దద్దరిల్లుతున్న డాన్‌బాస్

ABN , First Publish Date - 2022-05-23T08:12:24+05:30 IST

ఉక్కు ప్లాంట్‌ అజోవ్‌స్టాల్‌ సహా మారియుపోల్‌ నగరం వశం కావడంతో రష్యా రెట్టించిన కసితో తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బా్‌స (లుహాన్స్క్‌, డొనెట్స్క్‌)పై విరుచుకుపడుతోంది.

దద్దరిల్లుతున్న డాన్‌బాస్

పూర్తిగా స్వాధీనానికి రష్యా  యత్నం

కీవ్‌, మే 22: ఉక్కు ప్లాంట్‌ అజోవ్‌స్టాల్‌ సహా మారియుపోల్‌ నగరం వశం కావడంతో రష్యా రెట్టించిన కసితో తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బా్‌స (లుహాన్స్క్‌, డొనెట్స్క్‌)పై విరుచుకుపడుతోంది. లుహాన్స్క్‌ రీజియన్‌పై విమానాలు, ఫిరంగులు, ట్యాంకులు, రాకెట్లు, మోర్టార్లు, క్షిపణులతో వరుసపెట్టి దాడులు చేస్తోంది. నిర్మాణాలు, జనావాసాలనూ వదలకుండా స్లొవియాన్స్క్‌, సీవరీడోనెట్స్క్‌, లిసిచాన్స్క్‌లో బాంబుల వర్షం కురిపిస్తోంది. డొనెట్స్క్‌ రీజియన్‌వ్యాప్తంగా రష్యా దాడుల్లో శనివారం ఏడుగురు మృతిచెందారు. డాన్‌బా్‌సలో అధిక ప్రాంతం రష్యా మద్దతున్న వేర్పాటువాదుల ఆధీనంలోనే ఉంది. సీవరీడోనెట్స్క్‌, లిసిచాన్స్క్‌ సహా కొద్ది ప్రాంతం మాత్రం ఉక్రెయిన్‌ చేతిలో ఉంది.


దీన్నీ తమ ఖాతాలో వేసుకోవాలని రష్యా చూస్తోంది.  ఈ నేపథ్యంలో సీవరీడోనెట్స్క్‌ శివారుల్లో రోజంతా హోరాహోరీ పోరు సాగింది. డాన్‌బా్‌సలో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉందంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భీకర సంఘర్షణ.. తమ దేశం రష్యా కబంధ హస్తాల్లోకి వెళ్తుందా? లేక పశ్చిమ దేశాల అండతో నిలదొక్కుకుంటుందా? అనేది తేలుస్తుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాల్పుల విరమణ లేదా ఇతర ఒప్పందాలకు రష్యాకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేమని జెలెన్‌ స్కీ సలహాదారు మైఖాలియో పొడొలియాక్‌ స్పష్టం చేశారు. విరామం తర్వాత శత్రువు పెద్దసంఖ్యలో విరుచుకుపడుతుందని పేర్కొన్నారు. కాగా, పోలండ్‌ అధ్యక్షుడు ఆండ్రెజ్‌ డ్యుడా ఆదివారం ఉక్రెయిన్‌ పార్లమెంటులో ప్రసంగించారు. ఆకస్మికంగా వచ్చిన ఆయన.. యూరోపియన్‌ యూనియన్‌లో ఆ దేశ సభ్యత్వానికి మరింత మద్దతు తెలిపారు. యూనియన్‌లో చేరికను సాధ్యమైనంత త్వరగా తేల్చాలని జెలెన్‌ స్కీ కోరారు.


బైడెన్‌ సహా 963 మందిపై ఆంక్షలు

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, విదేశాంగ మంత్రి బ్లింకెన్‌, సీఐఏ చీఫ్‌ బర్న్స్‌ సహా 963 మంది అమెరికన్లపై రష్యా ప్రయాణ ఆంక్షలు విధించింది. గత నెల..  ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌పైనా ఇవే ఆంక్షలు విధించింది. ఉక్రెయిన్‌కు 40 బిలియన్‌ డాలర్ల సైనిక, మానవతా సాయం ఫైల్‌పై బైడెన్‌ సంతకం చేసిన  మరునాడే రష్యా చర్యలకు దిగింది. అమెరికా ఆధిప త్య ధోరణులకు ఇది తగిన సమాధానంగా పేర్కొంది

Updated Date - 2022-05-23T08:12:24+05:30 IST