ఆ ప్రళయానికి 43 ఏళ్లు

ABN , First Publish Date - 2020-11-19T06:20:34+05:30 IST

నదీ ప్రవాహంతోపాటు మట్టి కొట్టుకుని రావటం..

ఆ ప్రళయానికి 43 ఏళ్లు

నాడు దివిసీమను అతలాకుతలం చేసిన ఉప్పెన


నాగాయలంక/కోడూరు(కృష్ణా): నదీ ప్రవాహంతోపాటు మట్టి కొట్టుకుని రావటం, అక్కడక్కడ మేటలు వేసి ద్వీపాలుగా మారటం భౌగోళిక లక్షణం. ఆ లక్షణాలకు కచ్చిమైన నిదర్శనమే ఆ ద్వీపం. అదే ద్వీపమైతే అందులో మరో రెండు దీవులుండటమే ఇక్కడి విశేషం. నవ్యాంధ్రప్రదేశ్‌ మూలగా బంగాళాఖాతం తీర ప్రాంతంలో ఉన్నవే ఈ ద్వీపాలు. 400 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉన్న ఆ ద్వీపానికి ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చింది. 1977 ఉప్పెన సమయంలో ఆ ద్వీపమే దివిసీమ. దివిసీమ ఉప్పెనకు 43 ఏళ్లు. 1977 నవంబరు 19న జల ప్రళయాన్ని తలచుకుంటే దివిసీమ వాసులు నేటికీ భీతిల్లిపోతారు. 


ఆ రోజు శనివారం. కాళరాత్రిగా మారి నిత్యం జలసంగీతాన్ని వినిపించే సముద్రం రుద్రుని ప్రళయ ఘోషగా విరుచుకుపడి, సాధారణ దివిని శవాల దిబ్బగా మార్చింది. సముద్రుడి హోరులో సుమారు 30 మీటర్లు ఎత్తున ఎగసిపడిన రాకాసి అలలు గ్రామాలపై పడి తన ప్రతాపాన్ని చూపించిన కొద్ది నిముషాలలోనే గ్రామాలకు గ్రామాలు తుడిచి పెట్టుకుపోయాయి. 10 వేలకుపైగా ప్రజలు అసువులు బాసారు. వేలాది పశువులు మృత్యువాత పడ్డాయి. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లింది. నాగాయలంక, కోడూరు మండలాల తీర ప్రాంత గ్రామాలలో ఎక్కడ చూసినా శవాల గుట్టలే కనిపించాయి. నాగాయలంక మండలంలోని ఎదురుమొండి, ఈలచెట్లదిబ్బ, నాచుగుంట, దీనదయాళ్‌పురం, కమ్మనమోలు, సొర్లగొంది, సంగమేశ్వరం, ఏటిమొగ, గుల్లలమోద, భావదేవరపల్లి, కోడూరు మండలంలోని గొల్లపాలెం, ఊటగుండం, బసవన్నవానిపాలెం, హంసలదీవి, పాలకాయితిప్ప, ఉల్లిపాలెం, ఇరాలి తదితర గ్రామాల్లో 10 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది ఎకరాల్లో వరి సముద్రం పాలైంది.


నాటి ప్రళయానికి ప్రపంచ దేశాలు చలించిపోయాయి. స్పందించి కదిలివచ్చాయి. వందలాది స్వచ్ఛంద సంస్థలు దివిసీమ పునర్నిర్మాణానికి మేమున్నామంటూ వచ్చాయి. నాటి నుంచి నేటి వరకు దివిసీమ జనజీవన స్రవంతిలో పెనుమార్పులు సంభవించాయి. రాజకీయంగా, ఆర్థికంగా దివిసీమ పరిపుష్టిని సాధించుకుంది. నాటి ఉప్పెనలో 10 వేల మంది ప్రాణాల విలువను, జరిగిన నష్టాన్ని ఏడాదికొకసారి స్మరించుకుంటున్నాయి. అప్పటి ఉప్పెన మృతుల జ్ఞాపకాల చిహ్నంగా దివిసీమ ముఖద్వారం వద్ద నిర్మించిన పైలాన్‌ స్తంభం ఎప్పటికీ ప్రజలను హెచ్చరిస్తూనే ఉంది. 


మండలి వెంకట కృష్ణారావు సేవలు మరువలేనివి 

కూడు, నీడ లేక రోడ్డున పడ్డ దివిసీమ ప్రాంత ప్రజలకు మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు తనవంతు సహాయ సహకారాలు అందించారు. దేశ, విదేశాల నుంచి ఎన్నో స్వచ్ఛంద సేవాసంస్థలకు పిలుపునిచ్చి ప్రజలకు సేవలందించారు. 



Updated Date - 2020-11-19T06:20:34+05:30 IST