Advertisement

పెంపుడు కుక్కలతో దేశాన్ని చుట్టేసింది!

Nov 29 2020 @ 10:19AM

ఇంట్లో కుక్కలను పెంచుకోవడం సరదాగానే ఉంటుంది. కానీ ఇల్లు విడిచి ఎటైనా బయటకు వెళ్లాలనుకుంటే సమస్య మొదలవుతుంది. వాటి ఆలనాపాలన కోసం పక్కింటివాళ్లకో, సంరక్షణ కేంద్రాలకో అప్పగించాలి. ఎక్కడున్నా అవెలా ఉన్నాయోననే దిగులు ఎలాగూ ఉండనే ఉంటుంది. ఒకవేళ శునకాలను వెంట తీసుకెళ్లాలంటే సవాలక్ష సమస్యలు. ప్రజా రవాణాలో వాటితో ప్రయాణం ఒకవిధంగా అసాధ్యంగానే భావిస్తారు. కానీ ఢిల్లీకి చెందిన జర్నలిస్టు దివ్యా దుగర్‌ తన మూడు పెంపుడు కుక్కలైన టిగ్రెస్‌, మార్కో పోలో, పరీలతో (ఆమె ముద్దుగా పెట్టుకున్న పేర్లు) ఇప్పటిదాకా రైల్లో 54 ట్రిప్పులు వేసి, దేశం మొత్తం తిరగడం విశేషం. మన దేశంలో రైల్లో అత్యధిక దూరం ప్రయాణం చేసిన కుక్కలివే.. 


జర్మన్‌, రష్యా టీవీల్లో జర్నలిస్టుగా పనిచేసే దివ్యా దుగర్‌ ఢిల్లీ నివాసి. ఆమెకు ప్రయాణాలంటే చాలా ఇష్టం. ఏ మాత్రం సమయం దొరికినా తన భర్త, ఫ్రెంచ్‌ జాతీయుడైన ఒలివర్‌ టెల్లీతో కలిసి అనేక ప్రాంతాలు చుట్టొచ్చేది. ఒకరోజు కాలు విరిగిన 11 ఏళ్ల టిగ్రెస్‌ అనే కుక్క రోడ్డు మీద కనిపిస్తే చేరదీసింది. అలాగే గర్భంతో ఉన్న మరో కుక్క (దాని పేరు పాండీ)ని చెత్తకుండీ దగ్గరి నుంచి ఇంటికి తెచ్చి సపర్యలు చేసింది. దానికి మార్కో పోలో పుట్టింది. మూడోదైన పరీ తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య ఉంటే దివ్య దానిని కాపాడింది. పరీ కోలుకోవడానికి చాలా కాలమే పట్టింది.  2016లో మార్కో పోలో తల్లి పాండీ చనిపోయింది. ‘‘అప్పటిదాకా మా మధ్య సంతోషంగా ఉన్న పాండీ చనిపోవడంతో నేనూ మావారు ఒక్కసారిగా షాక్‌ అయ్యాం. జీవితకాలం తక్కువగా ఉండే కుక్కలకు చేయాల్సినంత చేద్దాం అనుకున్నాం. వాటికి బయటి ప్రపంచాన్ని చూపా లనే ఆలోచన వచ్చింది. వెంటనే కుక్కలతో మా ప్రయాణం మొదలయ్యింది’’ అన్నారు దివ్యా దుగర్‌.


ఢిల్లీ టు గోవా...

మొట్టమొదటి ట్రిప్‌ (2016)లో భాగంగా గోవా వెళ్లాలనుకున్నారు. అయితే కుక్కలను ఎలా తీసుకెళ్లాలనే దానిపై సుమారు నెలపాటు చిన్నపాటి రీసెర్చ్‌ చేశారు దివ్య దంపతులు. ఫ్లయిట్‌లో అంటే కుదరదు. రోడ్డు మార్గంలో కారు అద్దెకు తీసుకుని వెళ్లాలంటే ఖర్చుతో కూడుకున్న పని. రైల్లో అయితేనే సేఫ్‌గా, చౌకగా ప్రయాణించొచ్చు అనుకున్నారు. అయితే రైల్లో కుక్కలను తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుందా? నియమనిబంధనలు ఎలా ఉంటాయి? తదితర సమాచారాన్ని ‘రైల్వే పెట్‌ పాలసీ’ నుంచి సేకరించారు. ‘‘భారతీయ రైల్వేలు ఎప్పుడూ ఈ విషయాలను పబ్లిసిటీ చేయలేదు కానీ, రైల్వే సిబ్బంది పెట్‌ ఫ్రెండ్లీగా ఉంటారని తర్వాతే మాకు తెలిసింది’’ అన్నారు దివ్య. భారతీయ రైల్వేలో ఫస్ట్‌క్లాస్‌ ఏసీ కూపేల్లో మాత్రమే పెంపుడు జంతువులను అనుమతిస్తారు. ఆ విధంగా ఢిల్లీ నుంచి గోవాకు తొలి ట్రిప్‌ వేసి పెంపుడు కుక్కలకు సరికొత్తగా బయట ప్రపంచాన్ని పరిచయం చేశారు. విజయవంతంగా టూర్‌ను ముగించారు. అంతకు ముందు ‘కుక్కలతో దూరపు ప్రయాణాలంటే రిస్క్‌ తీసుకోవడమే’ అంటూ వద్దని వారించిన సన్నిహితుల భయాల్లో ఏమాత్రం నిజం లేదని గ్రహించారు.


నాలుగేళ్లు... 52 రైలు ప్రయాణాలు...

ఈ నాలుగేళ్లలో దివ్య దంపతులు తమ పెంపుడు కుక్కలతో కలసి మనదేశంలోని అనేక పర్యాటక ప్రాంతాలకు టూర్లు వేశారు. గోవా, ఉత్తరాంచల్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, ఉత్తరాఖండ్‌... రైలు అందుబాటులో ఉన్న అనేక పర్యాటక కేంద్రాలకు ఇప్పటిదాకా 52 ట్రిప్పులు వేశారు. మూడు కుక్కలకు కూడా రైలు ప్రయాణాలు అలవాటయ్యాయి. ‘‘రైలు ఎక్కగానే పరీ పై బెర్త్‌లో సెటిలవుతుంది. మార్కోపోలోకు కిటికీ పక్కన కూర్చోవడం అంటే చాలా ఇష్టం. టిగ్రెస్‌ మధ్య బెర్త్‌లో కూర్చుని మమ్మల్ని గమనిస్తూ ఉంటుంది. ఇప్పుడు మా మధ్యకు నా ఐదునెలల బిడ్డ మారియస్‌ కూడా వచ్చి చేరింది’’ అంటారు దివ్వ కించిత్‌ గర్వంగా. ఆమె తన పర్యాటక అనుభవాలను, ఫొటోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ (@dugardd)లో పోస్ట్‌ చేస్తోంది.


లాక్‌డౌన్‌తో బ్రేక్‌...

పెంపుడు కుక్కలతో రైలు ప్రయాణాలు చేయడంలో అసాధరణమైన అనుభవాన్ని సొంతం చేసుకున్న దివ్య జర్నీకి కరోనా బ్రేక్‌ వేసింది. లాక్‌డౌన్‌ సమయంలో రైళ్లు నిలిపివేయడంతో దివ్వ తన మూడు పెంపుడు కుక్కలతో ఢిల్లీలో ఇంటికే పరిమితమయ్యింది. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడు తుండటంతో ఈసారి రైలులో కాకుండా, తొలి ప్రయత్నంగా పెద్ద కారు అద్దెకు తీసుకుని, తక్కువ దూరంలో ఉన్న రాజస్థాన్‌కు వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది. 


ఇవీ ముఖ్యం...

పెంపుడు జంతువులతో అనేక ప్రయాణాలు చేసిన దివ్యా దుగర్‌ చేస్తున్న కొన్ని సూచనలివి...


 గార్డ్‌తో బాగుండాలి: సాధారణంగా రైలులో ఫస్ట్‌క్లాస్‌ కంపార్ట్‌మెంట్లు గార్డ్‌ రూమ్‌కు ఆనుకుని ఉంటాయి. అందుకే గార్డ్‌ను పరిచయం చేసుకోవాలి. స్టేషన్లు వస్తున్నప్పుడు మనల్ని అలెర్ట్‌ చేస్తాడు. రైలు ఎంత సేపు ఆగుతుందో కూడా చెబుతాడు. అప్పుడు పెట్స్‌ను కిందికి దించి వాటి టాయిలెట్‌ విషయాలు చూడొచ్చు.


ఆరా తీయాలి: పర్యాటక ప్రదేశాల్లో పెట్‌ ఫ్రెండ్లీ హోటల్స్‌ గురించి ఆరా తీయాలి. చాలాచోట్ల హోటల్స్‌ పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాయి. ఈ విషయంలో మధ్యప్రదేశ్‌ బెటర్‌. అక్కడి దాబాల్లో పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక వంటకాలు కూడా చేస్తారు. 


చిన్న కర్ర అవసరం: గోవా వంటి ప్రాంతాల్లో కుక్కలు ఎక్కువగా ఉంటాయి. మన పెంపుడు జంతువులతో వాహ్యాళికి వెళ్లినపుడు స్థానిక కుక్కలను అదిలిం చేందుకు చిన్న కర్ర ఎప్పుడూ మన దగ్గర ఉండాలి. 


హైడ్రేట్‌గా ఉంచాలి: ప్రయాణాల్లో పెంపుడు జంతువులకు ఎక్కువ నీళ్లు తాగిస్తే వాటి మూత్ర విసర్జనతో ఇబ్బందులుంటాయని భావిస్తారు చాలా మంది. కానీ అది తప్పు. శబ్దాలు, మానవ సంచారం తో అవి ఎక్కువగా ఉత్తేజితమవుతాయి. అలాంటి పరిస్థితుల్లో వాటిని హైడ్రేట్‌గా ఉంచడమే మంచిది.


స్టేషన్స్‌ లిస్ట్‌ తెలియాలి: ప్రయాణిస్తున్న మార్గంలో ఉండే ‘స్టేషన్స్‌’ తెలిస్తే అది రావడానికి ఎంత సమయం పడుతుందో తెలుస్తుంది. ఆందోళన చెందకుండా ముందే ప్రిపేర్‌ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. 

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.