పుస్తకాలే కాదు.. దుస్తులూ ఆలస్యమే!

ABN , First Publish Date - 2022-06-25T17:21:47+05:30 IST

విద్యార్థులకు అందించాల్సిన పాఠ్యపుస్తకాల విషయంలోనే కాదు.. యూనిఫాంల సరఫరాలోనూ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో

పుస్తకాలే కాదు.. దుస్తులూ ఆలస్యమే!

తాజాగా యూనిఫాం కుట్టు ధరల ఖరారు

విద్యార్థులకు అందాలంటే నెలరోజుల సమయం

ఇంకా 60% స్కూళ్లకు చేరని పాఠ్యపుస్తకాలు


హైదరాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల(students)కు అందించాల్సిన పాఠ్యపుస్తకాల(Text books) విషయంలోనే కాదు.. యూనిఫాం(Uniform)ల సరఫరాలోనూ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమై 10 రోజులు గడుస్తున్నా పుస్తకాలు ఇంకా పూర్తిస్థాయిలో అందలేదు. విద్యార్థులకు అందించే యూనిఫాంలు కూడా మరో నెల రోజుల వరకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ సమయానికే పాఠశాలల్లో సిద్ధంగా ఉండాల్సిన యూనిపాంలకు సంబంధించి తాజాగా కుట్టు ధరలను ఖరారు చేశారు. వీటికి అనుగుణంగా యూనిఫాంలు కుట్టడానికి వీలుగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.


స్కూల్‌ దుస్తుల కుట్టు కోసం ఆర్డర్‌ ఇచ్చిన తర్వాత నెలరోజుల అనంతరం ఈ యూనిఫాంలు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 27,79,497 మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున ఉచితంగా యూనిఫాంలను అందించాల్సి ఉంది. సాధారణంగా అయితే వేసవి సెలవుల్లోనే ఈ యూనిఫాంలకు అవసరమైన వస్త్రాన్ని టెస్కో ద్వారా కొనుగోలు చేసి, ఆయా జిల్లాలు, మండలాల వారీగా స్కూళ్ల కు అందించాలి. అయితే ఈ ఏడాది విద్యార్థుల యూనిఫాంలకు అవసరమైన వస్త్రం కొనుగోలు ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగింది. ఇప్పుడిప్పుడే ఈ వస్త్రం జిల్లాలకు చేరుతున్నది. ఈ నేపథ్యంలో యూనిఫాంలే కుట్టడానికి అయ్యే చార్జీలను తాజాగా ఖరారు చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యా శా ఖ డైరెక్టర్‌ దేవసేన ఆదేశాలిచ్చారు. పాఠ్య పుస్తకాల విషయంలోనూ అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికీ.పాఠశాలలకు అవసరమైన ఈ పుస్తకాలు పూర్తిగా వెళ్లలేదు. రాష్ట్రంలోని విద్యార్థులకు ఉచితంగా సరఫరా చేసేందుకు సుమారు 1.67 కోట్ల పుస్తకాలు అవసరం ఉంది. ఇప్పటి వరకు 40% మాత్రమే పుస్తకాలు పాఠశాలకు చేరిన ట్టు సమాచారం. ఇంకా 60% పుస్తకాలు పాఠశాలలకు వెళ్లలేదు. పుస్తకాల ముద్రణకు అవసరమైన కాగితం కొనుగోలు ప్రక్రియలో అధికారులు సకాలంలో నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ జాప్యం జరిగినట్టు తెలుస్తోంది.


ప్రైవేట్‌ విద్యార్థుల కోసం 1.22 కోట్ల పుస్తకాలు!

ప్రైవేట్‌ స్కూళ్లల్లో చదువుతున్న విద్యార్థుల కోసం 1.22 కోట్ల పుస్తకాల ముద్రణకు అనుమతి ఇచ్చారు. ఈ పుస్తకాలను 13 ప్రైవేట్‌ ముద్రణా సంస్థలు ముద్రించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నాయి. అయితే ఈ పుస్తకాలను నిర్ణయించిన గరిష్ఠ చిల్లర ధర(ఎంఆర్‌పీ) కంటే ఎక్కువకు విక్రయించకూడదని విద్యాశాఖ ఆదేశించింది. ఈ నెల 27వ తేదీ నుంచి ఈ పుస్తకాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు ప్రకటించారు. కాగా, పాఠ్యపుస్తకంలోని ప్రతి సబ్జెక్టు, ప్రతీ చాప్టర్‌కు సంబంధించి వేర్వేరు క్యూఆర్‌ కోడ్‌లను ముద్రించారు. విద్యార్థులు ఈ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా పాఠాన్ని వినడానికి, చూడటానికి (ఆడియో-వీడియో) అవకాశం ఉంటుందని అధికారులు ప్రకటించారు. 

Updated Date - 2022-06-25T17:21:47+05:30 IST