కొందరికే కానుక!

ABN , First Publish Date - 2021-03-02T05:33:33+05:30 IST

‘పేద విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించాం. ఏ ప్రభుత్వమూ ఇవ్వని విధంగా అన్నిరకాల విద్యా సామగ్రితో జగనన్న విద్యాకానుక కిట్లు అందించాం’...అని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. కానీ తరగతులు ప్రారంభమై నెలలు గడుస్తున్నా జిల్లాలో ఇంకా 18

కొందరికే కానుక!
జగనన్న విద్యాకానుక కిట్లు




అరకొరగా విద్యాకానుక కిట్ల పంపిణీ

ఇంకా 18 వేల మంది విద్యార్థులకు అందని వైనం

ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా చేరిన వారికి మొండిచేయి

(ఇచ్ఛాపురం రూరల్‌)

‘పేద విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించాం. ఏ ప్రభుత్వమూ ఇవ్వని విధంగా అన్నిరకాల విద్యా సామగ్రితో జగనన్న విద్యాకానుక కిట్లు అందించాం’...అని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. కానీ తరగతులు ప్రారంభమై నెలలు గడుస్తున్నా జిల్లాలో ఇంకా 18 వేల మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు అందలేదు. దీంతో విద్యార్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. అదిగో ఇదిగో అంటూ విద్యాశాఖ అధికారులు కాలయాపన చేస్తూ వస్తున్నారు. అక్టోబరు 8న సీఎం జగన్‌ కిట్ల పంపిణీని ప్రారంభించారు. ఒకటి నుంచి పదో తరగతి చదివే ప్రతి విద్యార్థికి మూడు జతల ఏకరూప దుస్తులు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, ఒక బెల్ట్‌, పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలు, ఒక బ్యాగు కిట్‌గా అందజేశారు. గత ఏడాది విద్యార్థుల సంఖ్య ఆధారంగా కిట్లను సరఫరా చేయడంతో కొత్తగా చేరిన విద్యార్థులకు కానుకలు అందని పరిస్థితి నెలకొంది. 

పిల్లల సంఖ్య పెరగడంతో

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారఽంభమైంది.  నవంబరులో 9, 10 తరగతులను ప్రారంభించగా... డిసెంబరులో 6, 7, 8 తరగతులను ప్రారంభించారు. ఫిబ్రవరి 1 నుంచి ప్రాథమిక పాఠశాలలు పునఃప్రారంభం కాకముందే జిల్లాలోని ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్న అనేక మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టడం, నాడు- నేడు పథకంతో పాఠశాలలను ఆధునికీకరించడం, ఆన్‌లైన్‌ తరగతుల పేరిట ప్రైవేటు పాఠశాలల దోపిడీ నుంచి తప్పించుకునేందుకు వారు ఈ బాట పట్టారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీనికి గత ఏడాది చైల్డ్‌ ఇన్‌ఫోలో విద్యార్థుల సంఖ్యను ఆధారంగా తీసుకుంది.  గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు 2.48 లక్షల మంది ఉండగా... ఈ ఏడాది అదనంగా మరి కొంత మంది చేరే అవకాశం ఉన్న దృష్ట్యా 2,49,405 కిట్లను ప్రభుత్వం జిల్లాకు సరఫరా చేసింది. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి 18 వేల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్లు లెక్క తేలింది. వీరందరికీ విద్యాకానుక కిట్లు అందక ఇబ్బంది పడుతున్నారు.  


-ఇచ్ఛాపురం మండలం ఈదుపురం(ఆర్‌) ప్రాథమిక పాఠశాలలో గత ఏడాది 254 మంది విద్యార్థులు చదువుకున్నారు. ఈ ఏడాది ప్రైవేట్‌ పాఠశాలల నుంచి 45 మంది విద్యార్థులు కొత్తగా చేరారు. వీరికి ఇంతవరకూ విద్యాకానుక కిట్లు అందించలేదు.  దీంతో తల్లిదండ్రులు సొంత ఖర్చుతో పుస్తకాలు, ఇతర సామగ్రి కొనుగోలు చేయాల్సి వచ్చింది.

- రత్తకన్న ప్రాథమిక పాఠశాలలో గత ఏడాది 198 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది 56 మంది కొత్తగా చేరారు. కానీ వీరికి ఇంతవరకూ విద్యాకానుక కిట్లు అందించలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అందరికీ కిట్లు అందజేయాలని తల్లిదండ్రులు ఉపాధ్యాయులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.


ప్రభుత్వానికి నివేదించాం

కొంతమంది విద్యార్థులకు విద్యాకానుక కిట్లు అందకపోవడం వాస్తవమే. ఈ ఏడాది కొత్తగా విద్యార్థులు చేరారు. వారికి కిట్లు అందించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. వచ్చిన వెంటనే అందిస్తాం. 

-డి.మోహనరావు, సీఎంవో, ఎస్‌ఎస్‌ఏ





Updated Date - 2021-03-02T05:33:33+05:30 IST