‘ప్రజల కోసమే మా పోరాటం’

ABN , First Publish Date - 2022-03-01T17:52:25+05:30 IST

ప్రజల జీవనం కోసమే తమ పోరాటమని, మేకెదాటు ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలనే డిమాండ్‌తో పాదయాత్ర చేస్తున్నామని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ పేర్కొన్నారు. సోమవారం రామనగర

‘ప్రజల కోసమే మా పోరాటం’

                             - మేకెదాటు యాత్రలో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ 


బెంగళూరు: ప్రజల జీవనం కోసమే తమ పోరాటమని, మేకెదాటు ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలనే డిమాండ్‌తో పాదయాత్ర చేస్తున్నామని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ పేర్కొన్నారు. సోమవారం రామనగర నుంచి బిడది వరకు పాదయాత్ర సాగింది. రామనగరలో యాత్ర ప్రారంభానికి ముందు డీకే శివకుమార్‌ మాట్లాడుతూ ప్రజాభిమానం చూస్తుంటే మేకెదాటు పాదయాత్ర ఎంత అవసరమో తెలుస్తోందన్నారు. ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారన్నారు. మరో నాలుగైదు దశాబ్దాలు బెంగళూరులో తాగునీటి సమస్య లేకుండా ఉండాలంటే మేకెదాటు పూర్తి కావాల్సిందేనన్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు ఆదిచుంచనగిరి మఠాధిపతి బాలగంగాధరనాథస్వామిజీ జన్మస్థలం బానందూరులో ఆంజనేయస్వామి బసవనగుడిలో పూజలు చేశారు. రామనగరశాఖ మఠాధిపతి అన్నదానిస్వామిజీ ఆశీస్సులు తీసుకున్నారు. మాజీ డీసీఎం పరమేశ్వర్‌, కార్యాధ్యక్షుడు సలీం అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే హెచ్‌సీ బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు భారీ గజమాలను సమర్పించారు. మండుటెండలో వేలాదిమంది పాదయాత్రలో పాల్గొనగా ప్రతిచోటా తాగునీరు, కూల్‌డ్రింక్స్‌ సౌలభ్యాలు కల్పించారు. చిత్రదుర్గ మురుఘ మఠాధిపతి శివమూర్తి శివాచార్య, మాదార చెన్నయ్యమఠం బసవమూర్తి, మడివాళ గురుపీఠం మాచిదేవ స్వామిజీతోపాటు వివిధ మఠాల స్వామిజీలు పాదయాత్ర జరుపుతున్న డీకే శివకుమార్‌ తదితరులను ఆశీర్వదించారు. పాదయాత్రలో భాగస్వామ్యులయ్యారు. 


అది రాజకీయ యాత్ర: సీఎం 

కాంగ్రెస్‌ నేతలకు మేకెదాటు సాధించాలన్న చిత్తశుద్ధి లేదని, అదో రాజకీయ యాత్ర అని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మండిపడ్డారు. బెళగావిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవలం రాజకీయాల కోసమే పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పోరాటం ఎవరిపై చేస్తుందని మంత్రి గోవింద కారజోళ ప్రశ్నించారు. మేకెదాటు వివాదం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని, విచారణ పూర్తి కాకుండానే నిర్మాణాలు సాధ్యమా..? అని ప్రశ్నించారు. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయనే ప్రచారం మినహా పాదయాత్రలో అర్థం లేదన్నారు. కేంద్ర మాజీ మంత్రి సదానందగౌడ మాట్లాడుతూ పాదయాత్ర ద్వారా వారు ఏం సాధించాలనుకున్నారో... ఎవరికి వ్యతిరేకంగా యాత్ర చేస్తున్నారో వారి లక్ష్యమేమిటో వారికే తెలియదన్నారు. 


సీఎం కావాలనే ఆత్రుత: మంత్రి అశ్వత్థనారాయణ 

ఎలాగైనా సరే రాష్ట్రానికి సీఎం కావాలని కేపీసీసీ అధ్యక్షుడు  డీకే శివకుమార్‌ ఆత్రుతతో ఉన్నారని మంత్రి అశ్వత్థనారాయణ ఎద్దేవా చేశారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ మేకెదాటు పేరిట కపటయాత్ర చేస్తున్నారన్నారు. డీకే శివకుమార్‌ ఏడుసార్లు ఎమ్మెల్యే అయ్యారని, ఆయన తమ్ముడు డీకే సురేశ్‌ ఎంపీగా కొనసాగుతున్నారని ఇన్నేళ్లు కనిపించని మేకెదాటు ఇప్పుడే ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. 


డీకే శివకుమార్‌, సిద్దూపై కొవిడ్‌ ఉల్లంఘన కేసు

 కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన, అనుమతులు లేకుండా వేలాదిమందితో పాదయాత్రపై రామనగర పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, ప్రతిపక్షనేత సిద్దరామయ్య, ఎంపీ డీకే సురేశ్‌తోపాటు 41 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. రామనగర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి వేలాది మందితో బహిరంగసభ, పాదయాత్ర చేపట్టిన మేరకు విపత్తు నిర్వహణా చట్టం 2005 నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు. రామనగర తహసీల్దార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు సోమవారం తెలిపారు. 

Updated Date - 2022-03-01T17:52:25+05:30 IST