విప్లవోద్యమాన్ని అవహేళన చేయకండి

ABN , First Publish Date - 2021-07-16T08:14:49+05:30 IST

అమరులు హరిభూషణ్, సారక్కల గురించి పాణి జూలై 2న ‘ఆంధ్రజ్యోతి’లో రాసిన వ్యాసం గురించి డానీ ‘ఆంధ్రజ్యోతి’లోనే 7వ తేదీన కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు....

విప్లవోద్యమాన్ని అవహేళన చేయకండి

అమరులు హరిభూషణ్, సారక్కల గురించి పాణి జూలై 2న ‘ఆంధ్రజ్యోతి’లో రాసిన వ్యాసం గురించి డానీ ‘ఆంధ్రజ్యోతి’లోనే 7వ తేదీన కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. హరిభూషణ్, సారక్కలు ఏ విప్లవంలో పాల్గొన్నారు అని ‘కొండపల్లి సీతారామయ్యతో కలిసి సన్నిహితంగా పనిచేసినానని’ చెప్పే డానీ వేసిన వితండమైన ప్రశ్నకు జవాబు చెప్పడం లేదు గానీ, మరో రెండు ప్రశ్నల గురించి మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తాను.


నూతన ప్రజాస్వామిక విప్లవం అనే కాన్సెప్ట్ ‘బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు సమాజానికి కూడా వర్తిస్తుందా?’ అని ఆ రెండింటికీ పోటీ పెట్టారు. సమాజంలో ఉన్న పీడక వర్గాలు భూస్వామ్య వర్గం దళారీ పెట్టుబడిదారీ వర్గం. వీటిపై నియంత్రణ, పట్టు ఉన్న సామ్రాజ్యవాదులు బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు సమాజంగా అవతరించడం అంటే ఆ వర్గాలు తాము పాలించే తీరులో ఏ మేరకైనా ఉన్న ప్రజాస్వామిక ముసుగును తీసేసి నియంతృత్వ/ఫాసిస్టు పాలనను నెలకొల్పడమే. ఆ పని హిందూత్వవాదులు చేస్తున్నారు కనుక, దాని వెనక ఉన్న భావజాలం బ్రాహ్మణవాదం కనుక దానిని బ్రాహ్మణీయ ఫాసిజం అంటున్నాము. అంత మాత్రాన కొత్త దోపిడీ వర్గాలు పుట్టుకొని వచ్చాయనో ప్రధాన వైరుధ్యాలు మారిపోయాయనో అర్థం కాదు. కాకపోతే అటువంటి ఫాసిజానికి గురయ్యే సెక్షన్లు పెరిగిపోతుంటాయి కాబట్టి వారందరినీ సమీకరించడం, కొన్ని సందర్భాల్లో పాలకవర్గం లోని ఒక సెక్షను కూడా ఆ దాడులకు తీవ్రంగా గురై ఇతర పీడిత ప్రజలతో కలిసిరావడానికి సిద్ధమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వారిని కూడా కలుపుకు పోయే ఎత్తుగడలు అవలంబించాల్సి ఉంటుంది. 


నూతన ప్రజాస్వామిక విప్లవం అనే కాన్సెప్టు వంద ఏళ్ళ కింద పుడితే, సోషలిస్టు విప్లవమనే కాన్సెప్టు ఇంకా పాతది. ఎంత పాతది అనేది కాదు విషయం. వాటి ప్రాసంగికత ఎంత అనేదే ముఖ్యం. సోషలిస్టు సమాజాలు అపజయానికి గురై పెట్టుబడిదారీ సమాజాలుగా మారిపోయాయి కాబట్టి, సోషలిజం అనే కాన్సెప్టు కూడా కాలం చెల్లిన కాన్సెప్టు అనే వాళ్ళు కోకొల్లలు. మన దేశం అర్ధ వలస – అర్ధ భూస్వామ్య సమాజమైనా, లేదా కొందరు భావిస్తున్నట్టు పెట్టుబడిదారీ దేశమైనా ప్రస్తుతం దేశ ప్రజానీకంపై జరుగుతున్న ఫాసిస్టు దాడులను ప్రతిఘటించడానికి కలిసి పనిచేయడానికి ఆటంకం కావలసిన అవసరం లేదు. ఇంకా ఎన్నో రైతాంగ, కార్మిక, విద్యార్థి, ఆదివాసీ, మహిళా సమస్యలపై గానీ, మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా కానీ ప్రజా పోరాటాలు నిర్మించడానికి గానీ, సంయుక్తంగా కలిసి పని చేయడానికి గానీ అడ్డు రావలసిన పని లేదు. పాణి రాసిన నివాళి పరిధిలోకి రాని విషయాలను, ప్రశ్నలను సంధించి నిందించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. 


ఇక, అస్తిత్వ సమూహాలైన ఆదివాసులు, దళిత బహుజనులు, మహిళల ప్రస్తావన ఉంది గానీ మత మైనారిటీల ప్రస్తావన విప్లవోద్యమంలో ఉన్నట్టు పాణి రాసిన వ్యాసంలో కనిపించలేదనీ, అందువల్ల బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు సమాజం మీద పోరు విప్లవోద్యమ ఎజెండాలో లేదని అర్థం అని డానీ నిర్ధారణకు కూడా వచ్చేశారు. భారతదేశంలో వర్గ విశ్లేషణతో పాటు మన దేశపు ప్రత్యేక లక్షణాలు/ ప్రత్యేక సమూహాల సమస్యలు అని విప్లవోద్యమం చేసిన విశ్లేషణలో జాతుల సమస్య, కుల సమస్య అందులోనూ ప్రత్యేకంగా దళితుల సమస్య, ఆదివాసీలు, మహిళలు, మత మైనారిటీలకు సంబంధించిన సమస్య, అందులోనూ ముఖ్యంగా ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్య అని ప్రస్తావించి వీటి గురించి ఏ వైఖరి చేపట్టాలి, ఏ చర్యలు చేపట్టాలి అని విస్పష్టమైన వైఖరితోనే ఉంది. మన దేశంలో రాజ్యం, రాజ్యవ్యవస్థలు హిందూత్వవాదులకు దన్నుగా నిలుస్తున్నాయనీ, మత మైనారిటీలపై ముఖ్యంగా ముస్లింలపై చాలా వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నాయనీ అందువల్ల హిందూ మతతత్వం ప్రధాన ప్రమాదకారిగా పరిణమించిందని 1990 లలోనే బి‌జే‌పి అధికారంలోకి రాక ముందు రెండున్నర దశాబ్దాల క్రితమే విశ్లేషించి అందుకనుగుణంగా కార్యక్రమాలను రూపొందించుకున్నది. ఆ దిశగా ప్రతిఘటనను నిర్మించాలని అందరికీ పిలుపును ఇస్తోంది. విప్లవోద్యమానికి ఆ అవగాహన ఉన్నందు వల్లనే, భీమా కోరేగావ్ కేసులో కూడా ఇతర హాస్యాస్పద ఆరోపణలతో పాటు, హిందూత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా ఐక్య వేదికలు నిర్మిస్తున్నారని కూడా రాజ్యం నేరారోపణ చేస్తున్నది. కొంచెం సన్నిహితంగా పరిశీలించే వారికి ఇది తెలియని విషయమేమీ కాదు.


ఇదంతా అవగాహనకు సంబంధించిన విషయం. ఆచరణకు సంబంధించి చూస్తే తొలి నాటి కమ్యూనిస్టు పార్టీలో ఉన్నత నాయకత్వ స్థానం వరకు ఎంతో మంది ముస్లిం సమాజం నుండి వచ్చిన వారు ఎదిగినప్పటికీ, నేటి విప్లవోద్యమం మాత్రం ఇతర మత మైనారిటీలతో సహా ముస్లింలకు మిత్రుడుగా మాత్రమే స్థానం పొందగలిగింది కానీ, వారిని విప్లవోద్యమంలో తగు మాత్రంగా భాగస్వాములను చేయడంలో మాత్రం విజయవంతం కాలేదు. అం దుకు భావజాలపరంగా అంతర్జాతీయంగానూ, మన దేశంలోనూ వచ్చిన ఎన్నో పరిణామాలు కూడా ఒక కారణమైనప్పటికీ, అందుకు సంబంధించి ఆచరణాత్మకంగా ఏం చేయాలనేది విప్లవోద్యమం ఆలోచించుకోవలసే ఉంది కానీ, బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్టు సమాజానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం విప్లవోద్యమ ఎజెండాలోనే లేదనడం మాత్రం డానీ విప్లవోద్యమం మీద అప్పుడప్పుడు దుమ్మెత్తి పోయడంలో భాగంగా చేస్తున్న పని మాత్రమే. ఎన్‌డి‌ఏ కూటమిని ఓడించడానికి ఒక పార్లమెంటరీయేతర ఉద్యమంగా విప్లవోద్యమం ప్రత్యక్షంగా చేయగలిగేది లేదు కానీ, ఫాసిజానికి వ్యతిరేకంగా అన్ని రకాల పోరాటాన్ని నిర్మించే క్రమంలో హిందూత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా పెరిగే చైతన్యం ప్రజలలో విస్తృత స్థాయిలో ఏర్పడితే అది పరోక్షంగా ఎన్‌డి‌ఏ ఓటమికి దారితీసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఐక్య పోరాటాలకు అవకాశం ఉంటుంది. అంతే కానీ, ‘బాఖీ సబ్ బక్వాస్’ అని చులకనగా తీసేయడం వల్ల ఒరిగేది ఏమీ లేదు, అలవాటులో భాగంగా మళ్ళీ ఒక సారి విప్లవోద్యమాన్ని చులకన చేసి మాట్లాడటం తప్ప.

రవి నర్ల

Updated Date - 2021-07-16T08:14:49+05:30 IST