వదలని ముసురు

Jul 23 2021 @ 01:05AM
నల్లగొండలోని పానగల్‌ చౌరస్తాలో నీటిలో నిరసన తెలుపుతున్న డీవైఎఫ్‌ఐ నాయకులు

జిల్లా వ్యాప్తంగా  చిత్తడి

పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం

ఇబ్బందులుపడిన ప్రజలు 

దేవరకొండ, జూలై 22: దేవరకొండలో రెండు రోజుల నుంచి ముసు రుతో కూడిన వర్షం కురుస్తోంది. గురువారం దేవరకొండ మండలంలో 20.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వ్యవసాయశాఖ అధికా రులు తెలిపారు. పట్టణంలోని 11, 3, 4 వార్డుల్లో వర్షపునీరు నిల్వ ఉండి దుర్వాసన వస్తోందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. 

చింతపల్లి :  చింతపల్లి మండలంలోని వీటీనగర్‌లో ఉన్న డ్రైనేజీలు పొంగిపొర్లి వ్యాపార, వాణిజ్య దుకాణాలలోకి వర్షపునీరు, మురుగునీరు చేరింది. దీంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  

దామరచర్ల : దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాల్లో వర్షం కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వర్షానికి పలు గ్రామాల్లో వీధులు బురదతో నిండాయి.  

నకిరేకల్‌:  నకిరేకల్‌లోని పలు కాలనీలు వరద నీరు చేరడంతో బురదమయంగా మారాయి. డాక్టర్స్‌ కాలనీ, మార్కెట్‌రోడ్డు, తిప్పర్తిరోడ్డు, తహశీల్దార్‌ కార్యాలయం ప్రాంతంలో, తాటికల్‌రోడ్డు, బొడ్రాయి బజారు, చీమలగడ్డ కాలనీలో వర్షపు నీరు నిలిచిపోయింది. పట్టణంలో ఆయా కాలనీల్లో డ్రైనేజీ సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. 

మర్రిగూడ : ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు తండాలు, పలు కాలనీలు నీటితో నిండి జలమయమవుతున్నాయి. మర్రిగూడ మండలం లోని రాజుపేటతండా గ్రామపంచాయతీ పరిధిలోని ఆశాపురికాలనీలో డ్రైనేజీ వ్యవస్థలేకపోవడం వల్ల వర్షంనీరు కాలనీలోకి చేరడం వల్ల ఇళ్లలోకి నీరురావడంతో పలు ఇబ్బందులకు గురయ్యారు. అంతంపేట గ్రామపంచాయతీ పరిధిలోని హరిజతండా, రంగంతండాల్లో వీధులన్నీ  గుంతలుగా ఏర్పడి గుంతల్లో వర్షపునీరు చేరడంతో వీధులన్నీ అస్తవ్యస్తంగా తయారై తండావాసులు వెళ్లడానికి పలు ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాల వల్ల నీరంతా ఎటూ వెళ్లలేని పరిస్థితి ఉండడంతో కాలనీలు, తండాల్లో నీరు నిలిచి, రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. ఆశాపురికాలనీలో డ్రైనేజీ వ్యవస్థలేకపోవడం వల్ల వర్షపునీరు వీధులగుండా వచ్చి ఇళ్లలోకి చేరుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

వేములపల్లి : మండల పరిధిలో గత రెండు రోజులుగా మోస్తరు వర్షం కురుస్తుండడంతో గురువారం 47.2మి.మీ వర్షపాతం నమోదై నట్లు ఏఎస్‌వో దీప తెలిపారు.  వర్షం కారణంగా గ్రామాల్లోని పలు వీధులు చిత్తడిగా మారాయి. బోరుబావుల ఆధారంగా నాట్లు వేసిన వరి పంటపొలాలు నీట మునిగాయి. ప్రధాన రహదారైన బీమారం- సూర్యాపేట విస్తరణ పనులు ఆగిపోవడంతో రోడ్డుపై భారీ స్థాయిలో గుంతలు ఏర్పడి వర్షపు నీరు చేరడంతో రహదారి చెరువులను తలపించగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

మునుగోడు/ మునుగోడు రూరల్‌: మునుగోడు పరిసర ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. మునుగోడు పంచాయ తీలోని 9వ వార్డులోని పలుకాలనీల్లో నివాస ఇళ్లన్నీ జలమయమ య్యాయి. వరద ప్రవాహంతో మురుగు నీరంతా ఇళ్లను ముంచెత్తాయి.  మండలంలోని చీకటిమామిడిలోని ఇందిరమ్మ చెరువు, పలివెలలోని బోరెడ్డి చెరువు, కిష్టాపురంలోని పెద్ద చెరువుతోపాటు సోలిపురం గాంధీసాగర్‌ ప్రాజెక్టు చెరువు నిండి అలుగు పోస్తున్నాయి. పలివెల, కొరటికల్‌ వాగుల్లో నీరు ప్రవహిస్తోంది. వర్షంతో పత్తి చేలలో నీరు నిలువ ఉండడంతో మొక్కలు వాడిపోయే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

నిడమనూరు : నిడమనూరు మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణ చిత్తడిగా తయారైంది. ఆవరణలో సీసీ లేకపోవడంతో వర్షానికి నీరు నిలిచి బురదమడిలా కనిపిస్తోంది. వర్షాల కారణంగా ఆవరణలో వాహనాలతో పాటు పాదచారులు కూడా నడిచేందుకు వీలు లేకుండా ఉంది.

Follow Us on: