Advertisement

ఒకరిద్దరు చనిపోతే బద్నాం చేస్తారా?

Jun 30 2020 @ 01:42AM

  • రవి మృతికి డాక్టర్లు కారణం కాదు
  • రోగులు అలా వీడియో తీసిపెట్టవచ్చా?
  • ఇంటర్నెట్‌ ఇచ్చింది అందుక్కాదు: మంత్రి ఈటల


హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ‘‘ఛాతీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన రవికుమార్‌ విషయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం లేదు. హఠాత్తుగా గుండె ఆగిపోవడం వల్లే ఆయన చనిపోయారు. ఒకరిద్దరు చనిపోతే మొత్తం ప్రభుత్వ ఆస్పత్రులను బద్నాం చేస్తారా?’’ అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు. రవికుమార్‌ మరణం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో మంత్రి ఈటల సోమవారం మీడియాతో మాట్లాడారు. రవికుమార్‌కు ఆక్సిజన్‌ అందించలేదనడం సరికాదని అన్నారు. రవికుమార్‌ అనేక ఆస్పత్రులు తిరిగి, అర్ధరాత్రి చెస్ట్‌ ఆస్పత్రికి వచ్చారని, అయినా చేర్చుకుని  చికిత్స అందించారని చెప్పారు. రవికుమార్‌ పెట్టిన వీడియోలోనూ ఆయనకు ఆక్సిజన్‌ పైప్‌ పెట్టినట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. పేషెంట్లు కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడానికి మాత్రమే ఆస్పత్రిలో ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించామని, ఇలా వీడియోలు తీసి పెట్టడానికి కాదని వ్యాఖ్యానించారు.. సోషల్‌ మీడియాలో బాధ్యత లేకుండా పెట్టిన వీడియోలను, మీడియాలో ప్రసారం చేయడం మంచిది కాదన్నారు. ఎవరో ఒకరిద్దరు చనిపోతే, ప్రభుత్వ ఆస్పత్రులను బద్నాం చేయడం సరికాదని హితవు పలికారు. కరోనా పేషెంట్లకు ట్రీట్‌మెంట్‌ అందిస్తూ ఛాతీ ఆస్పత్రిలో పనిచేేస నర్సు ప్రాణాలు వదిలిందని, ఇటువంటి ప్రచారంతో వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయొద్దని విజ్ఞప్తి చేశారు.


లక్షణాలు లేకుంటే టెస్టులకు రావొద్దు

లక్షణాలు లేకుంటే టెస్టులకు రావొద్దని, ప్రైవేటు ల్యాబులకు వెళ్లి డబ్బులు దండగ చేసుకోవద్దని మంత్రి సూచించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ లాక్‌డౌన్‌ విషయంలో కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. జనాభా ఎక్కువ వల్లే  ఇక్కడ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో ఇదే పరిస్థితి ఉందని మంత్రి గుర్తు చేశారు. హైదరాబాద్‌లో కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గతంలోలా కట్టడి జోన్లను ఏర్పాటు చేస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహకారంతో ఆయా ప్రాం తాల ప్రజలను పూర్తిగా ఇంటికే పరిమితం చేేస ఆలోచన చేస్తున్నామని వివరించారు. కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో టెస్టుల సంఖ్య కూడా పెంచుతామని ఈ టల వెల్లడించారు. రాష్ట్రం లో కరోనా పేషెంట్ల కోసం 17,081 బెడ్లను సిద్థంగా ఉన్నాయని ఈటల తెలిపారు. వెయ్యి వెంటిలేటర్లు ఉన్నాయని, ప్రస్తుతం గాంధీలో కేవలం పది మంది మాత్రమే వెంటిలేటర్‌పై ఉన్నారని చెప్పారు. మొత్తం 9 వేల ఆక్టివ్‌ కేసుల్లో వెయ్యి మంది వరకూ ప్రభుత్వ హాస్పిటల్స్‌లో, మరో వెయ్యి మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉన్నారని మంత్రి చెప్పుకొచ్చారు. చాలా మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారన్నారు. కొవిడ్‌ విధుల్లో ఉన్నవారిలో 258 మంది వైద్య సిబ్బంది, 37 ప్రైవేటు వైద్య సిబ్బంది, 184 మంది పోలీసులు, 53 మంది మీడియా ప్రతినిధులు, ఇద్దరు జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు కరోనా సోకిందని ఈటల పేర్కొన్నారు. మెరుగైన వైద్యం అందించేందుకు మరో 4489 మంది వైద్య సిబ్బంది నియామకం చేపట్టమన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు  వెళ్లి డబ్బు వృథా చేసుకోవద్దని, అవసరమైన వాళ్లందరికీ చికిత్స అందించేందుకు తాము సిద్థంగా ఉన్నామని ఆయన చెప్పారు. 


హైదరాబాద్‌లో  10,666 కేసులు

గ్రేటర్‌ హైదరాబాద్‌లో 10,666 కరోనా కేసులు నమోదయ్యాయని, ఇందులో ప్రస్తుతం 7250 ఆక్టివ్‌ కేసులున్నాయని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ వెల్లడించారు. చాలా మందికి హోమ్‌ ఐసోలేషన్‌లోనే కరోనా తగ్గిపోతోందన్నారు. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నవాళ్లలో 26 మంది మాత్రమే ఆస్పత్రికి వెళ్లారని చెప్పారు. ఆస్పత్రికి వెళ్లాలనుకుంటే 104కు కాల్‌ చేయాలని, అంబులెన్స్‌లోనే ఆస్పత్రికి చేర్చుతామని సోమేశ్‌ సూచించారు. కొత్తగా 150 అం బులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. కరోనా టెస్టుల్లో 60 శాతం మాత్రమే కచ్చితత్వం ఉంటుందని స్పెషల్‌ సీఎస్‌ శాంతకుమారి తెలిపారు. అందువల్లే కొంతమందికి ఒకసారి పాజిటివ్‌, మరోసారి నెగటివ్‌ వస్తోందన్నా రు. కరోనా అనుమానితులు అందరూ కింగ్‌ కోఠి ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.