ltrScrptTheme3

‘ఈ’–పథానికి ఆటంకాలెన్నో...!

Oct 24 2021 @ 00:16AM

పాలనావ్యవస్థలో అధునాతన పద్ధతులను అనుసరించడంలో నవపథ నిర్ణేతగా (ఉమ్మడి) ఆంధ్రప్రదేశ్ పేరు పొందింది. ఈ–గవర్నెన్స్‌ను ప్రవేశపెట్టడంలో ఆంధ్రప్రదేశ్ నిజంగానే ఇతర రాష్ట్రాల కంటే ముందుంది. అలవాటైన ఫైళ్లు, రిజిస్టర్లతో కంటే కంప్యూటర్‌తో పని చేసేందుకు ప్రభుత్వ సిబ్బందిని ఒప్పించేందుకు బృహత్ ప్రయత్నమే చేయవలసివచ్చింది. వివిధ ప్రభుత్వ కార్యాలయాల సిబ్బందిని, ప్రోత్సహించి, శిక్షణ ఇచ్చి నవీన పాలనా ప్రక్రియలను అమలులోకి తీసుకురావడం జరిగింది. ఇది కేవలం ఇరవై సంవత్సరాల క్రితమే జరిగిందని గుర్తుచేసుకోవడం ఉల్లాసాన్ని కలిగిస్తుంది!


ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఈ–-గవర్నెన్స్ సంబంధిత సకల కార్యకలాపాలకు త్వరితగతిన ఒక ప్రధాన కేంద్రంగా రూపొందింది. ఇంకా అదనంగా, విస్తృతంగా పంపిణీ చేసిన ఈ–-గవర్నెన్స్ సాధనాల నిర్వహణ, డేటా భద్రత మొదలైన బాధ్యతలను కూడా సచివాలయమే నిర్వర్తించవలసి ఉంది. 250 ప్రభుత్వ విభాగాల వారీగా 23 జిల్లాలు, 1127 మండలాలలో విస్తరించిఉన్న కంప్యూటర్ నెట్‌వర్క్ గురించిన బాధ్యతలవి. వివిధ ఈ–గవర్నెన్స్ ప్రాజెక్టులలో ఎప్పుడు చూసినా 2000 మంది పని చేస్తుండేవారు. 


సచివాలయంలో ప్రభుత్వ ప్రక్రియలకు సమగ్ర ‘వర్క్ ఫ్లో సిస్టమ్’ (నిర్దిష్ట విధుల నిర్వహణ, పర్యవేక్షణకు అవసరమైన సదుపాయాలను సమకూర్చే వ్యవస్థ. ఈ విధులలో ఎవరు దేన్ని నిర్వర్తించాలి, ఎప్పుడు చేయాలి అన్నది కూడా నిర్ణీతమై ఉంటుంది) ఏర్పాటు చేయడంలో కూడా ఆంధ్రప్రదేశ్ మార్గదర్శిగా ఉంది. భారీ పరిమాణంలోని కంప్యూటర్ల నెట్‌వర్క్ నిర్వహణ, అపరిమిత ఆధారసామగ్రి (డేటా) భద్రం చేయడం అసాధ్యమైన పనులుగా కంటి మీద కునుకు లేకుండా చేసేవి. ఇరవై సంవత్సరాల క్రితం డేటా భద్రత అనేది చాలా కష్టతరంగా ఉండేది. గూఢచర్య సాఫ్ట్‌వేర్, వెబ్‌సైట్ల హ్యాకింగ్, సమాచార చోరీ మొదలైనవి చాలా చిక్కులు కలిగించేవి.


నేను, ఇన్ఫపర్మేషన్ టెక్నాలజీ విభాగానికి ముఖ్య కార్యదర్శి అయ్యేనాటికి సచివాలయానికి సమగ్ర వర్క్ ఫ్లో సిస్టమ్‌ను టాటా కన్సెల్టన్సీ సర్వీసెస్ అభివృద్ధిపరిచింది. అన్ని మంత్రిత్వ శాఖల కార్యాలయాలు హఠాత్తుగా డెస్క్ టాప్‌లతో కూడిన వర్క్ స్టేషన్లుగా మారిపోయాయి. ఈ-గవర్నెన్‌్సకు అలవాటుపడేందుకు ఇష్టపడని అధికారులు, ఉద్యోగుల సంఖ్య తక్కువేమీ కాదు. ఆ అధునాతన పని పద్ధతులలో అధికారులు, ఉద్యోగులకు అప్పటికే మూడుసార్లు శిక్షణ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ మంచి ఫలితాలు కన్పించలేదు. 


వర్క్ ఫ్లో సిస్టమ్ ఉయోగించుకుంటున్న తీరుతెన్నులు వివిధ శాఖల మధ్య పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఇదిలాఉంటే ముఖ్యమంత్రి కార్యాలయంపై తొలుత చంద్రబాబు నాయుడు, ఆ తరువాత వై ఎస్ రాజశేఖర రెడ్డి- నుంచి వర్క్ ఫ్లో వ్యవస్థను శీఘ్రగతిన అమలుపరచాలని ఒత్తిడి పెరిగింది. సచివాలయంలో ఈ వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం చాలా ధనాన్ని వెచ్చించింది. దశాబ్దాలుగా ఉన్న ప్రభుత్వ పని తీరుతెన్నులను అధునాతన సాంకేతికత ఏ విధంగా మార్చనున్నదో చూడడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. 


అయితే నవీన సాంకేతికత పట్ల విముఖంగా ఉన్న బాబూ (అధికారులు)లలో అటువంటి ఆసక్తి కించిత్ అయినా కానరాలేదు. వర్క్ ఫ్లో వ్యవస్థ చాలా జటిలంగా ఉందని, తమకేమీ అర్థం కావడం లేదని పలువురు వాపోయారు. రాయడం కంటే టైప్ చేయడం చాలా విసుగు పుట్టిస్తోందని కూడా అనేక మంది అన్నారు. ఘంటం లాంటి రాత సాధనంతో రాసే సదుపాయంతో కూడిన ల్యప్‌టాప్‌లు అందరికీ సమకూర్చాం. అయినా ప్రయోజనం లేక పోయింది. అంతిమంగా నేను, ‘ చేతితో రాసిన ఫైళ్లను నేను ఇంకెంత మాత్రం పరిశీలించను’ అనే ఒక ఏక వాక్య ఆదేశాన్ని జారీ చేయాలని ముఖ్యమంత్రిని ఆయన కోరుతూ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఒక నోట్ పంపించాను. ఆ ఆదేశాన్ని ప్రతి ఒక్క అధికారికీ పంపించాలని కూడా కోరాను. అది తప్పకుండా అద్భుతాలను సృష్టించగలదని నేను దృఢంగా విశ్వసించాను. అయితే అలాంటి ఆదేశం ఏదీ జారీ కాలేదు. కొంతకాలం అన్నీ యథాతథంగా ఉండిపోయాయి. కొంతమంది ‘సాహసులు’ మాత్రమే కంప్యూటర్లను ఉపయోగించడం నేర్చుకున్నారు. మిగతావారు ఇప్పటికీ తమ తుపాకుల (కలాలు!)కే అంటిపెట్టుకుని ఉండిపోయారు. 


ప్రభుత్వాలు చురుగ్గా పనిచేసేందుకు, సత్వర ఫలితాలు సాధించేందుకు ఏకీకృత డిజిటల్ వేదికలు బ్రహ్మాండంగా ఉపయోగపడతాయని నేను అభిప్రాయపడుతున్నాను. దేశ వ్యాప్తంగా అన్ని రంగాలలోనూ డిజిటలీకరణ వేగం పుంజుకున్నప్పటికీ పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ చేత్తో చేసిన పని పైనే ఆధారపడుతున్నాయి. కంప్యూటరీకరణ పూర్తిస్థాయిలో జరగలేదు. పాలనా వ్యవహారాలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విలువను చాలా ముందుగా అర్థం చేసుకున్నందున నేను మొదటి నుంచీ ఈ–-గవర్నెన్స్‌కు అమిత ప్రాధాన్యమిచ్చాను. ఆ అధునాతన పాలనా పద్ధతులను శీఘ్రగతిన అమలుపరచాలని ప్రభుత్వాన్ని ప్రోత్సహించాను. అన్ని స్థాయిలలో అన్ని శాఖలకు ఉమ్మడి డేటాబేస్ ఉంటే యావత్ ప్రభుత్వ యంత్రాంగమూ మరింత సమర్థంగా, ప్రభావశీలంగా పనిచేసేందుకు వీలు కలుగుతుంది. ప్రభుత్వం చేపట్టిన సమస్త సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, వాటి నిర్వహణ వ్యవస్థలను డేటాబేస్‌తో అనుసంధానం చేస్తే, ప్రతి స్థాయిలోనూ వాటి అమలులో పురోగతి ఏ తీరులో ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకునే సౌలభ్యం ఉంటుంది. . ఇది ఆయా కార్యక్రమాల అమలుకు తోడ్పడడమే కాకుండా ప్రజలకు ఇతోధికంగా లబ్ధిని సమకూరుస్తుంది. ప్రతి అధికారి పనితీరుపై ఒక అంచనాకు రావడానికి అవకాశముంటుంది. ఇటువంటి ఆదర్శప్రాయమైన పాలనావ్యవస్థకు మనం ఇంకా చాలా దూరం పయనించవలసి ఉంది. అయితే ఇరవై సంవత్సరాల క్రితం మనం భావించిన దానికంటే ఎంతో ముందుగా మనం ఆ గమ్యానికి చేరగలుగుతామనడంలో సందేహం లేదు. 


2003 సంవత్సరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన తరువాత వివిధ అంశాలలో కొత్త కార్యక్రమాలను అమలుపరిచేందుకు నేను చొరవ తీసుకున్నాను. మానవ వనరుల అభివృద్ధి, ఐడెంటిటీ సర్వీస్‌లు మెటా డేటా, ప్రభుత్వ సర్వీస్‌ల డేటా ప్రమాణాలు, ఇంకా వివిధ డిజిటల్ సర్వీస్్‌లలో పలు కొత్త కార్యక్రమాలను ప్రారంభించాం. ఇవన్నీ అప్పటికి పథ నిర్ణేత చర్యలే. ఇప్పుడు ఈ-గవర్నెన్‌్సలో పలు కార్యక్రమాలకు, ఆచరణలకు అవే పునాదిగా ఉన్నాయి. 

జతిష్ చంద్ర మొహంతి 

(‘బ్రేకింగ్ త్రూ న్యూ ఎర్త్’ నుంచి)

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.