అడ్డగోలుగా కార్డులు జారీ చేయొద్దు

ABN , First Publish Date - 2022-04-22T06:22:25+05:30 IST

డెబిట్‌, క్రెడిట్‌ కార్దుల జారీని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మరింత

అడ్డగోలుగా కార్డులు జారీ చేయొద్దు

  • అనుమతి ఉంటేనే డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల అప్‌గ్రేడ్‌ 
  • గీత దాటితే వేటు తప్పదు : ఆర్‌బీఐ 


ముంబై : డెబిట్‌, క్రెడిట్‌ కార్దుల జారీని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మరింత కట్టుదిట్టం చేసింది. అడగకుండా ఎవరికీ ఎటువంటి కార్డులు జారీ చేయవద్దని బ్యాంకులు, కార్డుల కంపెనీలను ఆదేశించింది. ఉన్న కార్డులను అప్‌గ్రేడ్‌ చేసేందుకూ ఖాతాదారుల అనుమతి తప్పనిసరని స్పష్టం చేసింది. ఈ విషయంలో గీత దాటితే కఠిన  చర్యలు తప్పవని హెచ్చరించింది. ఆ కార్డుల జారీ లేదా అప్‌గ్రెడేషన్‌కు ఖాతాదారుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి ఇవ్వడంతో పాటు అందుకు రెట్టింపు మొత్తం జరిమానాగా చెల్లించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది జూలై 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. 


అనుమతించిన తర్వాతే..

ఎన్‌బీఎ్‌ఫసీలు తమ నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి డెబిట్‌/క్రెడిట్‌ కార్డులు జారీ చేసేందుకు వీల్లేదని కూడా ఆర్‌బీఐ స్పష్టం చేసింది. బకాయిల వసూలు కోసమూ కార్డుల కంపెనీలు ఎలాంటి మానసిక, శారీరక బెదిరింపులు, వేధింపులకు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ విషయంలో కార్డుహోల్డర్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించినా సహించే ప్రసక్తే లేదని తెలిపింది. 



సేవలతో ముడి పెట్టొద్దు 

డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డుల జారీని బ్యాంకులు సేవలతో ముడి పెట్టొద్దని కూడా ఆర్‌బీఐ ఆదేశించింది. కోబ్రాండెడ్‌ డెబిట్‌/క్రెడిట్‌ కార్డులపై తప్పనిసరిగా కోబ్రాండెడ్‌ కార్డు అని ఉండాలని కోరింది. ఏదో ఒక సంస్థ మాత్రమే దీన్ని తమ సొంత కార్డుగా ప్రచారం చేసుకోవడం కుదరదని స్పష్టం చేసింది. కార్డులు జారీ చేసే కంపెనీలు తమ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ గురించి కార్డుదారులకు స్పష్టంగా తెలియజేయాలని కోరింది. కార్డుహోల్డర్ల నుంచి వచ్చే నష్ట పరిహార ఫిర్యాదులను కంపెనీలు నెల రోజుల్లోగా పరిష్కరించాలని స్పష్టం చేసింది. అప్పటికీ పరిష్కారం కాకపోతే ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌ వ్యవస్థను ఆశ్రయించాలని కార్డుహోల్డర్లను కోరింది. 


యూసీబీల్లో గౌరవ పోస్టులు వద్దు

పట్టణ సహకార బ్యాంకుల్లో (యూసీబీ) గౌరవ పదవులకు ఆర్‌బీఐ చెక్‌ పెట్టింది.  చైర్మన్‌, గౌరవ చైర్మన్‌, గ్రూప్‌ చైర్మన్‌ పేర్లతో ఏర్పాటు చేస్తున్న ఈ పదవులకు ఏడాది లోపు ముగింపు  పలకాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవులు చట్టబద్దంగా ఏర్పడిన డైరెక్టర్ల బోర్డు సభ్యులకు సమాంతర వ్యవస్థలుగా మారుతున్నందున ఈ చర్య తీసుకున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది.


Updated Date - 2022-04-22T06:22:25+05:30 IST