DK Sivakumar, Siddaramaiah: బెంగళూరుకు అపఖ్యాతి తెచ్చారు...

ABN , First Publish Date - 2022-09-14T17:29:52+05:30 IST

బీజేపీ అధికారంలోని రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి చిరునామాగా మారిందని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌(KPCC President DK Sivaku

DK Sivakumar, Siddaramaiah: బెంగళూరుకు అపఖ్యాతి తెచ్చారు...

- అవినీతికి చిరునామా బీజేపీ

- కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌

- ప్రతిచోటా కమీషన్ల దందా: సిద్దరామయ్య


బెంగళూరు, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): బీజేపీ అధికారంలోని రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి చిరునామాగా మారిందని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌(KPCC President DK Sivakumar) తీవ్రంగా ఆరోపించారు. కేపీసీసీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్‌తో సాగుతోందని ధ్వజమెత్తారు. శాసనసభ సమావేశాలు సాగుతున్నా అవినీతికి వ్యతిరేకంగా తాము పార్టీ కార్యాలయంలో మాట్లాడాల్సి వస్తోందన్నారు. శాసనసభ సమావేశాలు పదిరోజులపాటు సాగుతాయని ప్రకృతి వైపరీత్యాలపై చర్చ ఉంటుందన్నారు. అవినీతిపై చర్చ జరగాలనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్‌ ప్రత్యేకంగా అభియాన చేపట్టిందన్నారు. తమ ఎమ్మెల్యేలు కూడా బాధ్యతగా సమావేశాల్లో పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలపై చర్చిస్తారన్నారు. సభలోనూ బయటా కూడా అవినీతిపై చర్చ జరగాలన్నదే తమ ఉద్దేశ్యమకని పేర్కొన్నారు. బెంగళూరు నగరానికి ఐటీ కేపిటల్‌, గార్డెన్‌సిటీ, సిలికాన్‌ సిటీ, ఎడ్యుకేషన్‌ హబ్‌ అనే పేర్లు ఉండగా బీజేపీ అధికారం చేపట్టాక ఇటీవల ‘అవినీతి రాజధాని’ అని అపఖ్యాతిని మూటగట్టుకుందని మండిపడ్డారు. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వాలతో ఢిల్లీ నుంచి రాష్ట్రానికి ఎంతమేర నిధులు అధికంగా వచ్చాయో వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. బెంగళూరుకు సబ్‌అర్బన్‌ రైలు ప్రాజెక్టును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారని, ఇంతవరకు కార్యరూపం దాల్చలేదన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ 600 హామీలు ఇచ్చిందని ఇంతవరకు 90 శాతం కూడా అమలు కాలేదన్నారు. బెంగళూరు వీవీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ అశోక్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఎస్‌ఐ పోస్టుల నియామకాల అక్రమాల్లో చిన్ననేరగాళ్లు మాత్రమే పట్టుబడ్డారని, మంత్రులు, ఇతర అధికారుల ప్రమేయం లేకుండా ఈ కుంభకోణం సాధ్యమా అని ప్రశ్నించారు. ఇటీవల కనకగిరి ఎమ్మెల్యే రూ.15లక్షలు తీసుకున్నట్టు అంగీకరించి యూటర్న్‌ తీసుకున్నారని, ఎందుకు నోటీసు కూడా ఇవ్వలేదన్నారు. అవినీతితో రాష్ట్రం పరువును వేలం వేసినట్టుగా ఉందన్నారు. ప్రతిపక్షనేత సిద్దరామయ్య మాట్లాడుతూ... ఈ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో మునిగిపోయిందని అందుకే 40శాతం కమీషన్‌ సర్కార్‌ అంటూ అభియాన చేపట్టామన్నారు. సంతోష్‏పాటిల్‌ 40 శాతం కమీషన్‌ ఇవ్వలేకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు డెత్‌నోట్‌లో పేర్కొన్నారన్నారు. ఈ ఘటనకు సంబంధించి తాము పోరాటం చేయడంతో ఈశ్వరప్ప మంత్రి స్థానానికి రాజీనామా చేశారు మినహా ఆయనపై ఎటువంటి క్రిమినల్‌ కేసు నమోదు చేయలేదన్నారు. మఠాల గ్రాంట్లలో 30 శాతం కమీషన్‌, బీబీఎంపీలో 50 శాతం కమీషన్‌ సాగుతోందని ఆరోపించారు. ఇందుకుగాను అవినీతికి సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ సహాయవాణి ప్రారంభించిందని, ఫిర్యాదు చేయవచ్చునన్నారు. మీడియా సమావేశంలో రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రణదీప్‏సింగ్‌ సుర్జేవాలా, పరిషత్‌ ప్రతిపక్షనేత బీకే హరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-09-14T17:29:52+05:30 IST