మూడోరోజు పాదయాత్ర ప్రభంజనం

ABN , First Publish Date - 2022-01-12T18:11:11+05:30 IST

మేకెదాటు పాదయాత్ర విషయంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ తన పంతాన్ని కొనసాగిస్తోంది. యాత్ర మూడోరోజు కనకపురకు చేరుకుంది. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ సొంత ఇలాఖా కావడంతో యాత్రలో వేలసంఖ్యలో జనం

మూడోరోజు పాదయాత్ర ప్రభంజనం

             - DK సొంత ఇలాఖా కనకపురలో జనజాతర 


బెంగళూరు: మేకెదాటు పాదయాత్ర విషయంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ తన పంతాన్ని కొనసాగిస్తోంది. యాత్ర మూడోరోజు కనకపురకు చేరుకుంది. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ సొంత ఇలాఖా కావడంతో యాత్రలో వేలసంఖ్యలో జనం పాల్గొనడంతో జాతరను తలపించింది. అనారోగ్యం కారణంగా రెండోరోజు పాదయాత్రకు దూరంగా ఉన్న ప్రతిపక్షనేత సిద్దరామయ్య మూడోరోజు పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మంగళవారం ఉదయం అల్పాహారం తిన్న అనంతరం కనకపురలో ప్రారంభమైన పాదయాత్ర రామనగర వైపు సాగుతోంది. కార్యకర్తలు పలుచోట్ల బాణాసంచా కాల్చి నృత్యాలు చేశారు. అనేకచోట్ల యాత్రలో కార్యకర్తలు మాస్కు లేకుండా కనిపించారు. కాగా యాత్ర విషయంలో కాంగ్రెస్‌ ధోరణిని ఉన్నతవిద్యాశాఖ మంత్రి డాక్టర్‌ సీఎన్‌ అశ్వత్థనారాయణ తప్పుబట్టారు. బెంగళూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ యాత్ర పేరిట ప్రజల ప్రాణాలతో కాంగ్రెస్‌ చెలగాటమాడుతోందన్నారు. బెంగళూరుకే పరిమితమైన వైరస్‌ తీవ్రత ఇతర జిల్లాలకు విస్తరిస్తోందన్నారు. ఒకవేళ కరోనా కేసులు పెరిగితే కాంగ్రెస్‌ పూర్తిగా బాధ్యత వహించక తప్పదన్నారు. ఇకనైనా కాంగ్రెస్‌ తన మొండి వైఖరి వీడాలని హితవు పలికారు. ఆరునూరైనా తామే మేకెదాటు ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. పాదయాత్రను నిలిపే ప్రసక్తే లేదని కాంగ్రెస్‌ నాయకులు మంగళవారం కూడా స్పష్టం చేశారు. కనకపురలో కూడా కొవిడ్‌ నియమాలు ఉల్లంఘించినందుకు కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ సహా 41 మందిపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలైంది. యాత్రను ఆపే ప్రశ్నేలేదని, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా సిద్ధమేనని ప్రతిపక్షనేత సిద్దరామయ్య స్పష్టం చేశారు. వంద ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేసుకోనివ్వండి... యాత్రను ఆపే ప్రశ్నే లేదన్నారు. యాత్రలో పాల్గొంటున్న కార్యకర్తలంతా మాస్కులు ధరించి, శానిటైజ్‌ వేసుకుంటూ జాగ్రత్తలు పాటిస్తున్నారన్నారు. కొవిడ్‌ బారిన పడ్డ ముఖ్యమంత్రికి ఉభయనేతలు ఫోన్‌ చేసి పరామర్శించారు. 

Updated Date - 2022-01-12T18:11:11+05:30 IST