రివ్యూ: డీజే టిల్లు

Published: Sat, 12 Feb 2022 14:38:27 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రివ్యూ: డీజే టిల్లు

సినిమా రివ్యూ: డీజే టిల్లు

విడుదల తేది: 12– 02– 2022

నటీనటులు: సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి, బ్రహ్మాజీ, ప్రిన్స్‌, ప్రగతి, నర్రా శ్రీనివాస్‌ తదితరులు

కథ – స్ర్కీన్‌ప్లే: సిద్థూ జొన్నలగడ్డ, విమల్‌ కృష్ణ

కెమెరా: సాయిప్రకాష్‌ ఉమ్మడి సింగు

సంగీతం: రామ్‌ మిరియాల, శ్రీచరణ్‌ పాకాల

నేపథ్య సంగీతం: తమన్‌

నిర్మాణ సంస్థ: సితార ఎంటర్‌టైన్‌మెంట్‌. ఫార్చూన్‌ ఫోర్‌ సినిమా 

మాటలు: సిద్థూ జొన్నలగడ్డ

ఎడిటింగ్‌: వివేక్‌ హర్షన్‌

నిర్మాత: సూర్యదేవర నాగవంశీ 

దర్శకత్వం: విమల్‌ కృష్ణ 


‘గుంటూరు టాకీస్‌’, ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా’ ‘మా వింత గాధ వినుమ చిత్రాలతో ఆకట్టుకున్న సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’గా శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చారు.   హీరోగానే కాకుండా ఈ సినిమాకు కథను కూడా అందించారు సిద్ధూ. న్యూ టాలెండ్‌ను ప్రోత్సహించే సితార సంస్థ యువ దర్శకుడు విమల్‌ కృష్ణకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కూడా సినిమాల్లో చిన్నచిన్న మార్పులు చేశారు. బోల్డ్‌ ట్రైలర్‌, ఊపున్న పాటలతో అంచనాలు పెంచిన ‘టిల్లు’ ప్రేక్షకులకు ఎంతవరకూ చేరువయ్యాడు అన్నది రివ్యూలో తెలుసుకుందాం. 


రివ్యూ: డీజే టిల్లు

కథ: 

బాలగంగాధర్‌ తిలక్‌ అలియాస్‌ డీజే టిల్లు (సిద్ధూ) డీజే ప్లేయర్‌గా పనిచేస్తాడు. ఒక క్లబ్‌లో రాధిక (నేహా శెట్టి) పరిచయం అవుతుంది. కాసేపటికే ఇద్దరూ ప్రేమలో పడతారు. టిల్లు పుట్టినరోజున కుటుంబ సభ్యులకు రాధికను పరిచయం చేసే ప్రోగ్రాం పెట్టి ఓ పార్టీ ఏర్పాటు చేస్తాడు. తన పనులతో బిజీగా ఉన్న ఆమె రావడం కుదరదని సిద్థూనే తన ఫ్లాట్‌కు ఆహ్వానిస్తుంది. ఉత్సాహంతో రాధిక ఇంటికి వెళ్లిన టిల్లుకు ఆ ఇంట్లో ఓ డెడ్‌ బాడీ కనిపిస్తుంది. ఆ బాడీ ఎవరిది. ఆ మర్డర్‌ వెనకున్న మిస్టరీ ఏంటి? పబ్‌ యజమాని షాన్‌ (ప్రిన్స్‌), పోలీస్‌ అధికారి రావు(బ్రహ్మాజీ)తో రాధికకు ఎటువంటి సంబంధం ఉంది? టిల్లు ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డాడు? అన్నది కథ. 

 

రివ్యూ: డీజే టిల్లు


విశ్లేషణ:

డీజే టిల్లు కాస్త అమాయకత్వంతో, ఆడుతూపాడుతూ కాలం గడిపే హైదరాబాదీ కుర్రాడు. డీజే ప్లే చేయడం, సంగీత దర్శకుడు కావాలనే కోరిక తప్ప అతనికి మరొకటి తెలీదు. క్రైమ్‌ కామెడీ నేపథ్యంలో సాగే ఈ కథలో నేటితరానికి కావలసిన అన్ని అంశాలు ఉన్నాయి. హీరోగా సిద్ధూ ఇంతకు ముందు చేసిన పాత్రలు వేరు. టిల్లు పాత్ర వేరు. ఇందులో అతని సరదాతనం, డైలాగ్‌లు, మేనరిజం ఆకట్టుకున్నాయి. హీరోయిన్‌ పరిచయం అయిన పది నిమిషాలకే ప్రేమలో పడడం, ముద్దు ఇవ్వడం ఏంటనే లాజిక్‌ ఎదురైనా.. దానిని ఫన్‌ వేలో ఓ ఎమోషన్‌గా చూపించారు. రోహిత్‌ హత్య తర్వాత జరిగే సంఘటలను అన్నీ రాధిక పాత్రపై అనుమానం కలిగేలా ఉన్నా... ఆమెను ప్రేమలో పడేయాలనే తపన, ఆ సన్నివేశాల్లోని సంభాషణలు వినోదాన్ని పంచాయి. నర్రా శ్రీను, బ్రహ్మాజీ పాత్రల ఎంట్రీతో వేగంగా సాగిన ఫస్టాఫ్‌, సెకెండాఫ్‌కి వచ్చేసరికి నెమ్మదించింది. ఫస్టాఫ్‌లో కనిపించిన జోష్‌ ఆ తర్వాత మిస్‌ అయింది మెమరీ లాస్‌ అంటూ ఆస్పత్రిలో సాగే సన్నివేశాలు.. కాస్త బోరింగ్‌గా అనిపిస్తాయి. కోర్టు రూమ్‌ సీన్‌ కూడా ప్రొఫెషనల్‌గా లేదు. దర్శకుడు విమల్‌ కృష్ణ హీరో క్యారెక్టరైజేషన్‌ మీద ఎక్కువ దృష్టిపెట్టాడు. అది బాగా వర్కవుట్‌ అయింది. టిల్లు సినిమా సిద్ధూ వన్‌మెన్‌ షో అని చెప్పాలి. సిద్ధూ ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. తెలంగాణ యాస, డైలాగ్‌లతో అలరించాడు. అమాయకంగా అతను చెప్పిన డైలాగ్‌లు నవ్విస్తాయి. కథానాయిక నేహాశెట్టి పాత్ర అసంపూర్ణంగా ఉన్నా.. గ్లామర్‌తో ఆకట్టుకుంది. కీలక పాత్రలు పోషించిన బ్రహ్మాజీ, నర్రా శ్రీను పరిధి మేరకు పాత్రలకు న్యాయం చేశారు. 

రామ్‌ మిరియాల, శ్రీచరణ్‌ పాకాల పాటలు అలరించాయి. ముఖ్యంగా తమన్‌ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ఎసెట్‌. కెమెరా పనితనం బావుంది. సెకెండాఫ్‌లో ఎడిటింగ్‌ మీద దృష్టి పెట్టి ఉండే ల్యాగ్‌ అనే భావన కలిగేది కాదు. నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గలేదు. ఫైనల్‌గా ట్విస్ట్‌తో సినిమాను ముగించారు. 


ట్యాగ్‌లైన్‌:‘టిల్లు’తో వినోదం అట్లుంటది మరి!

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International