మోకాలి లిగమెంట్ సమస్యలల్ని నిర్లక్ష్యం చేయొద్దు: డాక్టర్ జగదీష్

ABN , First Publish Date - 2020-12-17T01:20:26+05:30 IST

మోకాలి లిగమెంట్ సమస్యలల్ని నిర్లక్ష్యం చేయొద్దు: డాక్టర్ జగదీష్

మోకాలి లిగమెంట్ సమస్యలల్ని నిర్లక్ష్యం చేయొద్దు: డాక్టర్ జగదీష్

తిరుపతి: కీళ్లు, ఎముకల వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరు తగు జాగర్తలు తీసుకోవాలని, సకాలంలో వైద్యుల సూచనలు, చికిత్స పొందాలని ప్రముఖ శల్య వైద్య నిపుణులు, బర్డ్ ఆసుపత్రి మాజీ సంచాలకులు డాక్టర్ గుడారు జగదీష్ తెలిపారు. తిరుపతి ఆలిండియా రేడియో రోడ్డులోని రాష్ట్రీయ సేవా సమితి(రాస్)లో ప్రతి పది రోజులకొకమారు నిర్వహించే శల్య వైద్య శిబిరం మూడు రోజుల పాటు జరుగుతోంది. చిత్తూరు జిల్లా నలువైపుల నుంచి వచ్చిన వారితో పాటు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాలతో పాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పలువురు రోగులు వైద్యశిబిరానికి వచ్చారు. కాళ్లు, కీళ్లు, తుంటి ఎముక, మోకాలి లిగమెంట్, వెన్నుముక, మెడకండరాలు, చేతుల సమస్యలతో బాధపడే వారికి డాక్టర్ గుడారు జగదీష్ సేవలను అందించారు. కొవిడ్ నిబంధనలను అనుసరించి, భౌతిక దూరం పాటిస్తూ నిర్ణీత సంఖ్యలో రోగులను పరీక్షించారు. మూడు రోజుల పాటు జరిగిన వైద్యశిబిరంలో 163 మంది రోగులు తమ ఎముకలు, కీళ్ల వ్యాధులకు సంబంధించి చికిత్స పొందారు. రాస్ కార్యదర్శి వెంకటరత్నం రోగులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేశారు.


ఈసందర్భంగా డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ మారిన ఆహారపు అలవాట్లతో పాతిక సంవత్సరాలు దాటిన వారిలో ఎముకలు కీళ్ల వ్యాధుల సమస్యలు పెరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా చిన్నపిల్లలు పుట్టుకతో వచ్చే అంగవైకల్యం, సెరిబ్రల్ పాలసీ లాంటి సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. రక్తంలో ఇన్ఫెక్షన్ కారణంగా కీళ్ల నొప్పులు, మోకాలు, తుంటికీలు, వెన్నుముక సమస్యలతో ఇబ్బంది పడేవారు పెరిగారని తెలిపారు. చిన్నసమస్యగా ఉన్నప్పుడే అలసత్వం చేయకుండా వైద్యులను సంప్రదించి చికిత్స పొందడం ద్వారా నయం చేసుకోవచ్చని సూచించారు.  వీలున్నప్పడు వ్యాయామం చేసేందుకు సమయం కేటాయించాలన్నారు. అలాగే ఈ వైద్యశిబిరంలో వివిధ రకాలైన పుట్టుకతో వచ్చే అంగవైకల్యం, వ్యాధులతో బాధపడే వారిని పరీక్షించి వారికి చికిత్స అందించారు. ముఖ్యంగా యువకులు, మధ్యవయస్కులు, క్రీడాకారులు మోకాలి లిగమెంట్ సమస్యలతో బాధపడుతున్నారని ఇటువంటి వాటిని నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు. చాలా మందికి శారీరక వ్యాయమం లేక పోవడంతో వారికి వెన్నుమక సమస్య కీళ్ల వ్యాధులు సంక్రమించి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాస్ ఆధ్వర్యంలో అతి తక్కువ రుసుంతో ఫిజియోధెరపీ విభాగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని, రోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


ఈ వైద్యశిబిరంలో ఫిజియోధెరపీస్టు సౌజన్య, రీతూ, నవీన్, మనీష్, రాస్ ప్రతినిధులు పాల్గొన్నాంరు. బర్డ్ మాజీ డైరక్టర్ డాక్టర్ జగదీష్  వైద్యసేవలను పొందాలంటే రోగులు ముందస్తుగా 9390560025 నెంబరులో సంప్రదించి తమ వివరాలను నమోదు చేసుకోవాలి.

Updated Date - 2020-12-17T01:20:26+05:30 IST