శుష్కమైన ఒట్లు వెయ్యొద్దు!

Apr 30 2021 @ 00:00AM

ఒక పని చేసే సామర్థ్యం లేకపోయినా చెయ్యగలమని చాటుకోవాలనో, గొప్పలు చెప్పుకోవాలనో, ఎదుటివారిని మెప్పించాలనో ఏదో ఒక దానిమీద ఒట్టు వెయ్యడం లోకంలో పరిపాటి. ఆ సమయానికి ఏది గుర్తుకు వస్తే దాని మీద ప్రమాణాలు చేస్తూ ఉంటారు. అసత్యాలు చెప్పేవారూ, తమ చర్యల కారణంగా ఇబ్బంది ఎదురైనప్పుడు తప్పించుకోవాలనుకొనేవారూ తప్పుడు ప్రమాణాలు చేస్తారు. ఇలా ఒట్టు వేసేవారికి దాన్ని నిలబెట్టుకొనే సామర్థ్యం, పరిస్థితులను అనుకూలంగా మార్చుకోగలిగే శక్తి ఉండదు. అలాగే, చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలనే నిజాయితీ సైతం ప్రమాణ వాక్యాలు చెబుతున్నప్పుడూ, ఆ తరువాతా ఏమాత్రం ఉండదు. ఇటువంటి ధోరణి ఏసు ప్రభువు కాలంలోనూ ఉంది.


ఒకసారి ఏసును దర్శించుకోవడానికి కొందరు ప్రజలు వచ్చారు. ఆయన పక్కనే శిష్యులు కూడా ఉన్నారు. మనిషి ఎలా ఉండాలో, ఎటువంటి పనులు చేయాలో, ఏవి మానుకోవాలో వారికి ఆయన బోధిస్తూ ‘‘ప్రమాణం చేస్తే తప్పకూడదు. యెహోవాకు చేసుకున్న మొక్కుబడులు చెల్లించాలని పూర్వులు చెప్పారు. అది మీరూ విన్నారు. అయితే నేను మీతో చెబుతున్నాను అసలు ఒట్టు వెయ్యకండి. ‘పరలోకం తోడు’ అని ఒట్లు వెయ్యవద్దు. ఎందుకంటే పరలోకం దేవుడి సింహాసనం. ‘భూమి తోడు’ అని ఒట్టు వెయ్యవద్దు. అది దేవుడి పాదపీఠం. ‘యెరుషలేము మీద ఒట్టు’ అని అనవద్దు. అది మహారాజు నగరం. ‘నా ప్రాణం తోడు’ అని ప్రమాణం చెయ్యవద్దు. మీరు ఒక్క వెంట్రుక రంగు కూడా మార్చలేరు. మీరు ‘అవును’ అంటే ‘అవును’, ‘కాదు’ అంటే ‘కాదు’ అన్నట్టే ఉండాలి. అంతకుమించి ఏదైనా మాట అంటే... అది దుష్టుల నోటి నుంచి వచ్చే మాట (మత్తయి 5:33-37) అని హితవు పలికాడు.


ఏదైనా మాట అనే ముందు ఆలోచించుకోవాలి. మభ్యపెట్టే ప్రమాణాలు విడిచిపెట్టాలి. ఏదైనా చెయ్యగలిగినప్పుడే ‘అవును’ అని చెప్పాలి. దాని మీద నిలబడాలి. ఏ పనినైనా చెయ్యగలిగే శక్తి లేదని తెలిసినప్పుడు ‘కాదు’ అని ఒప్పుకోవాలి. అలా కాకుండా మభ్యపెట్టే మాటలూ, శుష్కమైన ప్రమాణాలూ చేయడం దుష్ట స్వభావం. అటువంటి నడవడికను వదులుకున్నవారే మంచి విశ్వాసులుగా దైవానికి చేరువకాగలరన్నది ఏసు ప్రభువు బోధలోని సారాంశం.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.