ఆసిఫాబాద్‌లో మనిషికి ఐదు కిలోల చౌక బియ్యమే పంపిణీ

ABN , First Publish Date - 2022-06-27T04:25:17+05:30 IST

పేదలను ఆదుకోవడానికి ప్రతీనెల పంపిణీ చేసే రేషన్‌బియ్యం నెలకో తీరుగా ఉండ డంతో అర్హులైన పేదలు ఇబ్బందులు పడుతున్నారు.

ఆసిఫాబాద్‌లో మనిషికి ఐదు కిలోల చౌక బియ్యమే పంపిణీ

- అందేది సగమే, మరో సగం ఎగనామం

- కేంద్రం కోటా ఇస్తే, రాష్ట్ర కోటా ఇవ్వని వైనం

కాగజ్‌నగర్‌ టౌన్‌, జూన్‌ 26: పేదలను ఆదుకోవడానికి ప్రతీనెల పంపిణీ చేసే రేషన్‌బియ్యం నెలకో తీరుగా ఉండ డంతో అర్హులైన పేదలు ఇబ్బందులు పడుతున్నారు. రేషన్‌కార్డు దారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీనెల అందిచాల్సిన బియ్యంలో కోత విధిస్తున్నారు. కరోనా సమయం నుంచి కేంద్రప్రభుత్వం ఒక్కరికి 5కిలోల చొప్పున బియ్యం పంపిణీ ఉచితంగా చేపడుతోంది. ఈ పంపిణీని పొడిగిస్తూ వస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల ఒక్కో లబ్ధిదారుడికి 5కిలోల చొప్పున రూ.1కిలో బియ్యం అందిస్తుండేది. అయితే కొద్దినెలలుగా కేవలం ఒక్కరికి 5కిలోలు అందుతున్నాయి. ఈ బియ్యం ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వ రూ.1కిలో బియ్యం అయితే మరోసారి కేంద్రం ఇచ్చేవి ఇస్తున్నారు. గత కరోనా కష్ట కాలంలో రెండేళ్లపాటు పేద కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్కరికి 10కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేశాయి. ప్రస్తుతం కేవలం 5కిలోలు ఇస్తుండడంతో ప్రజలకు అయోమయంగా మారింది. మార్చి నెల తర్వాత కేంద్ర ప్రభుత్వం పథకాన్ని సెప్టెంబర్‌ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. జిల్లా అంతటా కూడా మేనెలలో కేవలం రాష్ట్ర ప్రభుత్వ బియ్యం పంపిణీ చేశారు. జూన్‌ నెలలో ఉచితంగా కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం పంపిణీ చేశారు. ఈనెలలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం ఇంకా అందలేదు. అన్ని జిల్లాలో పంపిణీ చేసినా ఆసిఫాబాద్‌ జిల్లాలో మాత్రం ఇంతవరకు రూ.1 కిలో బియ్యం పంపిణీ చేయలేదు. దీంతో గడువు ముగుస్తున్నందున ఈనెల 19న డీలర్లు ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో డీలర్లు పంపిణీ చేయడం లేదు.

రాష్ట్ర సర్కార్‌ బియ్యం ఎగనామం..

ప్రతీనెల రాష్ట్ర ప్రభుత్వం ఏదోవిధంగా జిల్లాలో బియ్యం పంపిణీ చేయకుండా ఎగనామం పెడుతోందని ఆరోపణలు వస్తున్నాయి. గత నెలలో రూ.1కిలో బియ్యం ఇచ్చి కేంద్ర నుంచి వచ్చే ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన బియ్యం పంపిణీ చేయలేదు. ఈనెలలో పీఎంజీకేవై ఉచిత బియ్యం పంపిణీ చేసి రాష్ట్రసర్కార్‌ ఇచ్చేవాటికి ఎగనామం పెడుతున్నారంటూ వినియోగదారులు పేర్కొంటున్నారు. ప్రతీనెల ఎంఎల్‌ఎస్‌(మండల్‌ లెవల్‌ స్టాక్‌) పాయింట్లకు బియ్యం ఆలస్యంగా వస్తుండడంతో గడువు తేదీకి పంపిణీ చేయలేకపోతున్నారు. దీంతో కార్డుదారులు బియ్యం కోసం ఎదురు చూస్తున్నారు. రూ.1కిలో బియ్యంపై ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని డీలర్లు పేర్కొన్నారు. కాగజ్‌నగర్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి ఆయా దుకాణాలకు బియ్యం సరఫరా జరిగిందని, అయినా ఆదేశాల్విడంలో తాత్సారం చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. గత రెండు నెలలుగా ఈవిధమైన నిర్లక్ష్యం జరుగుతున్నప్పటికీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. పోషకాహార బియ్యం సరఫరా జిల్లాకు సక్రమంగా జరగకపోవడంతోనే ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. 

================

జిల్లా వివరాలు

మండలాలు..15

పంచాయతీలు..335

చౌక ధరల దుకాణాలు..278

మొత్తం ఆహార భద్రత కార్డులు..1,37,308

అంత్యోదయ కార్డులు..13,024

========================

రేషన్‌ బియ్యం జిల్లా వ్యాప్తంగా దాదాపు రెండు లక్షలపైగా మందికి చేరుతాయి. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఒక్కో కార్డుకు కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి ఒకొక్కరికి 6కిలోలు రాష్ట్రం, కేంద్రం నుంచి వచ్చే 5కిలోలు మొత్తం 11అందాలి. ఈ పథకం కింద అక్టోబరు వరకు కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పోషకాహార బియ్యం దూర ప్రాంత జిల్లాల నుంచి రావడంలో ఇబ్బంది వల్లనే ఇలా జరుగుతోందని అంటున్నారు. దీంతో జిల్లాలో ప్రజా పంపిణీ పథకం సజావుగా సాగడం లేదని ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా ప్రతీనెల బియ్యం కోటా సరైన తేదీలోగా అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

అన్ని షాపులకు సరఫరా చేశాం.. 

- లక్ష్మణ్‌, ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జి, కాగజ్‌నగర్‌

కాగజ్‌నగర్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు 1500టన్నుల బియ్యం సరఫరా ఉంటుంది. ఇప్పటికే బియ్యం అన్ని షాపులకు సరఫరా చేశాం. ఈనెల18 వరకు కొంత మంది లబ్ధిదారులకు పంపిణీ కూడా జరిగింది. ప్రతీనెల 20వ తేదీలోగా 6కిలోల పోషకాహార బియ్యం పంపిణీ కావాలి. 20నుంచి 27వరకు మరో పథకం కింద 5కిలోలు పంపిణీ ఉంటుంది. స్టాకు లేకపోవడంతో గత నెలలో మిగిలి ఉన్న స్టాకును ఈనెల 18 వరకు కొంతమందికి పంపిణీ చేశారు. దీంతో తిరిగి గడువు పెంచాలని ఈనెల 19న డీలర్లు ఉన్నతాధికారులను కోరారు. భూపాలపల్లి జిల్లా నుంచి రావాల్సిన పోషకాహార బియ్యం సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Updated Date - 2022-06-27T04:25:17+05:30 IST