ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచొద్దు

ABN , First Publish Date - 2022-05-17T04:49:47+05:30 IST

ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని ఆర్డీవో రాములు అధికారులను ఆదేశించారు.

ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచొద్దు
బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్న అధికారులు

- అధికారులకు ఆర్డీవో రాములు ఆదేశం

- ‘ప్రజావాణి’కి 26 ఫిర్యాదులు

గద్వాల క్రైం, మే 16 : ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని ఆర్డీవో రాములు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 26 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూసమస్యలకు సంబంధించినవి 18 కాగా, ఇతర సమస్యలకు సంబంధించినవి ఎనిమిది ఉన్నాయి. ఫిర్యాదులను ఆయా శాఖాధికారులకు పం పించి వీలైనంత త్వరగా పరిష్కరించేలా చూస్తామని ఆర్డీవో బాధితులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏవో ఆజం అలీ, సూపరింటెండెంట్‌ రాజు, మదన్‌ మోహన్‌ పాల్గొన్నారు.


అనర్హులకు రైతుబంధును నిలిపివేయాలి

వ్యవసాయేతర భూమికి ఇస్తున్న రైతు బంధును నిలిపివేయాలని అయిజ మండలం పులికల్‌ గ్రామశివారులోని బైనపల్లి గ్రామస్థులు మైనుద్దీన్‌, అక్తర్‌ హుస్సేన్‌, గౌస్‌మియ్యా, జమాలుద్దీన్‌, బందేనవాజ్‌లు కలెక్టరేట్‌ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పూర్వికులు సర్వే నెంబర్‌ 502లో ఉన్న 11 ఎకరాలను కొన్నేళ్ల క్రితం ఇతరులకు విక్రయించారని తెలిపారు. అందులో ఎనిమిది ఎకరాలు వ్యవసాయేతర భూమిగా, మూడు ఎకరాలు వ్యవ సాయ భూమిగా 2018-19 సమగ్ర భూ సర్వే ద్వారా అధికారులు నిర్ధారించారని తెలిపారు. అయితే 2020లో రెవెన్యూ అధికారులు ఆ ఎనిమిది ఎకరాల భూమిని కూడా వ్యవసాయభూమిగా నిర్ధారించి ఇతరు లకు రైతుబంధు ఇస్తున్నారని చెప్పారు. వాస్తవానికి ఆ భూమిలో పాఠశాల, అంగన్‌వాడీ, గ్రామపంచాయతీ భవనాలు, వాటర్‌ ట్యాంక్‌, రోడ్డు, చొప్పదొడ్లు, మౌలాలి దర్గ, అలీపీర్‌ మందిరం ఉన్నాయని తెలిపారు. ఈ విషయంపై తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లగా రైతు బంధును నిలిపివేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారని తెలి పారు. కానీ ఇప్పటివరకు చర్యలు తీసుకో లేదని చెప్పా రు. అనంతరం వారు ప్రజావాణిలో ఫిర్యా దు చేశారు. 


పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి

కొవిడ్‌ సమయంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో సంవత్సరం కాంట్రాక్ట్‌ పద్ధతిలో పని చేసిన తమను రెన్యూవల్‌ చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఎనిమిది నెలల జీతం చెల్లించాలని సిబ్బంది నిరసన తెలిపారు. కరోనా కష్టసమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించామని చెప్పారు. కాంట్రాక్ట్‌ను రెన్యువల్‌ చేసి ఆదుకోవాలని కోరారు. అనంతరం ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది కృష్ణవేణి, రాజేశ్వరి, నరేష్‌ పాల్గొన్నారు. 


శ్మశానవాటికను ఏర్పాటు చేయాలి

శ్మశానవాటికను ఏర్పాటు చేయాలని కోరుతూ మాలకులస్థులు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పిం చారు. గద్వాల పట్టణం, గద్వాల మండలంలో 500కు పైగా మాలల కుటుంబాలున్నాయని, వారికి శ్మశాన వాటిక లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని నాయకులు వాల్మీకి, బంగి రంగారావు, చెన్నకేశవులు కోరారు. 

Updated Date - 2022-05-17T04:49:47+05:30 IST