బాధితుల గోడు వినే ఓపిక లేదా ?

ABN , First Publish Date - 2021-11-29T04:03:56+05:30 IST

వరద ఉధృతికి గుండుగల్లు ఎస్సీకాలనీ నీటమునిగితే, ఆ గ్రామానికి వచ్చిన మంత్రితోపాటు కలెక్టర్‌కు బాధితుల కష్టాలు చూసే తీరిక, వినే ఓపిక కూడా లేదా అని మాజీ మంత్రి అమరనాథ రెడ్డి మండిపడ్డారు.

బాధితుల గోడు వినే ఓపిక లేదా ?
వర్షానికి నేలమట్టమైన వరి పంటను పరిశీలిస్తున్న అమర్‌

 మాజీ మంత్రి అమరనాథ రెడ్డి 


గంగవరం, నవంబరు 28 : వరద ఉధృతికి గుండుగల్లు ఎస్సీకాలనీ నీటమునిగితే, ఆ గ్రామానికి వచ్చిన మంత్రితోపాటు కలెక్టర్‌కు బాధితుల కష్టాలు చూసే తీరిక, వినే ఓపిక కూడా లేదా అని మాజీ మంత్రి అమరనాథ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం గంగవరం మండలంలోని గుండుగల్లు ఎస్సీకాలనీలో నీట మునిగిన ఇళ్లతోపాటు, నష్టపోయిన పంటపొలాలను స్థానిక నాయకులతో కలసి మాజీమంత్రి పరిశీలించారు.  ప్రతి గడపకు వెళ్లి వారికి జరిగిన నష్టంతోపాటు ప్రస్త్తుత పరిస్థితి, అందిన సాయంపై బాధితులను అడిగి తెలుసుకున్నారు. వరద ఉధృతికి ఇళ్లు మునిగిపోవడంతోపాటు, ధాన్యం, నిత్యావసర వస్తువులు వర్షానికి కొట్టుకుపోయి నిరాశ్రయులుగా మారిపోయామని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు.  తమ ఆవేదనను అధికారులు గుర్తిస్తారని ఆశతో ఎదురుచూశామని, అయితే నీటమునిగిన ఇళ్లను కన్నెత్తిచూడకుండా, బాధితులను పలకరించకుండానే మంత్రితోపాటు కలెక్టర్‌ వెళ్లిపోయారన్నారు. ఈ సందర్భంగా అమరనాథ రెడ్డి మాట్లాడుతూ గుండుగల్లు ఎస్సీ కాలనీకి వరద ముప్పు ఉందని తెలిసీకూడా అధికారులు అప్రమత్తం కాకపోవడంతో నిరుపేదలు తీవ్రంగా నష్టపోయారన్నారు. అయితే మంత్రి, కలెక్టర్‌ బాధితులను పరామర్శించడానికి వచ్చి  కాలనీవైపు రాకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు ఈ కాలనీలో వరద ఉధృతిలో చిక్కుకొని శంకర అనే వ్యక్తి ప్రాణాలు పోయాయన్నారు. మరో ఇంటిలో వర్షానికి గోడకూలి వెంకటమ్మ అనే మహిళ నడుం విరిగి కదలలేని స్థితిలో ఉన్నా అంబులెన్స్‌ రాలేదని సాకులు చెప్పి అధికారులు తప్పించుకోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు బాధిత కుటుంబాలకు ఏం న్యాయం చేస్తారో ప్రకటించాలన్నారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి బియ్యంతోపాటు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు సోమశేఖర్‌, నాయకులు జయంత్‌కుమార్‌, జయరామయ్య, జయసింహ, రాధాకృష్ణ, ప్రతాప్‌రెడ్డి, గిరి, వెంకట్రామిరెడ్డి, రెడ్డెప్ప, కృష్ణారెడ్డి, సతీష్‌, శేఖర్‌యాదవ్‌, గ్యాస్‌ నాగరాజు, ఆర్‌బీసీ కుట్టి, ఖాజా, నదీమ్‌, లోకేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-29T04:03:56+05:30 IST