మార్కుల కోసం ఒత్తిడి వద్దు!

Sep 15 2021 @ 00:12AM

పిల్లలు చదువులో బాగా రాణించాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. మంచి మార్కుల కోసం బాగా చదవాలని ఒత్తిడి పెడుతుంటారు. అయితే అలా ఒత్తిడి చేయడం వల్ల పిల్లలు మానసిక ఒత్తిడికి లోనవుతారని అంటున్నారు నిపుణులు. ఈ విషయంలో వాళ్లు చేస్తున్న సూచనలేమిటంటే...


  1. మంచి మార్కులు సాధించాలని చెప్పడం వరకు బాగానే ఉంటుంది. కానీ క్లాస్‌లో ఇతరుల కన్నా ఎక్కువ మార్కులు సాధించాలని చెప్పడం కరెక్ట్‌ కాదు. దీనివల్ల పిల్లలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో ఇది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలతో మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
  2. తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు ఆరిజోనా స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఒక అధ్యయనం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆరో తరగతి చదువుతున్న 506 మంది విద్యార్థులను తల్లిదండ్రులు మీ నుంచి కోరుకుంటున్న ముఖ్యమైన విషయాలు ఏంటి అని అడిగి తెలుసుకున్నారు. 
  3. ఇందులో వ్యక్తిగత సక్సెస్‌ అంటే గ్రేడ్‌లు సాధించడం, ఇతరుల పట్ల జాలి, సహృదయత కలిగి ఉండటం, మర్యాదగా ప్రవర్తించడం వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలు సాధించిన గ్రేడ్‌లు, స్కూల్‌లో వాళ్ల ప్రవర్తన ఆధారంగా అధ్యయనం చేపట్టారు. 
  4. ఈ అధ్యయనంలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మంచి గ్రేడ్‌లు సాధించాలని తల్లిదండ్రుల ఒత్తిడికి లోనయిన పిల్లలు డిప్రెషన్‌, యాంగ్జయిటీ, ప్రవర్తనకు సంబంధించిన లోపాలతో బాధపడుతున్నట్లు తేలింది. ఒత్తిడి లేని పిల్లలు మంచి విలువలను కలిగి ఉన్నారు. 
  5. స్కూల్‌లో మంచి మార్కులు సాధించడం ఒక్కటే సరిపోదని, ఓవరాల్‌ డెవలప్‌మెంట్‌పై తల్లిదండ్రులు దృష్టి పెట్టడం చాలా అవసరమని అధ్యయనం తేల్చింది. 
  6. గెలుపోటములు జీవితంలో భాగం. కొన్నిసార్లు గెలుపు కన్నా ఓటమి ఎన్నో పాఠాలు నేర్పుతుంది. అది చాలా అవసరం. పిల్లలు ఫెయిల్‌ అయినా వాళ్లను విమర్శించకూడదు. విజయం సాధించడానికి మరో ప్రయత్నం చేయమని ప్రోత్సహించాలి.
  7. స్కూల్‌లో పర్‌ఫార్మెన్స్‌ బట్టి మాత్రమే సక్సెస్‌ను నిర్వచించలేము. ఇతరుల పట్ల మర్యాదగా ప్రవర్తించడం, మంచి అలవాట్లు కలిగి ఉండడం వంటివి కూడా ఉండాలని పిల్లలకు తెలియజెప్పాలి.
Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.