జిల్లాల కల్లోలం

ABN , First Publish Date - 2022-01-29T09:15:52+05:30 IST

తోటివాడు తొడ కోసుకుంటే తాను మెడ కోసుకున్నాడట ఒకడు! ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రహసనం అట్లాగే ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం చేసిన జిల్లాల విభజన పరమ అనుత్పాదకంగా...

జిల్లాల కల్లోలం

తోటివాడు తొడ కోసుకుంటే తాను మెడ కోసుకున్నాడట ఒకడు! ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రహసనం అట్లాగే ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం చేసిన జిల్లాల విభజన పరమ అనుత్పాదకంగా పరిణమించడం కళ్లెదుట కనిపిస్తున్న వాస్తవం. కొత్త జిల్లా కేంద్రాలలో భవనాలు లేవు, వసతులు లేవు, జిల్లా కేంద్రంగా చెప్పుకోదగ్గ హంగూ ఏర్పడలేదు. కొన్ని ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పేరిట వ్యవసాయ భూములన్నీ ప్లాట్లుగా మారడం తప్ప పెద్ద ఒరిగిందేమీ లేదు. ఇప్పటికీ ప్రజల స్మరణలో, స్ఫురణలో ఉమ్మడి జిల్లాలే ఉన్నాయి. కొంతకాలం పోగా, అలవాటు పడవచ్చు కానీ, ప్రభుత్వాలకు మౌలికవసతులు కల్పించడానికి అవసరమైన సొమ్ము సమకూరడం మాత్రం ఇప్పట్లో అయ్యేట్టు లేదు. పొరుగురాష్ట్రం అనుభవాన్ని చూసి కూడా, పదమూడు జిల్లాలను 26 జిల్లాలుగా మార్చి, ఏదో అద్భుతం చేస్తున్నామన్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జబ్బలు చరుచుకోవడం ఏమాత్రం బాగాలేదు. పదమూడు కొత్త జిల్లాలు, పన్నెండు కొత్త రెవిన్యూ డివిజన్లు ఏప్రిల్ 2 నుంచి ఉనికిలోకి వస్తాయని ప్రభుత్వం చెప్పింది కానీ, అదేమంత సులువుకాదని పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. జిల్లాల సరిహద్దుల పునర్విభజన అన్న సంస్కరణ మాత్రమే ప్రభుత్వ ఉద్దేశ్యం అయితే, అందుకు అనుగుణమైన ప్రజాస్వామిక పద్ధతులు అనుసరించి ఉంటే ఈ ప్రక్రియ కఠినం, జటిలం కావలసిన అవసరమేమీ లేదు. మరేదో సమస్య ముంచుకువచ్చి, దాని నుంచి ప్రజల దృష్టిని, పరిణామాలను దారిమళ్లించే ఉద్దేశ్యంతో హడావుడిగా ఈ మార్పులు తలపెట్టి ఉంటే మాత్రం సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. ప్రతిపాదనలన్నిటినీ పరిశీలిస్తే, ఇవన్నీ ఎటువంటి లోతైన చర్చా, వివేచనా లేకుండా చేసినవేనని, చివరి నిమిషం దాకా రకరకాల స్థాయిలలో మార్పులు చేర్పులూ చేసినా, సొంత పార్టీ వారి నుంచే అధికారపార్టీ తీవ్ర అభ్యంతరాలను ఎదుర్కొనవలసి రావడం అందువల్లనేనని అర్థమవుతుంది.


ప్రతిపాదనలను విడుదల చేసి ప్రజాభిప్రాయం కోసం నెలరోజుల వ్యవధి ఇవ్వడం సరే, అది ప్రక్రియాపరమైన నిబంధన. కానీ, ప్రజాస్వామ్యంలో ప్రతిపాదనలు ప్రజలనుంచే పైకి వెళ్లాలి. సమాజంలో చర్చ జరిగిన తరువాతనే ప్రతిపాదనల రూపకల్పన జరగాలి. అట్లా రూపొందించిన ప్రతిపాదనలను తిరిగి అభ్యంతరాల కోసం ప్రజలకు సమర్పించాలి. తెలంగాణలో లాగానే, ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొత్త జిల్లాల కోసం డిమాండ్లు కనీసం కొన్ని జిల్లాలలో అయినా ఉంటూ వస్తున్నాయి. విశాఖపట్నం, తూర్పుగోదావరి, అనంతపురం, చిత్తూరు వంటి జిల్లాలు వేర్వేరు నైసర్గిక ప్రత్యేకతలతో, విశాల భూభాగంతో ఉన్నాయి. పరిపాలనా రీత్యా అటువంటి చోట విభజన అవసరం కావచ్చు. ప్రజలకు పాలనాయంత్రాంగంతో సామీప్యం ఏర్పడడం కొత్త జిల్లా వ్యవస్థల ఏర్పాటుకు మార్గదర్శక సూత్రం కావాలి. ప్రతి చిన్న పట్టణం ప్రజలు తమది జిల్లా కేంద్రం అయితే బాగుండునని కోరుకోవచ్చు. పట్టణ ప్రాంతాలు అధికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా కేంద్రాలను ఎంచుకోవడం మరింత కష్టతరం. అన్నమయ్య జిల్లాకు రాజంపేటను కాకుండా రాయచోటిని కేంద్రంగా ఎంచుకోవడం మీద వస్తున్న వ్యతిరేకతను చూస్తే అటువంటి సమస్యల స్వభావం అర్థమవుతుంది. అన్నమయ్య అన్న పేరు పెట్టినప్పుడు తాళ్లపాకకు సమీపంలోని రాజంపేటకే కేంద్రం అయ్యే అవకాశం ఇవ్వాలని అక్కడివారు కోరుకోవడం సహజం అనిపిస్తుంది. పైగా పెద్ద రహదారుల మీద ఉండడం, వాటికి ఎడంగా ఉండడం వంటి అంశాలు కూడా ప్రజల ఆకాంక్షల మీద పనిచేస్తాయి. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలలోని అటవీ ప్రాంతాలను రెండు జిల్లాలుగా చేయడం, వాటి కూర్పు విచిత్రంగా ఉండడం ప్రశ్నించడానికి ఆస్కారం ఇస్తోంది. అట్లాగే, చిత్తూరు జిల్లా విభజన, అనంతపురం జిల్లా విభజన వివాదాస్పదం అవుతున్నాయి. ఇక రద్దయిన రెవిన్యూ డివిజన్ల మీద, కొత్త వాటి ఏర్పాటు మీద అనేక ఆందోళనలు. 


రాజకీయమైన ఉద్దేశ్యంతో చేసినా ఎన్టీయార్ పేరిట జిల్లా ఏర్పాటు చేయడం ఆహ్వానించదగ్గదే. కానీ ఆయన పుట్టిన ఊరు ఆయన పేరుతో ఉన్న జిల్లాలో ఉండేట్టు చూడాలి కదా? అట్లాగే, అల్లూరి సీతారామరాజు జిల్లా రూపురేఖలు గందరగోళంగా ఉన్నాయి. ఉత్తరాదివారు సంబోధించే బాలాజీ కాకుండా, స్థానికమయిన పేరు తిరుమల జిల్లాకు పెడితే బాగుండేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. అన్నమయ్య, శ్రీ సత్యసాయి వంటి పేర్లను జిల్లాలకు పెట్టడం ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ, భవిష్యత్తులో ఇదొక ఆనవాయితీ అయితే కష్టం. లక్ష జిల్లాలు పెట్టినా చాలనంత మంది దేవుళ్లు, భక్తులు, రాజకీయ నాయకులు మనకున్నారు. ఆయా ప్రాంతాల చారిత్రక, సాంస్కృతిక విశిష్టతలు నష్టపోకుండా జాగ్రత్తపడాలి. 


పోరుబాటలో ఉన్న ఉద్యోగులు తామే జిల్లాకు చెందుతామోనన్న ఆందోళన ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం కోరుకున్నది కూడా అదే కావచ్చు. ఉద్యోగుల సంగతి అటుంచి, జిల్లాల పునర్విభజన అన్నది రాష్ట్రంలోని ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసే అంశం. అందులోని లొసుగులను, అవివేకాన్ని సరిచేయకపోతే, ప్రభుత్వానికి రాజకీయంగా పెద్ద నష్టం వాటిల్లుతుంది. ప్రభుత్వ ప్రతిపాదనల్లోని ప్రజావ్యతిరేక అంశాలను, పరిపాలనను కష్టతరం చేసే అంశాలను గుర్తించి ప్రతిపక్షం, ప్రజలను చైతన్యవంతం చేయాలి. ప్రజాభిమానాన్ని కూడగట్టుకోవడానికి ఇది ఒక అవకాశం. తెలంగాణతోనే కాదు, తమిళనాడుతో పోల్చినా ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పరిమాణం చాలా పెద్దగా ఉన్నది కాబట్టి, పునర్విభజన జరగవలసినదే. కానీ, అది పాలనా వికేంద్రీకరణ కోసం, ప్రజల వద్దకు సుపరిపాలన కోసం మాత్రమే జరగాలి. 

Updated Date - 2022-01-29T09:15:52+05:30 IST