కచ్చాదీవి విముక్తికి తరుణమిదే

ABN , First Publish Date - 2022-06-03T15:47:58+05:30 IST

శ్రీలంక పరిధిలో వున్న కచ్చాదీవిని విడిపించేందుకు ఇదే అనువైన తరుణమని, డీఎండీకే జిల్లా కార్యదర్శుల సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. కోయంబేడులోని

కచ్చాదీవి విముక్తికి తరుణమిదే

                     - డీఎండీకే జిల్లా కార్యదర్శుల సమావేశంలో తీర్మానం


ప్యారీస్‌(చెన్నై), జూన్‌ 2: శ్రీలంక పరిధిలో వున్న కచ్చాదీవిని విడిపించేందుకు ఇదే అనువైన తరుణమని, డీఎండీకే జిల్లా కార్యదర్శుల సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. కోయంబేడులోని డీఎండీకే ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ కోశాధికారి ప్రేమలత అధ్యక్షతన గురువారం జిల్లా కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రిసీడియం చైర్మన్‌ ఇళంగోవన్‌, ఉపకార్యదర్శులు ఎల్‌కే సుధీష్‌, పార్థసారధి, ప్రచార విభాగ కార్యదర్శి అళగాపురం మోహన్‌రాజ్‌ సహా జిల్లా కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సమావేశం సంస్థాగత ఎన్నికలు, పార్టీ సర్వసభ్య సమావేశం, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు 70వ జన్మదిన వేడుకల నిర్వహణ తదితరాలపై చర్చించింది. అసెంబ్లీ ఎన్నికల తరువాత రెండోసారి నిర్వహించిన ఈ సమావేశంలో ఆమోదించిన పలు తీర్మానాలపై సమావేశం అనంతరం ప్రేమలత మీడియాకు వివరించారు. 

    ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తమ పార్టీ అధ్యక్షుడు విజయకాంత్‌ పుట్టిన రోజు ఆగస్టు 25వ తేదీని దారిద్య్ర నిర్మూలనా దినంగా జరుపుకోనున్నట్లు తెలిపారు. పట్టణాలు, గ్రామాల్లో పార్టీ జెండాలు ఎగురవేసి, ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టి, పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. ముఖ్యంగా శ్రామికవర్గాలకు లబ్ది చేకూర్చేలా డీఎండీకే అధికారంలోకి తీసుకురావాలని సమావేశంలో పాల్గొన్నవారంతా ప్రతిజ్ఞ చేశారని తెలిపారు. చేపలవేటకు వెళ్లే రాష్ట్ర జాలరులపై లంక నావికాదళం చీటికిమాటికి దాడులు చేస్తోందని, కచ్చాదీవి భారత ప్రభుత్వ ఆధీనంలో వుంటే ఆ పరిస్థితి వుండదన్నారు. అందువల్ల కచ్చాదీవిని స్వాధీనం చేసుకోనేందుకు కేంద్రప్రభుత్వం గట్టిగా ప్రయత్నించాలని ప్రేమలత డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-06-03T15:47:58+05:30 IST