అర్ధంతరంగా ఆగిన పాదయాత్ర

ABN , First Publish Date - 2022-01-14T18:41:03+05:30 IST

కావేరి నదికి అనుబంధంగా మేకెదాటు ప్రాజెక్టును వెంటనే నిర్మించాలని ‘నమ్మ నీరు - నమ్మ హక్కు’ అనే పేరుతో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన పాదయాత్ర ఉత్సాహంగా ప్రారంభమై ఐదు రోజులకే అర్ధంతరంగా ముగిసింది.

అర్ధంతరంగా ఆగిన పాదయాత్ర

 - హైకోర్టు చీవాట్లు

 - వెంటాడిన ఒత్తిళ్లు, హెచ్చరికలు

 - రామనగర పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశం

 - ప్రస్తుతానికి ముగిస్తున్నట్లు డీకే శివకుమార్‌, సిద్దరామయ్య ఎట్టకేలకు ప్రకటన


బెంగళూరు: కావేరి నదికి అనుబంధంగా మేకెదాటు ప్రాజెక్టును వెంటనే నిర్మించాలని ‘నమ్మ నీరు - నమ్మ హక్కు’ అనే పేరుతో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన పాదయాత్ర ఉత్సాహంగా ప్రారంభమై ఐదు రోజులకే అర్ధంతరంగా ముగిసింది. ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు, హైకోర్టు మందలింపులు, కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం హెచ్చరికల  నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం పాదయాత్రను ప్రస్తుతానికి ముగిస్తున్నామని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, ప్రతిపక్షనేత సిద్దరామయ్య ప్రకటించారు. ఆదివారం కనకపుర తాలూకా మేకెదాటు వద్ద పాదయాత్ర ప్రారంభమైంది. తొలిరోజు రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే యాత్రకు శ్రీకారం చుట్టగా రాష్ట్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, అగ్రనేతలంతా సమైక్యంగా యాత్రలో పాల్గొన్నారు. తొలిరోజు వేలాదిమంది పాల్గొనగా సోమవారం అంతకుమించి జనం కదిలారు. మంగళవారం కనకపురలో పాదయాత్రలో భాగంగా ఏర్పాటైన బహిరంగసభకు 15వేల మందికిపైగా పాల్గొన్నారు. రాష్ట్రమంతటా కొవిడ్‌ తీవ్రరూపం దాల్చింది. జనవరి ప్రారంభం నుంచి వందల్లో నమోదవుతున్న కేసులు 10వేలకు పైస్థాయికి చేరాయి. బెంగళూరులో 75 శాతానికిపైగా కేసులు నమోదవుతున్నాయి. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ పాదయాత్ర కొనసాగింపుపై హైకోర్టులో దాఖలైన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి రితురాజ్‌ అవస్థి నేతృత్వంలో ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ప్రభుత్వ నిస్సహాయతను ఎండగడుతూనే తీవ్రంగా మందలించింది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ పాదయాత్రపై తీసుకున్న చర్యలను వివరించాలని నోటీసులు జారీ చేసింది. శుక్రవారం మరోసారి విచారణ చేపట్టేలా సూచించడంతో కోర్టు నుంచి కాంగ్రెస్‌ నేతలకు ఇబ్బంది తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు యాత్రలో పాల్గొన్న సీనియర్‌ నేతలు మల్లికార్జున ఖర్గే, సీఎం ఇబ్రహీం, హెచ్‌ఎం రేవణ్ణకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరితోపాటు పదులసంఖ్యలో కార్యకర్తలు కొవిడ్‌ బారినపడినట్టు తెలుస్తోంది. మరోవైపు అధిష్ఠానం నుంచి యాత్ర ముగించేలా హెచ్చరికలు వచ్చినట్లు సమాచారం. దేశమంతటా కొవిడ్‌ పెరిగేందుకు కేంద్రప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తుంటే కర్ణాటకలో పాదయాత్ర సమంజసం కాదని పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ రాష్ట్ర నాయకులకు సూచించినట్టు తెలుస్తోంది. మరోవైపు గురువారం నేరుగా రాహుల్‌గాంధీ, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు ఫోన్‌ చేసి పాదయాత్రపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. కాగా హైకోర్టు ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో మందలించిన తరుణంలో పోలీసు ఉన్నతాధికారులు బుధవారం రాత్రి డీకే శివకుమార్‌, సిద్దరామయ్యకు నోటీసులు ఇచ్చారు. గురువారం ఉదయం పాదయాత్రకు అనుమతి లేదని ముందుకెళ్లాలనుకుంటే తమ చర్యలు అనివార్యం కానున్నాయని పేర్కొన్నారు. కొవిడ్‌ తీవ్రమవుతున్న తరుణంలో పాదయాత్రను ఆపాలని, మేకెదాటు విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయంతో ఉందని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మరోసారి వివరించారు. బెంగళూరు నేషనల్‌ కళాశాల మైదానంలో పాదయాత్ర ముగింపు సభకు అనుమతులు ఇచ్చేది లేదని బీబీఎంపీ ప్రకటించింది. ఇలా అన్నివైపులా పాదయాత్రకు అడ్డంకులు రావడంతో రామనగర కాంగ్రెస్‌ కార్యాలయంలో డీకే శివకుమార్‌, సిద్దరామయ్యతోపాటు ముఖ్యనేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. కేంద్రమాజీ మంత్రి మునియప్ప, మాజీ స్పీకర్‌ రమేశ్‌కుమార్‌, సలీం అహ్మద్‌, రామలింగారెడ్డి, ధ్రువనారాయణ, చెలువరాయస్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం డీకే శివకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతానికి పాదయాత్రను ముగిస్తున్నామని, ఈ పోరాటం ఇంతటితో ఆగదని, రానున్న రోజుల్లో రామనగర నుంచే ప్రారంభిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ పోరాటానికి కట్టుబడి ఉందని, నోటీసులు, కేసులు, జైళ్లకు బెదిరేది లేదన్నారు. సిద్దరామయ్య మాట్లాడుతూ పాదయాత్రలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారని, వారి అభిమానం మరువలేమన్నారు. పాదయాత్రపై ముందుగానే నిర్ణయం తీసుకున్నామని, బెళగావి శాసనసభ సమావేశాల వేళ ప్రకటించామన్నారు. కొవిడ్‌ మూడో విడత వేగంగా దూసుకొస్తోందని, బుధవారం 15వేలకుపైగా కేసులు నమోదు కావడంతో బాధ్యతాయమైన పార్టీగా పాదయాత్రను విరమిస్తున్నామన్నారు. అయితే బీజేపీ వారు చేపట్టే కార్యక్రమాలపైనా ఆంక్షలు వర్తించాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-01-14T18:41:03+05:30 IST