ప్రలోభాల పర్వం..!

ABN , First Publish Date - 2021-03-09T05:59:12+05:30 IST

జిల్లాలో ఎన్నికలు జరిగే 136 డివిజన్లు/వార్డుల్లో 562 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బరిలో ఎందరు ఉన్నా.. అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అభ్యర్థుల మధ్య నువ్వా.. నేనా అన్నట్లుగా పోటీ ఉంది. ఎర్రగుంట్ల, జమ్మలమడుగు పట్టణాల్లో మాత్రం అధికార పార్టీ అభ్యర్థులను బీజేపీ అభ్యర్థులు బలంగా ఢీ కొడుతున్నారు.

ప్రలోభాల పర్వం..!

ముగిసిన ప్రచారం

మిగిలిన గడువు 24 గంటలే

ఓటర్లను ఆకట్టుకోవడానికి రాజకీయ ఎత్తులు

ఓటుకు రూ.500-1,000 పంపిణీ..?

ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం భారీగా ఖర్చు


పురపోరులో కీలక ఘట్టం ప్రచార పర్వం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అభ్యర్థుల ఇంటింటి ప్రచారం, మైకులు, వాహనాలకు బ్రేకులు పడ్డాయి. మిగిలిన సమయం 24 గంటలే. ఇప్పటి వరకు నన్ను గెలిపిస్తే అభివృద్ధి చేస్తా.. అందుబాటులో ఉంటా.. స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడుతానంటూ ఓటర్లను ఆకట్టుకోవడానికి హామీలతో ముంచెత్తారు. మిగిలిన ఈ సమయం అభ్యర్థులకు ఎంతో కీలకం. హామీలకు ఓట్లు వేయరనే భయంతో ప్రలోభాలకు దిగుతున్నారు. పోటాపోటీగా ఓటుకు రేటు కట్టి నోట్ల పంపిణీకి సై అంటున్నారు. నిఘా కళ్లకు దొరక్కకుండా మద్యం, నగదు పంపకాలు చేస్తున్నట్లు సమాచారం.


(కడప - ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎన్నికలు జరిగే 136 డివిజన్లు/వార్డుల్లో 562 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బరిలో ఎందరు ఉన్నా.. అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అభ్యర్థుల మధ్య నువ్వా.. నేనా అన్నట్లుగా పోటీ ఉంది. ఎర్రగుంట్ల, జమ్మలమడుగు పట్టణాల్లో మాత్రం అధికార పార్టీ అభ్యర్థులను బీజేపీ అభ్యర్థులు బలంగా ఢీ కొడుతున్నారు. మైదుకూరు, బద్వేలు, ప్రొద్దుటూరు పట్టణాల్లో టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో వైసీపీ అభ్యర్థుల గుండెల్లో దడ మొదలైంది. బయటికి గెలుపు మాదే..! అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నా లోలోనా భయాందోళన ఉండడంతో ఓట్ల కొనుగోలుకు భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓటుకు రూ.500 నుంచి రూ.1,000 వరకు పంచుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా పోలీసుల నిఘాకు దొరక్కుండా రాత్రి పూట పంపకాలు చేస్తున్నారు. కుల సంఘాలు, పెద్దపెద్ద కుటుంబాలను గుర్తించి వారివద్దకు వెళ్లి తమకు ఓటు వేస్తే ఎంత కావాలో తేల్చండని బేరాలు పెడుతున్నారు. కడప నగరంలో 14 డివిజన్లలో టీడీపీ పోటీలో ఉంది. అధికార పార్టీకి ఏ మాత్రం తీసిపోకుండా ప్రచారంలో.. ఇతర కార్యక్రమాల్లో ఢీ అంటే ఢీ అంటున్నారు. దీంతో గెలుపే లక్ష్యంగా కడప నగరంలో పలు డివిజన్లలో సోమవారం రాత్రి ఓటుకు రూ.1000 చొప్పున ఇరుపక్షాలూ పంపిణీ చేసినట్లు తెలిసింది. టీడీపీతో పాటు వైసీపీ రెబల్స్‌ బరిలో ఉన్న డివిజన్లలో వివిధ సంఘాలను గుర్తించి గంపగుత్తగా ఓట్లు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం.


పోటాపోటీగా..

- బద్వేలులో 25 వార్డుల్లో ఎన్నికలు జరుగుతుండగా 85 మందిలో బరిలో ఉన్నారు. చివర్లో టీడీపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓటుకు రేటు భారీగా పెరిగింది. కొన్ని వార్డుల్లో ఓటుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు పంపిణీ చేస్తున్నారు. పది ఓట్లు పైగా ఉండే కుటుంబాలకు రూ.10 వేలకుపైగా ప్యాకేజీ, కుక్కర్లు కూడా పంపిణీ చేసినట్లు తెలిసింది. 

- జమ్మలమడుగు మున్సిపాలిటీలో ఎన్నికలు జరిగే 18 వార్డుల్లో 61 మంది పోటీలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ బరిలో లేదు. బీజేపీ అభ్యర్థులు వైసీపీ అభ్యర్థులను బలంగా ఢీకొడుతున్నారు. దీంతో గెలుపు కోసం ప్రలోభాలకు తెరతీస్తున్నారు. రాత్రి ఇంటింటికి వెళ్లి చీరలు పంపిణీ చేసినట్లు తెలిసింది. పోలీసులు చూసినా చూడనట్టు ఉండటం విమర్శలకు తావిస్తోంది. చీరలతో పాటు ఓటుకు రూ.1,500 పంపిణీ చేసినట్లు సమాచారం. పోటాపోటీగా డబ్బు పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. 

- మైదుకూరు మున్సిపాలిటీలో ఎన్నికలు జరిగే 24 వార్డుల్లో 147 మంది బరిలో ఉన్నారు. వైసీపీ, టీడీపీ అభ్యర్థులు నువ్వా.. నేనా అంటూ తలపడుతున్నారు. దీంతో ప్రచారం ముగిసిన తరువాత ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రలోభాలకు శ్రీకారం చుట్టారు. ఓటుకు రూ.వెయ్యి పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. 

- ఎర్రగుంట్లలో 7 వార్డులకు 29 మంది పోటీలో ఉన్నారు. ఇక్కడ కూడా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఓటుకు రూ.వెయ్యి రేటు కట్టారని తెలుస్తోంది. 

- ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 32 వార్డులకు పోలింగ్‌ జరగనుంది. 133 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ప్రచారంతో హోరెత్తించిన అభ్యర్థులు, నాయకులు చివరి ప్రయత్నంగా రూ.500 నుంచి రూ.1000 వరకు పంపిణీ చేసినట్లు సమాచారం. కీలక అభ్యర్థులు ఉన్న వార్డుల్లో రూ.5 వేల వరకు పంపకాలు చేసినట్లు తెలిసింది. డబ్బుతో పాటు ముక్కపుడకలు, చీరలు కూడా పంపిణీ చేశారని సమాచారం. రాయచోటిలో ఎన్నికలు జరిగే మూడు వార్డుల్లో కూడా ప్రలోభాలకు తెరతీసినట్లు సమాచారం.

Updated Date - 2021-03-09T05:59:12+05:30 IST