CM Stalin: డీఎంకేలో సంస్థాగత ఎన్నికలు

ABN , First Publish Date - 2022-09-20T13:25:36+05:30 IST

అధికార డీఎంకే జిల్లా కార్యదర్శుల ఎన్నికలపై పార్టీకి చెందిన కీలక నేతలతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) సోమవారం

CM Stalin: డీఎంకేలో సంస్థాగత ఎన్నికలు

                           - సీనియర్‌ నేతలతో స్టాలిన్‌ సమాలోచనలు


అడయార్‌(చెన్నై), సెప్టెంబరు 19: అధికార డీఎంకే జిల్లా కార్యదర్శుల ఎన్నికలపై పార్టీకి చెందిన కీలక నేతలతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) సోమవారం కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో కీలక అంశాలపై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. డీఎంకే 15వ సంస్థాగత ఎన్నికలను పురస్కరించుకుని ఆ పార్టీలోకి వివిధ విభాగాలకు దశలవారీగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి దశలో పార్టీ విభాగాల కు ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత పట్టణ, కార్పొరేషన్‌ డివిజన్‌ స్థాయిల్లో సంస్థాగత ఎన్నికలు నిర్వహించారు. ఇప్పుడు యూనియన్‌, పట్టణ, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించారు. ఇపుడు జిల్లా కార్యదర్శులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత పార్టీ ప్రధాన కార్యాలయ కార్యవర్గ సభ్యులు, జనరల్‌ బాడీ, కార్యవర్గ సభ్యుల ఎంపిక కోసం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం నామినేషన్ల స్వీకరణ ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు జరుగనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కాంచీపురం, తిరువళ్లూరు, చెన్నై(Kanchipuram, Thiruvallur, Chennai)లోని కార్యదర్శలు పోస్టులకు నామినేషన్లను ఈ నెల 25 నుంచి స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన కీలక నేతలతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. తేనాంపేటలో ఉన్న ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ సీనియర్‌ నేతలు ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌, కోశాధికారి టీఆర్‌బాలు, ముఖ్య కార్యదర్శి కేఎన్‌ నెహ్రూతో పాటు ఇతర సీనియర్‌ నేతలు కూడా హాజరయ్యారు. ఇందులో జిల్లా కార్యదర్శుల ఎన్నికలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆయన పార్టీ నేతలను కోరారు. మరోవైపు ఈ ఎన్నికల కోసం అన్ని జిల్లాల్లో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇదిలా ఉండగా జిల్లా పార్టీ కార్యదర్శుల ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్‌ నేతలు చెన్నైలో మకాం వేసి, కార్యదర్శి పదవులను దక్కించుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అలాగే, జిల్లాల స్థాయిలో కూడా పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైవున్నారు. 

Updated Date - 2022-09-20T13:25:36+05:30 IST