ముడుపుల బది‘లీల’లు

ABN , First Publish Date - 2022-07-04T08:09:33+05:30 IST

ముడుపుల బది‘లీల’లు

ముడుపుల బది‘లీల’లు

నేత సిఫారసులకూ ప్రాధాన్యం

అనర్హులకు, అయిన వారికి అందలం

జిల్లాస్థాయి పోస్టు.. తక్కువస్థాయి అధికారికి

బదిలీల్లో ఓ సామాజికవర్గ అధికారులకు పెద్దపీట

ఓవైపు సామాజిక కోణం.. మరోవైపు భారీ ముడుపులు

సీఎంవోలో ఓ అధికారి, శాఖ ఉన్నతాధికారి అండదండలతో.. పశుసంవర్ధక శాఖలో చక్రం తిప్పిన అధికారి


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ముడుపులిస్తే చాలు.. లేదంటే సిఫారసులైనా ఉండాలి. అంతే.. కోరుకున్నచోటుకు బదిలీ అయిపోవచ్చు. ఇదీ.. పశుసంవర్ధకశాఖలో ఉద్యోగుల బదిలీల తంతు. బదిలీలు, పోస్టింగుల్లో ఓ కీలక అధికారి హవా సాగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన ఉద్యోగులను బదిలీ చేయాల్సి ఉండగా, కొందరికి మినహాయింపు ఇచ్చారు. కొందరికి కోరిన చోటికి బదిలీ చేయగా, అర్హత లేని అధికారులకు కూడా అందలమెక్కించారు. ఉద్యోగుల బదిలీల్లో ఓ వైపు సామాజిక కోణం, మరో వైపు ముడుపులకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఓ అధికారి అండదండలు, ఈ శాఖ లో ఉన్నతాధికారి సహకారం మెండుగా ఉన్న కీలక అధికారి.. ఒకే సామాజిక వర్గ అధికారులకు ప్రాధాన్య పోస్టులు ఇవ్వగా, సంబంధిత మంత్రి కార్యాలయ అధికారి తమ అనుకూల వర్గానికి చెందిన ఉద్యోగులు కోరుకున్న చోట పోస్టింగులు ఇప్పించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకో వైపు బదిలీల్లో ప్రధాన కార్యాలయంలోని ఓ ఉద్యోగి ప్రాధాన్య పోస్టింగుల కోసం పలువురు ఉద్యోగుల నుంచి పెద్ద మొత్తాల్లో వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి బదిలీల ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తే పెద్ద మొత్తాల్లో నగదు చేతులు మారినట్లు స్పష్టమవుతోంది. ప్రాధాన్య పోస్టులు ఇప్పించుకోవడంలో చక్రం తిప్పిన అధికారులపైన, తమకు అన్యాయం చేసిన కీలక అధికారిపైనా కొందరు అధికారులు సీఎం కార్యాలయ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. 


అనంతలో అనర్హునికి అందలం

అనంతపురం జిల్లాలో పశుసంవర్ధకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయి పోస్టు ఖాళీగా ఉంది. జిల్లాల పునర్వవస్థీకరణలో జిల్లా పశుసంవర్ధకశాఖ జేడీని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారిగా పరిగణిస్తున్నారు. ఈ పోస్టు లో జేడీ స్థాయి అధికారినే నియమించాల్సి ఉంది. కనీసం డిప్యూటీ డైరెక్టర్‌ స్థాయి అధికారికి ఇన్‌చార్జి బాధ్యతలు ఇవ్వొచ్చు. కానీ డీడీ స్థాయి అధికారులు ముగ్గురు సీనియర్లు ఉన్నా.. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ స్థాయి ఉద్యోగికి జిల్లా పశుసంవర్ధక అధికారిగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇదే జిల్లాలో గతంలో పని చేసిన జేడీ స్థాయి అధికారి ప్రధాన కార్యాలయానికి వచ్చేయడంతో.. అక్కడ ముగ్గురు డీడీ స్థాయి అధికారులున్నా.. ఒక ఏడీకి జిల్లా అధికారిగా పోస్టింగ్‌ ఇచ్చారు. ఈ పోస్టు జూనియర్‌కు ఇవ్వడం విమర్శలకు దారితీస్తోంది. ఈ జిల్లాలోని పలువురు డీడీ స్థాయి అధికారులను వారు పక్క జిల్లాలో అడగని స్థానాలకు పంపి, ఒక అధికారితో సెలవు పెట్టించి, హెడ్‌ఆఫీ్‌సలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్తున్నారు. ఇదే జిల్లాలో ఓ ఏడీని డీడీ పోస్టులో నియమించారు. చిత్తూరులో పని చేయాల్సిన ఏడీ స్థాయి అధికారిని తిరుపతి డీడీ కార్యాలయానికి మార్చి, ఇతర సిబ్బందిని చిత్తూరులోనే కొనసాగిస్తున్నారు.  కడపలోని వెటర్నరీ శిక్షణ  కేంద్రంలో పని చేస్తున్న అధికారి ఆ పోస్టులోకి వచ్చి ఏడాది కూడా కాకుండా సుదూర ప్రాంతానికి బదిలీ చేశారు. తగిన విద్యార్హత లేని ఉద్యోగికి శిక్షణ కేంద్రంలో పోస్టింగ్‌ ఇచ్చారు. పశుసంవర్ధకశాఖ డైరెక్టరేట్‌లో పని చేస్తున్న ఒక అధికారిని బదిలీ చేసినట్లు చూపి, తిరిగి డిప్యుటేషన్‌ పేరుతో పాత స్థానంలోనే కొనసాగిస్తున్నారు. కింది స్థాయి ఉద్యోగుల బదిలీల్లో స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫారసులే కీలకమయ్యాయి. క్షేత్రస్థాయి ఉద్యోగులు కొందరు అధికార పార్టీ నేతలకు ముడుపులు సమర్పించుకుని, సిఫారసులతో కోరుకున్న చోటికి పోస్టింగ్‌లు తెచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్ని జిల్లాల్లో ఇదేరకమైన బదిలీల తంతు సాగినట్లు తెలుస్తోంది.   


సిత్రాలెన్నెన్నో!

జిల్లాల పునర్విభజనలో కృష్ణా జిల్లా కేంద్రంగా ఉన్న మచిలీపట్నంలో పాత జిల్లా లెక్కలో జేడీ స్థాయి అధికారి ఉండాల్సి ఉండగా, ఎన్టీఆర్‌ జిల్లా కేంద్రం విజయవాడలో డీడీ స్థాయి అధికారి ఉండాల్సి ఉంది. కానీ  జేడీ స్థాయి అధికారిని ఎన్టీఆర్‌ జిల్లాకు, డీడీ స్థాయి అధికారిని కృష్ణా జిల్లాకు నియమించినట్లు చెప్తున్నారు. అడ్డగోలు బదిలీల విషయంలో అసలు బీజం ఇక్కడే పడిందని అంటున్నారు. జిల్లాల పునర్విభజనలో కొత్త జిల్లాల్లో అనుకూల అధికారుల నియామకానికే కీలక అధికారి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పశుసంవర్ధకశాఖలో ఉద్యోగులకు డిప్యుటేషన్లు లేవంటూనే.. అనుకూలురైన వారికే డిప్యుటేషన్లు ఇస్తున్నారని క్షేత్రస్థాయి ఉద్యోగులు చెప్తున్నారు. 

Updated Date - 2022-07-04T08:09:33+05:30 IST