Dmk నాయకుడి తలకోసం అడయార్‌ కాలువలో గాలింపు

ABN , First Publish Date - 2022-05-15T13:49:22+05:30 IST

ఆర్థిక లావాదేవీల్లో ఏర్పడ్డ తగాదాల నేపథ్యంలో మనలి ప్రాంతానికి చెందిన డీఎంకే నాయకుడు, ఫైనాన్షియర్‌ చక్రపాణిని కొందరు ముక్కముక్కలుగా నరికి శరీర భాగాలను

Dmk నాయకుడి తలకోసం అడయార్‌ కాలువలో గాలింపు

                    - కేసులో మరో నిందితుడైన ఆటో డ్రైవర్‌ అరెస్టు


అడయార్‌(చెన్నై): ఆర్థిక లావాదేవీల్లో ఏర్పడ్డ తగాదాల నేపథ్యంలో మనలి ప్రాంతానికి చెందిన డీఎంకే నాయకుడు, ఫైనాన్షియర్‌ చక్రపాణిని కొందరు ముక్కముక్కలుగా నరికి శరీర భాగాలను కూవం మురుగుకాలువలో పడేశారు. ఈ కేసులో ఒక మహిళతో పాటు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఈ హత్య తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు గురైన చక్రపాణి తల మినహా మిగిలిన దేహపు భాగాలను పోలీసులు సేకరించారు. అయితే అడయార్‌ సమీపంలోని కూవం మురుగు కాలువలో పడేసిన తల మాత్రం ఇంకా లభించలేదు. స్థానిక పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహకారంతో రబ్బరు బోట్లపై కూవం మురుగు కాలువలలో తల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మనలి 7వ వార్డు ప్రాంతానికి చెందిన చక్రపాణి (65) డీఎంకే జిల్లా శాఖ ప్రతినిధిగా ఉన్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చక్రపాణి రాజకీయ నేతగా ఉంటూనే మరోవైపు ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నారు. దీంతో రోజూ సాయంత్రం వడ్డీలను వసూలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఈ నెల 10న వడ్డీ వసూళ్ల కోసం వెళ్ళిన చక్రపాణి ఇంటికి తిరిగి రాలేదు. మొబైల్‌కు ఫోన్‌ చేసినా స్విచ్చాఫ్‌ అని వచ్చింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.  వెంటనే కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు... ఆయన మొబైల్‌ నంబరును ట్రేస్‌ చేయగా, దాని సిగ్నల్‌ రాయపురం గ్రేస్‌ గార్డెన్‌ 3వ వీధిలోని ఓ ఇంట్లో ఉన్నట్టు తెలిసింది.. దీంతో రాయపురం పోలీసుల సహకారంతో అక్కడికి వెళ్ళి చూడగా, ఒక ఇంటి ముందు చక్రపాణి బైక్‌ ఆగివుండటాన్ని గుర్తించారు. ఆ ఇంట్లోకి వెళ్ళి చూడగా కత్తులతో ముక్కలుగా నరికిన చక్రపాణి మృతదేహపు భాగాలు లభించాయి. కానీ తలతో పాటు మరికొన్ని భాగాలు కనిపించలేదు. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసిన బిత్తరపోయిన పోలీసులు ఇంట్లో ఉన్న తమీమ్‌భాను (39) అనే మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా, ఆ మహిళ తన సోదరుడు వాసీం బాషా (37)తో కలిసి చక్రపాణిని హత్య చేసినట్టు అంగీకరించింది. ఆ తర్వాత వీరిద్దరిని రాయపురం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్ళి విచారించగా అసలు విషయం తెలిసింది.


ప్రాణం తీసిన వివాహేతర సంబంధం: తమీమ్‌ భానుకు, చక్రపాణికి కొన్నేళ్ళుగా వివాహేతర సంబంధం ఉందని, ఆమె ఎన్నూరు నుంచి రాయపురానికి ఇల్లు మారినప్పటికీ చక్రపాణి ఆ సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చాడని తెలిసింది. ఆ విధంగానే ఈ నెల 10న తమీమ్‌ భాను ఇంటికి వచ్చిన చక్రపాణి మద్యం సేవించి ఆమెతో ఉల్లాసంగా గడిపేందుకు ప్రయత్నించినప్పుడు అందుకు ఆమె నిరాకరించింది. సోదరుడు వాసీం బాషా అక్కడికి రావడంతో చక్రపాణికి, అతడికి మధ్య గొడవ జరిగింది. దీంతో చక్రపాణిపై చేయి చేసుకుని వెనక్కి నెట్టేయడంతో కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో శవాన్ని ముక్కలు ముక్కలు చేసి తన స్నేహితుడైన ఆటో డ్రైవర్‌ ఢిల్లీ బాబు సాయంతో శరీర భాగాలను పారేసేందుకు పథకం వేసుకున్నారు. ఆ వీధిలో జనసంచారం అధికంగా ఉండటంతో తొలుత తల భాగాన్ని పార్శిల్‌ చేసి ఢిల్లీబాబు చేతికి ఇవ్వగా, ఆ తలను ఆటోలో తీసుకెళ్ళి అడయార్‌ సమీపంలోని కూవం మురుగు కాలువలో పడేశాడు. మిగిలిన శరీర భాగాలు ఇంట్లో ఉండగా, వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం చక్రపాణి తల కోసం పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సాయంతో కూవం మురుగు కాలువను జల్లెడ పడుతున్నారు. అదేసమయంలో ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేశారు.

Updated Date - 2022-05-15T13:49:22+05:30 IST