మా బిడ్డలను చదువుకు దూరం చేయొద్దు

ABN , First Publish Date - 2022-07-06T06:47:17+05:30 IST

‘నాయుడుపేట మున్సిపల్‌ పరిధిలోని మునిరత్నంనగర్‌ కాలనీలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలకు 30 ఏళ్ల చరిత్ర ఉంది.

మా బిడ్డలను చదువుకు దూరం చేయొద్దు
మునిరత్నంనగర్‌ పాఠశాల వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు

మేమంతా నిరుపేదలం 

విలీనం చేసిన కొత్త బడి కాలనీకి

మూడు కి.మీ. దూరముంది

అంతదూరం పిల్లల్ని పంపలేం

నాయుడుపేటలో విద్యార్థులతో కలిసి తల్లిదండ్రుల ధర్నా


నాయుడుపేట టౌన్‌, జూలై 5: ‘నాయుడుపేట మున్సిపల్‌ పరిధిలోని మునిరత్నంనగర్‌ కాలనీలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలకు 30 ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ చదువుతున్న అనేకమంది ఉన్నత విద్యావేత్తలుగా ఎదిగారు. ఇటువంటి పాఠశాలలోని 6, 7, 8 తరగతులను ప్రభుత్వ ఆదేశాలతో పుదూరు జడ్పీ ఉన్నత పాఠశాలకు విలీనం చేయడం సరికాదు’ అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం పాఠశాల గేట్లు మూసేసి విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. పిల్లలను డ్రాపౌట్స్‌గా మార్చొద్దంటూ బోర్డు పెట్టి మరీ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ.. మునిరత్నంనగర్‌ కాలనీలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు 192 మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. ఈ పాఠశాలలోని 6, 7, 8 తరగతుల్లోని 75 మంది విద్యార్థులను పుదూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విలీనం చేసినట్లు ఉపాధ్యాయులు తెలిపారన్నారు. పుదూరు పాఠశాల తమ కాలనీ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. అంతదూరం తమ పిల్లలను పంపలేమన్నారు. పైగా ఈ బడికెళ్లాలంటే ఓపక్క జాతీయ రహదారి, మరోపక్క చెరువు ఉందన్నారు. దీనివల్ల పిల్లలకు ప్రాణహానితోపాటు వయసుకు వచ్చిన ఆడబిడ్డలకు రక్షణ కూడా ఉండదని వాపోయారు. 


విలీనం చేయొద్దు


మేమంతా నిరుపేదలం. ప్రభుత్వ బడి మానేపించేసి ప్రైవేటు బడిలో చదివించేంత స్తోమత మాకు లేదు. ప్రభుత్వం నిర్ణయంతో మా పిల్లలు విద్యకు దూరం కావాల్సి వస్తుంది. కొత్త బడిలోకి విలీనం చేయొద్దు. పాత బడిలోనే తరగతులను కొనసాగించండి.

- విద్యార్థుల తల్లిదండ్రులు



Updated Date - 2022-07-06T06:47:17+05:30 IST