టెస్ట్‌లు చేయొద్దు

ABN , First Publish Date - 2022-01-21T07:31:15+05:30 IST

రాష్ట్రం మాత్రం చేస్తున్న కొవిడ్‌ టెస్ట్‌ల సంఖ్యను కూడా తగ్గించేస్తోంది.

టెస్ట్‌లు చేయొద్దు

వైద్యశాఖ వింత ఆదేశాలు


తిరుపతి, ఆంధ్రజ్యోతి: ‘‘తిరుపతి డివిజన్‌లో 22 పీహెచ్‌సీలు, 21 యూపీహెచ్‌సీలు ఉన్నాయి. ఈరోజు ప్రతి సెంటర్‌లో 15 ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లు మాత్రమే చేయాలి. ఇది కలెక్టర్‌గారి ఆదేశం. రోజూ 15కి మించి చేయడానికి లేదు. అందరూ దీనిని పాటించాలి.’’ ..జిల్లా వైద్యాధికారి ఒకరు గురువారం జారీ చేసిన హెచ్చరిక ఇది. కొవిడ్‌ మూడో వేవ్‌ చుట్టుముట్టేసిన విపత్కర కాలంలో ప్రజల ప్రాణాలను గాలికి వదిలేస్తున్న ప్రభుత్వం తీరుకు నిదర్శనమిది. కేంద్రం ఒకవైపు టెస్టులు పెంచండంటూ పోరుతుంటే, రాష్ట్రం మాత్రం చేస్తున్న సంఖ్యను కూడా తగ్గించేస్తోంది. దీంతో జలుబు, జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులతో వేగిపోతున్న జిల్లా ప్రజలు, తమకు సోకింది కొవిడ్‌ వైరస్సా లేక వైరల్‌ జ్వరం మాత్రమేనా అని తేల్చుకోలేక ఆందోళన పడుతున్నారు. ఈ స్థితిలో టెస్ట్‌లు ఆపేసి, మందులు ఇవ్వక మరింత అవస్థలపాలు చేస్తున్నారు. చేస్తున్న టెస్ట్‌లే తక్కువైతే, చేస్తున్నవాటిలో సగానికిపైగా పాజిటివ్‌ అని నిర్ధారణ అవుతున్నాయి. గతంలో ప్రతి పీహెచ్‌సీలో 50కి తగ్గకుండా టెస్ట్‌లు చేసేవారు. స్విమ్స్‌, రుయాస్పత్రులతోపాటు చిత్తూరు, మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ వందల సంఖ్యలో టెస్ట్‌లు చేసేవారు. ఇప్పుడు ఇక్కడ కూడా 40కి మించి చేయడం లేదు.గురువారం కూడా అనేకచోట్ల క్యూల్లో గంటలకు గంటలు ఎదురు చూసి, టెస్ట్‌లు లేవని చెప్పడంతో వైద్య సిబ్బంది మీద ఆగ్రహంతో కేకలు వేశారు. 


ఎందుకు టెస్ట్‌ చేయడం లేదు?

రెండు వారాలుగా జిల్లాలో పాజిటివిటీ రేటు విపరీతంగా పెరుగుతోంది.అత్యధిక పాజిటివిటీ నమోదవుతున్న తొలి 20 మున్సిపాలిటీల్లో ఐదు మన జిల్లాలోనే ఉన్నాయి. మండలాల్లో కూడా రాష్ట్రంలోని తొలి 20 మండలాల్లో ఏడు మన జిల్లాలోనే ఉన్నాయి.మరోవైపు తిరుపతి నగరం హాట్‌స్పాట్‌గా మారే పరిస్థితి కనిపిస్తోంది.దీంతో టెస్టుల సంఖ్య పెంచితే పాజిటివిటీలో తిరుపతి పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తుంది.  దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే టెస్ట్‌లు చేయకుండా దాటవేస్తోందనే వాదన వినిపిస్తోంది.  


కిట్ల కొరతే కారణమా?

ప్రభుత్వం నుంచి కిట్లు అవసరమైనన్ని సరఫరా చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించినట్లు చెబుతున్నారు. జిల్లా వైద్యశాఖలో ఆర్టీపీసీఆర్‌ కిట్లు అయిపోవడంతో నెల్లూరు జిల్లానుంచి అరువు తెచ్చుకున్నట్టు తెలుస్తోంది. వాటితోనే జిల్లా అంతటా సర్దుబాటు చేస్తున్నట్టు సమాచారం. దాదాపు 20 లక్షల కిట్ల వరకు ఇండెంట్‌ పెట్టారని.. అవి ఇంకా జిల్లా కేంద్రానికి చేరుకోలేదని తెలుస్తోంది. ఈ పరిస్థితిని ప్రైవేటు ల్యాబ్‌లు బాగా డబ్బు చేసుకుంటున్నాయి.రెండో వేవ్‌లా మూడో వేవ్‌ ముప్పుతిప్పలు పెట్టడం లేదని అధికార యంత్రాంగం తేలిగ్గా తీసుకుంటోంది. ప్రజలు కూడా ఒకటి, రెండు రోజులు జ్వరం వచ్చి తగ్గిపోతోందనే అనుకుంటున్నారు. ప్రమాద తీవ్రత లేదు కాబట్టి తగిన కొవిడ్‌ జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఇందువల్ల వ్యాప్తి వేగం పెరిగింది. ఈ క్రమంలో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు కొవిడ్‌కి గురైతే ఆస్పత్రుల పాలుకాకతప్పదు.ఇప్పుడు తీసుకున్నంత తేలిగ్గానే మరో వారం పది రోజుల తర్వాత తీసుకోలేని పరిస్థితి రావచ్చు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


తాజా కే సులు 2,338

తిరుమల, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ కేసుల నమోదులో జిల్లా మొదటిస్థానంలో కొనసాగుతోంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 24గంటల వ్యవధిలో మరో 2,338 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అదే వ్యవధిలో వైరస్‌ కారణంగా ఒకరు మృతి చెందారు. తాజా కేసులతో జిల్లాలో యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు కూడా విశాఖ తర్వాత అత్యఽధికంగా 9,888కు చేరాయి. కొత్తగా గుర్తించిన కేసుల్లో... తిరుపతి అర్బన్‌లో 573,చిత్తూరులో 220,తిరుపతి రూరల్‌లో 160,మదనపల్లెలో 119,  కుప్పంలో 90, బంగారుపాళ్యంలో 62, పీలేరులో 61,పుంగనూరులో 52,శ్రీకాళహస్తిలో 49 కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2022-01-21T07:31:15+05:30 IST