పెద్దకాపర్తి ఉపసర్పంచ్‌పై నెగ్గ్గిన అవిశ్వాసం

ABN , First Publish Date - 2021-09-17T06:12:24+05:30 IST

: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి ఉప సర్పంచ్‌పై వార్డు సభ్యుల అవిశ్వాసం నెగ్గింది. ఉపసర్పంచ్‌పై ఏడుగురు వార్డు సభ్యులు ఆర్‌డీఓ జగదీశ్వర్‌రెడ్డికి గత నెలలో అవిశ్వాస తీర్మాన ప్రతిని అందజేశారు. దీంతో ఆయన సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులకు నోటీసులు జారీ చేశారు. ఈమేరకు చిట్యాల గ్రామపంచాయతీ కార్యాల యంలో అవిశ్వాస తీర్మానంపై ఆర్డీవో గురువారం ఓటింగ్‌ నిర్వహించారు.

పెద్దకాపర్తి ఉపసర్పంచ్‌పై నెగ్గ్గిన అవిశ్వాసం
పెద్దకాపర్తిలో ఉపసర్పంచ్‌పై ఓటింగ్‌ నిర్వహిస్తున్న ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి

ఎన్నిక తేదీని త్వరలో ప్రకటిస్తాం: ఆర్‌డీఓ జగదీశ్వర్‌రెడ్డి

చిట్యాల రూరల్‌, సెప్టెంబరు 16: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి ఉప సర్పంచ్‌పై వార్డు సభ్యుల అవిశ్వాసం నెగ్గింది.  ఉపసర్పంచ్‌పై ఏడుగురు వార్డు సభ్యులు ఆర్‌డీఓ జగదీశ్వర్‌రెడ్డికి గత నెలలో అవిశ్వాస తీర్మాన ప్రతిని అందజేశారు. దీంతో ఆయన సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులకు నోటీసులు జారీ చేశారు. ఈమేరకు చిట్యాల గ్రామపంచాయతీ కార్యాల యంలో  అవిశ్వాస తీర్మానంపై  ఆర్డీవో గురువారం ఓటింగ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్‌ మర్రి జలంధర్‌రెడ్డి, 10మంది వార్డు సభ్యులు హాజరయ్యారు. ఉపసర్పంచ్‌ పొట్లపల్లి చిన్నస్వామి, మరో వార్డు సభ్యుడు గైర్హాజరయ్యారు.  అవిశ్వాసానికి  టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వార్డు సభ్యులందరూ మద్దతు పలుకగా, సర్పంచ్‌ తటస్థంగా ఉన్నారు. అవిశ్వాసానికి 10మంది మద్దతు తెలపడంతో అవిశ్వాసం నెగ్గిందని, ఉపసర్పంచ్‌గా చిన్నస్వామి పదవిని కోల్పోయారని, ఆయన స్థానంలో మరొకరిని ఎన్నుకునేందుకు తేదీని త్వరలో ప్రకటిస్తామని ఆర్‌డీఓ తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. నార్కట్‌పల్లి సీఐ శంకర్‌రెడ్డి, చిట్యాల, నార్కట్‌పల్లి ఎస్‌ఐలు రావుల నాగరాజు, భీమనమోని యాదయ్య, 20మంది  పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సమావేశంలో తహసీల్దార్‌ మాలి కృష్ణారెడ్డి, ఎంపీఓ పద్మ, పంచాయతీ కార్యదర్శి కంచర్ల గౌతమ్‌ పాల్గొన్నారు.

చెరుకుపల్లి సర్పంచ్‌ బాధ్యతలు ఉప సర్పంచ్‌కు 

ఆదేశాలు జారీ చేసిన నల్లగొండ జిల్లా కలెక్టర్‌

కేతేపల్లి: ముగ్గురు పిల్లలు ఉన్నారనే కారణంతో సస్పెండైన నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లి సర్పంచ్‌ స్థానంలో  ఉప సర్పంచ్‌ వల్దాసు లక్ష్మమ్మకు అధికార బాధ్యతలు అప్పగించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ గురువారం ఆదేశాలు జారీ చేశారు. సకాలంలో గ్రామసభ నిర్వహించకపోవడం, నిధుల దుర్వినియోగం అభియోగాలపై గత ఏడాదికోమారు కలెక్టర్‌ ఆయనను సస్పెండ్‌ చేశారు. దీంతో ప్రసాద్‌ కోర్టు ద్వారా పునర్నియామక ఉత్తర్వులు పొంది సర్పంచ్‌ బాధ్యతలు స్వీకరించారు.  ఈ నేపథ్యంలో ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, ఇది చట్ట రీత్యా  ఉల్లంఘనేనని స్థానికులు జిల్లా కోర్టును ఆశ్రయించారు. దీంతో సర్పంచ్‌ ఎన్నిక చెల్లదని  నల్లగొండ జిల్లా ప్రిన్సిపల్‌ మేజిస్ట్రేట్‌  కోర్టు ఈ నెల ఒకటో తేదీన తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు ఉత్తర్వులు అందుకున్న  కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ కోర్టు తీర్పు అమలుకై  కేతేపల్లి ఎంపీడీవోకు మార్గదర్శకాలతో కూడిన ఆదేశాలను గురువారం జారీ చేశారు. కోర్టు తీర్పు మేరకు చెరుకుపల్లి సర్పంచ్‌ ప్రసాద్‌ ఎన్నిక చెల్లదని  కలెక్టర్‌ తెలిపారు.  2018 తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌38(1)లో సూచించిన మేరకు తదుపరి ఆదేశాలు వెలువడే వరకూ ఖాళీ ఏర్పడిన సర్పంచ్‌ స్థానంలో ఉప సర్పంచ్‌ అధికార బాధ్యతలు ఇవ్వాలని,  చెక్‌పవర్‌ కోసం వార్డు సభ్యుడిని ఎంపిక చేసి గ్రామ పంచాయతీ కార్యకలాపాలు సక్రమంగా జరిగేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని  ఎంపీడీవోకు కలెక్టర్‌ సూచించారు. ఈ విషయమై కేతేపల్లి ఇన్‌చార్జి ఎంపీడీవో భవానిని సంప్రదించగా కలెక్టర్‌ ఆదేశాలను పూర్తిగా పరిశీలించలేదన్నారు. ఆదేశాలను పరిశీలించిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. తనను సస్పెండ్‌ చేయడం అక్రమమంటూ ప్రసాద్‌ ఈ తీర్పుపై ఇప్పటికే హైకోర్టులో అప్పీలు చేసినట్లు  తెలిసింది.




Updated Date - 2021-09-17T06:12:24+05:30 IST