దేవుడా!

ABN , First Publish Date - 2022-05-27T06:27:16+05:30 IST

విస్తుపోయే నిర్ణయాలు తీసుకోవడంలో దేవదాయ శాఖ అధికారులను మించినవారు లేరు.

దేవుడా!

లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారికి జిల్లా ఇన్‌చార్జి బాధ్యతలు

దేవదాయ శాఖ అధికారుల వింత నిర్ణయాలు

అనకాపల్లి జిల్లా దేవదాయ శాఖ అధికారిగా పీఎస్‌ఎన్‌ మూర్తి

తెర వెనుక మంత్రాంగం

రెండు నెలల్లో మూడో అధికారి

గతంలో ఏసీబీ దొరికిన మూర్తి


(విశాఖఫట్నం, అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

విస్తుపోయే నిర్ణయాలు తీసుకోవడంలో దేవదాయ శాఖ అధికారులను మించినవారు లేరు. అవినీతిపరులకు అగ్రాసనం వేయడంలో వారికి వారే సాటి. అసలు విషయానికి వస్తే...అనకాపల్లి జిల్లాగా ఏర్పాటై 

ఇంకా రెండు నెలలు కూడా పూర్తికాక ముందే 

దేవదాయ శాఖ అధికారిగా ఇద్దరిని మార్చేసి మూడో వ్యక్తిని నియమించారు. ఆలస్యంగానైనా అందరి మన్ననలు పొందే అధికారిని వేశారా? అంటే...అడ్డగోలుగా లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన వ్యక్తికి ఏకంగా జిల్లా బాధ్యతలనే అప్పగించారు. ఇందుకు ఆ శాఖ ఉన్నతాధికారుల అండతో పాటు జిల్లా రాజకీయ నేతల సహకారం కూడా వుందని విశ్వసనీయ సమాచారం.

ఇదీ చరిత్ర

దేవదాయ శాఖలో పి.సత్యనారాయణమూర్తి (పీఎస్‌ఎన్‌ మూర్తి) గ్రేడ్‌-1 ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌. ప్రస్తుతం మునగపాకలోని పాలేశ్వర భీమలింగేశ్వర గ్రూపు ఆలయాల ఈఓగా పనిచేస్తున్నారు. ఇంకా వీటితో పాటు అదనంగా తగరపువలస దగ్గరున్న సంగివలస గ్రూపు ఆలయాల ఈఓగా, పెందుర్తి వెంకట్రాది ఈఓగా, కేజీహెచ్‌ సమీపానున్న బెల్లం వినాయకుడి (బుచ్చిరామలింగేశ్వర స్వామి) ఆలయ ఈఓగా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు తాజాగా అనకాపల్లి జిల్లా దేవదాయ శాఖ అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

జిల్లాకు పట్టిన గతి

ఏప్రిల్‌ 4వ తేదీన అనకాపల్లి కొత్త జిల్లాగా ఏర్పాటైంది. స్థానికంగా ఉంటూ ప్రజల సమస్యలు తీర్చడానికి, పరిపాలన సక్రమంగా సాగడానికి ఈ జిల్లాలకు ఇన్‌చార్జులను 

నియమించకుండా పూర్తిస్థాయి అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. దానిని దేవదాయ శాఖ అధికారులు తుంగలో తొక్కి విశాఖపట్నం జిల్లా ఏసీ కాళింగిరి శాంతికి అనకాపల్లి జిల్లా బాధ్యతలు కూడా అప్పగించారు. ప్రతి సోమవారం అన్ని జిల్లాల్లో స్పందన కార్యక్రమం జరుగుతుంది. ఆమె ఇక్కడ విశాఖలో హాజరైతే...అనకాపల్లిలో గైర్హాజరు కావాలి. దీనిపై విమర్శలు చెలరేగడంతో రెండు వారాల క్రితం అనకాపల్లి జిల్లా దేవదాయ శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఎస్‌.రాజారావుకు జిల్లా అధికారిగా బాధ్యతలు అప్పగించారు. అయితే సదరు రాజారావు ఉత్తర్వులు వెలువడిన నాటికి సెలవులో ఉన్నారు. తనకు ఇచ్చిన అదనపు బాధ్యతలు (జిల్లా దేవదాయ శాఖ అధికారి) నిర్వహించలేనని, తనను సూపరింటెండెంట్‌గానే కొనసాగించాలని కోరుతూ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. దాంతో కాళింగిరి శాంతి ఇంకా అక్కడ ఏసీగా కొనసాగుతున్నారు. ఆమె విశాఖలో ఉండడం, సూపరింటెండెంట్‌ సెలవులో ఉండడంతో పరిపాలన సరిగా సాగడం లేదని మరొకరికి అక్కడ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. అటు ఇటు చూసి మునగపాక గ్రూపు ఆలయాల ఈఓ పీఎస్‌న్‌మూర్తికి పూర్తి అదనపు బాధ్యతలు ఇస్తూ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. ఆ విషయం తెలియగానే ఒక్కసారిగా ఆ శాఖతో పాటు ఇటు విశాఖ, అటు అనకాపల్లి జిల్లాలో విమర్శలు వెల్లువెత్తాయి. రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన వ్యక్తికి జిల్లా అధికారిగా బాధ్యతలు ఇస్తారా? అంటూ ఆ జిల్లా నాయకులు ప్రశ్నిస్తున్నారు.

రూ1.6 లక్షల బిల్లుకు రూ.50 వేల లంచం

పీఎస్‌ఎన్‌ మూర్తి 2016లో పెదవాల్తేరు కరక చెట్టు పోలమాంబ ఆలయ ఈఓగా, సీతమ్మధార షిర్డీ సాయి ఆలయ ఈఓగా పనిచేసేవారు. ఆ ఏడాది సాయిబాబా ఆలయ వార్షికోత్సవం నిర్వహించినప్పుడు విద్యుద్దీపాలు అలంకరించిన కాంట్రాక్టర్‌కు రూ.1.6 లక్షల బిల్లు చెల్లించాల్సి వచ్చింది. ఆ మొత్తం ఇవ్వడానికి రూ.50 వేలు లంచం డిమాండ్‌ చేశారు. అలా ఇస్తే కరక చెట్టు పోలమాంబ ఆలయం కాంట్రాక్ట్‌ కూడా ఇస్తానని ఆశ చూపించారు. అయితే లంచంగా చెక్‌ స్వీకరించారు. ఆ సమయంలో డీమోనటైజేషన్‌ కారణంగా దానిని మార్చుకోవడం వీలు కాలేదు. దానిని వెనక్కి తీసుకొని అన్నీ రూ.2 వేల నోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంత మొత్తం ఒక్కసారి ఇవ్వలేనని, ముందు రూ.30 వేలు ఇస్తానని కాంట్రాక్టర్‌ చెప్పారు. ఈఓ తీరుకు విసిగిపోయి ఆయన ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సీతమ్మధార షిర్డీ సాయి ఆలయంలో రూ.30 వేలు  లంచం తీసుకుంటుండగా పీఎస్‌ఎన్‌ మూర్తిని ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తరువాత దేవదాయ శాఖ అధికారులు సస్పెండ్‌ చేశారు. కొన్నాళ్లకు మళ్లీ పోస్టింగ్‌ ఇచ్చారు. ఇలా లంచాలు తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన వారికి కీలకమైన పోస్టు కాకుండా నాన్‌ ఫోకల్‌ (అప్రాధాన్య) బాధ్యతలు అప్పగిస్తారు. ఆ విధంగానే మునగపాక ఆలయాలకు వేశారు. అయితే ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకొని, సంగివలస గ్రూపునకు, పెందుర్తి వెంకట్రాదికి అదనపు బాధ్యతలు వేయించుకున్నారు. సుమారుగా రెండు నెలల క్రితం బెల్లం వినాయకుడి ఆలయం వివాదం చెలరేగగా, విశాఖ ఉన్నతాధికారులు ఏరికోరి ఈయనకే ఆ ఆలయం బాధ్యతలు కూడా అప్పగించారు. ఇప్పుడు ఏకంగా జిల్లా అధికారి బాధ్యతలు అప్పగించారు.  

ఉత్తర్వుల్లో మెలిక

పీఎస్‌ఎన్‌ మూర్తిని జిల్లా అధికారిగా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రస్తుత అధికారి ఎస్‌.రాజారావు నుంచి బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. వాస్తవానికి ఆయన జిల్లా అధికారిగా లేరు. ఇంకా కాళింగిరి శాంతినే ఉన్నారు. ఇప్పుడు కొత్త ఉత్తర్వులు వస్తే తప్ప మూర్తి అక్కడికి వెళ్లడానికి లేదు.  


Updated Date - 2022-05-27T06:27:16+05:30 IST