కాలేదు. దీంతో మిగిలిన రైతులు ధాన్యం విక్రయానికి విముఖత చూపారు. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం విక్రయించిన రెండు లేదా మూడు రోజుల్లో డబ్బులు జమ అయిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తుచేస్తున్నారు. 


రంగుమారిన ధాన్యం కొనుగోలుకు విముఖత

గత ఏడాది అక్టోబరులో భారీ వర్షాలు, నవంబరులో తుఫాన్‌ ప్రభావంతో అనేక మండలాల్లో వరి పొలాలు రోజుల తరబడి నీట మునగడంతో ధాన్యం రంగు మారడం లేదా మొలకెత్తడం జరిగింది. ఇటువంటి ధాన్యాన్ని కూడా కొను గోలు చేస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. దీంతో బాధిత రైతులు ఊరట చెందారు. పంట కోసి నూర్చిన తరు వాత కొనుగోలు కేంద్రాలకు  తీసుకువెళ్లారు. అయితే తడిసిన, మొలకెత్తిన, రంగుమారిన ధాన్యం కొనుగోలు చేసే జిల్లాల జాబితాలో విశాఖ లేదంటూ అధికారులు చావుకబురు చల్లగా చెప్పారు. ఇటువంటి ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులు సైతం కొనుగోలు చేయలేదు. ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లో చేపల పెంపకందారులు రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్టు జిల్లా రైతులకు తెలిసింది. నాణ్యమైన ధాన్యం ధరకంటే క్వింటాకు రూ.300 నుంచి రూ.400 తక్కువ ధరకు తడిసిన ధాన్యాన్ని అమ్ముకున్నట్టు బుచ్చెయ్యపేటకు చెందిన రైతు ఒకరు తెలిపారు.

Updated Date - 2021-02-27T05:49:42+05:30 IST