జిల్లా ఇక రెండు

ABN , First Publish Date - 2022-01-26T07:09:41+05:30 IST

జిల్లా ఇక రెండుగా విడిపోనుంది.

జిల్లా ఇక రెండు

‘కృష్ణా’ పేరు కనుమరుగు

జిల్లాల విభజనకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం

ఒక జిల్లాకు ఎన్టీఆర్‌ పేరుపెడతారా?


జిల్లా ఇక రెండుగా విడిపోనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్‌ మంగళవారం ఆమోదం తెలపడంతో ఇప్పటి వరకూ ఉన్న ‘కృష్ణా’ పేరు చరిత్ర పుటల్లో కలిసిపోనుంది. పార్లమెంటు నియోజకవర్గాలుగా ఉన్న విజయవాడ, మచిలీపట్నం పేర్లతోనే కొత్త జిల్లాలు ఏర్పడనున్నాయి.  


ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : వర్చువల్‌ పద్ధతిలో జరిగిన సమావేశం నూతన జిల్లాల ఏర్పాటుపై ఏకాభిప్రాయానికి వచ్చింది. దీంతో జిల్లా ఇక రెండుగా విడిపోనుంది. పార్లమెంటు నియోజకవర్గాలుగా ఉన్న విజయవాడ, మచిలీపట్నం పేర్లతోనే జిల్లాలు విడిపోను న్నాయి. పాలనా సౌలభ్యం కోసం జిల్లాను రెండుగా విభజించాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. జిల్లా కేంద్రంగా మచిలీపట్నం ఉన్నా, మూలకు విసిరేసినట్టు ఉండటం, ఒక వైపంతా సముద్రమే ఉండటంతో దీని ప్రాధాన్యత క్రమంగా తగ్గుతూ వచ్చింది. గతంలో  మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లోనే ప్రధాన కార్యాలయాలన్నీ ఉండేవి. సమీక్షలు జరిగినపుడు జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు తదితర ప్రాంతాల నుంచి అధికారులు మచిలీపట్నం రావలసి వచ్చేది. ఈ కారణంతో తరువాత జిల్లాస్థాయి అధికారులంతా విజయవాడకు తరలి వెళ్లిపోయారు. అమరావతి రాజధాని అయిన తరువాత మచిలీపట్నం ప్రాధాన్యత మరింత తగ్గిపోయింది. కలెక్టర్‌, జేసీలు కూడా విజయవాడకే పరిమితమాయ్యరు. దాదాపు అన్ని ప్రధాన కార్యాలయాలూ విజయవాడకు తరలిపోయాయి. జిల్లా కోర్టు, ట్రెజరీ, ఎస్పీ కార్యాలయం మినహా మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలన్నీ విజయవాడలోనే నడుస్తున్నాయి. జిల్లా పాలన అధికభాగం విజయవాడ నుంచే కొనసాగుతోంది. 


ఎన్టీఆర్‌ పేరు పెడతారా? 

తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు నిమ్మకూరు వాసి. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ జిల్లాలో పాదయాత్ర చేసినపుడు నిమ్మకూరును సందర్శించి, తాము అధికారంలోకి వస్తే కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడతామని హామీ ఇచ్చారు. ఇప్పుడు జిల్లాల విభజన జరుగుతున్నందున ఏ ప్రాంతానికి ఎన్టీఆర్‌ పేరు పెడతారనే అంశం చర్చనీ యాంశం కానుంది. జిల్లాల విభజన జరిగితే పాలనాపరంగా మంచే జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే అభివృద్ధి చెందిన విజయవాడ ఆర్థికంగా, విద్యాపరంగా ముందడుగులో ఉండగా, మచిలీపట్నం అంతగా అభివృద్ది చెందకపోవడం గమనించదగ్గ అంశం. బందరుపోర్టు నిర్మాణం జరిగితే ఈ ప్రాంతం కొంతమేర అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. జిల్లాల విభజనకు కేబినెట్‌ ఆమోదం తెలిపినా, కార్యాచరణ ఎప్పటికి పూర్తవుతుందనేది ఆలోచించాల్సిన అంశం. 


కృష్ణా పేరు ఇక వినపడదు


జిల్లాను రెండుగా విభజిస్తే, వాటికి విజయవాడ, మచిలీపట్నం పేర్లు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. కృష్ణానదీ తీరం వెంబడి ఉన్న ఈ ప్రాంతాన్ని  ఇప్పటివరకు కృష్ణాజిల్లాగా పిలిచారు. జిల్లాల విభజనతో ఆ పేరు ఇక చరిత్రకే పరిమితం కానుంది. కృష్ణాన దీ తీరం వెంబడి పురుడుపోసుకున్న నాగరికత కారణంగా విద్య, వ్యవసాయం, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో కృష్ణాజిల్లా ముందు వరుసలో నిలిచింది. 

Updated Date - 2022-01-26T07:09:41+05:30 IST