టీఆర్ఎస్.. తెలంగాణ రాబందుల సమితి: డీకే అరుణ

ABN , First Publish Date - 2022-04-09T20:41:13+05:30 IST

ప్రజలను మోసం చేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాబందుల సమితి అని ప్రజలు విమర్శిస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వ్యాఖ్యానించారు.

టీఆర్ఎస్.. తెలంగాణ రాబందుల సమితి: డీకే అరుణ

మహబూబ్ నగర్ జిల్లా: టీఆర్ఎస్ ప్రజలను మోసం చేసే పార్టీ , టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాబందుల సమితి అని ప్రజలు విమర్శిస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వ్యాఖ్యానించారు. శనివారం కిసాన్ మోర్చా రైతు సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ... ‘‘రైతుల సమస్యపై సీఎం కేసీఆర్‌కు సోయి లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వంపై అభాండాలు వేయడం తప్పా మరోటి చేతకాదు. సెంటిమెంట్ రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారు. ప్రతి గింజను కొంటామని చెప్పి ఇప్పుడు డొంకతిరుగుడు మాటలు మాట్లాడుతున్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలిచిన తర్వాత సీఎం కేసీఆర్ దొంగాట మొదలు పెట్టారు. కేసీఆర్‌కు కంటిపై కునుకు లేకుండా పోయింది. ఆరువేల కోట్లు ఖర్చు పెట్టినా టీఆర్ఎస్ గెలవలేకపోయింది’’ అని డీకే అరుణ  అన్నారు.. 


‘‘టీఆర్ఎస్ ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనలేదు. కేసీఆర్ తీరుతో చాలామంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఉప్పుడు బియ్యం ఇవ్వబోమని ఎంఓయూ రాసిచ్చారు. హామీ ఇచ్చేది కేసీఆర్ అయితే అమలు చేసేది కేంద్ర ప్రభుత్వమా?. తెలంగాణలో వడ్ల పంచాయతీ ఎందుకు?. రాష్ట్ర రైతులు, ప్రజలు ఆలోచించాలి. గతంలో చేపట్టిన ప్రాజెక్టుల పనుల్లో తట్టెడు మట్టి తీయలేదు. చేతగాని దద్దమ్మల్లాగా, సిగ్గులేని ఆరోపణలు చేస్తున్నారు. భూత్పూరు- మహబూబ్ నగర్ రోడ్డు గతంలోనే మంజూరు అయ్యాయి. ఈ పనులు పూర్తి చేయడానికి ఏళ్లు పడుతుందా?. టీఆర్ఎస్ దొంగ దీక్షలకు ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రజల సొమ్ముతో పథకాలు పెట్టి మోసం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చిట్ట చివరి లబ్ధిదారుకు న్యాయం చేస్తారు’’ అని  డీకే అరుణ తెలిపారు.

Updated Date - 2022-04-09T20:41:13+05:30 IST