పోలవరంపై పోరాటానికి పురికొల్పవద్దు!

ABN , First Publish Date - 2020-11-25T06:12:13+05:30 IST

విభజన బిల్లులోనే పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం కట్టాలని ఉంది. మరింత స్పష్టత కోసం ఫిబ్రవరి 20, 2014న పార్లమెంటులో ప్రధాని ఆర్ & ఆర్ ప్యాకేజీ...

పోలవరంపై పోరాటానికి పురికొల్పవద్దు!

ఈ దేశంలో ఎక్కడైనా ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంచనాలు ఒక్క రూపాయి పెంచకుండా పూర్తయిన ప్రాజెక్టు ఉందేమో కేంద్రాన్ని చూపించమనండి. ఈ కుట్రలు కేవలం ఆంధ్రప్రదేశ్ విషయంలోనే ఎందుకు చేస్తున్నారు? ఇలాంటి ఏకపక్ష విధానాలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు, ఫెడరల్ విధానానికి వ్యతిరేకం. కేంద్రం వెంటనే 2017-–18 ఎస్‌ఎస్‌ఆర్ అంచనాల ప్రకారం (తాజా సవరణలతో సహా) విద్యుత్ కంపోనెంట్ మినహా రూ.50,987.96 కోట్లకు ఆమోదం తెలపాలి. ఇవ్వాల్సిన నిధులు తక్షణం విడుదల చేయాలి. రాజకీయాల కోసం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తే ఎన్టీఆర్ ఆత్మ ఊరుకోదు. ఆంధ్రులు అసలే సహించరు.


విభజన బిల్లులోనే పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం కట్టాలని ఉంది. మరింత స్పష్టత కోసం ఫిబ్రవరి 20, 2014న పార్లమెంటులో ప్రధాని ఆర్ & ఆర్ ప్యాకేజీ గురించి ‘మా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్వహిస్తుంది- ఆ విషయంలో ఏ సందేహమూ అవసరం లేదు’ అని విస్పష్టంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం గత కొన్ని దశాబ్దాలుగా పెరుగుతూ వస్తోంది. 2013–14 అంచనాల ప్రకారం 29,027.95 కోట్ల రూపాయలకు పెరిగింది. దానిలో 20,398.81 కోట్ల రూపాయలే ఇరిగేషన్ కంపోనెంట్ అంటూ 2017 మార్చిలో కేంద్ర కేబినెట్ 2013 భూసేకరణ చట్టాన్ని పరిగణనలోకి తీసుకోకుండా అంచనాలను ఆమోదించింది. 2014లో అమల్లోకి వచ్చిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపింది. అయితే ఆ ఫైల్ అప్పటికి కేంద్ర క్యాబినెట్‍కి ఇంకా అందలేదట! కొత్త భూసేకరణ చట్టం 2013ని రాష్ట్రాలు తప్పనిసరిగా అమలు చేయాలి కాబట్టి మొత్తం మరలా గణనలోకి తీసుకుని రూ.57,297 కోట్లకు జనవరి 5, 2018న 2017–-18 ఎస్.ఎస్.ఆర్ రేట్ల ప్రకారం కేంద్రానికి అంచనాలు పంపించింది. ఆర్&ఆర్ ప్యాకేజి ముందుగా అమలు కాకపోవడం వల్ల వచ్చిన, పెరిగిన జనావాసం తాజా మార్పులు, రాష్ట్ర విభజనలో భూభాగం మార్పు అనేకం కొన్ని కారణం. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, డాం డిజైనింగ్ అథారిటీ వారు అందరి ఆమోదంతోనే పంపించడం జరిగిందని చెబుతోంది రాష్ట్ర ప్రభుత్వం.


టిఎసి 2017–18 ఎస్‌ఎస్‌ఆర్ ప్రకారం ఫిబ్రవరి 18, 2019లో ఆ అంచనాలను రూ.55,548.47 కోట్లకు మాత్రమే ఆమోదించింది. దీన్ని రాజ్యసభలో కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. దీనిలో విద్యుత్ వరకు రాష్ట్రం భరించాలి. అయితే తరువాత జలశక్తి శాఖ, ఇతర విభాగాలు పరిశోధించి ఆ అంచనాను కుదించి రూ.47,725.74 కోట్లుగా ఆమోదించారు. విద్యుత్ ఖర్చులు మినహాయించి ఇరిగేషన్ కంపోనెంట్ రూ.43,164.83గా ఆర్‌సిఇ. నిర్ధారించారు. అయితే ఏప్రిల్ 1,2014 ముందు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన రూ. 5135.87 కోట్లను తిరిగి ఇవ్వమనే మాట కూడా ఉంది. దాన్ని రాష్ట్ర వాటాగా ఏప్రిల్ 29, 2014 కేంద్ర క్యాబినెట్ ఈ ప్రాజెక్టుకి జాతీయ ప్రాజెక్టుగా పనిచేయటానికి కోసం ఎ.ఐ.బి.పి నిబంధనలు కూడా మార్చివేసినట్లు తెలుస్తోంది కదా. మే 26, 2014న కేంద్ర కేబినెట్ రాష్ట్ర వాటా ఏదైతే 10శాతం ఉండాలో ఆ నిధులు ఆల్రెడీ భర్తీ చేసినట్లు కూడా ఏకపక్షంగా నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక శాఖ సెప్టెంబరు 30, 2014లో చేసిన ఒక ప్రకటన పట్టుకుని కేంద్ర ప్రభుత్వం కేవలం మార్చి 1, 2014న ఉన్న అంచనా ప్రకారం ఆ 100శాతం ఇరిగేషన్ కాంపోనెంట్స్ మాత్రమే ఇస్తారు అని నేడు వక్రభాష్యాలు చెబుతున్నారు. కేంద్రాన్ని ఈ దేశంలో ఎక్కడైనా ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంచనాలు ఒక్క రూపాయి పెంచకుండా పూర్తయిన ప్రాజెక్టు ఉందేమో చూపించమనండి. ఈ కుట్రలు కేవలం ఆంధ్ర ప్రదేశ్ విషయంలోనే ఎందుకు చేస్తున్నారు? ఇలాంటి ఏకపక్ష విధానాలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థకి, ఫెడరల్ విధానానికి వ్యతిరేకం. 


2010–-11 నుంచి 2017–-18 మధ్య మారిన ఖర్చు అంచనాలు చూసుకుంటే సివిల్, మెకానికల్, మిగతా మౌలిక సదుపాయాలు, హెడ్ వర్క్స్, కెనాల్స్ అంచనాలు ఏవీ భారీగా పెరగలేదు. కేంద్రం చట్టం ప్రకారం రాష్ట్రం కచ్చితంగా అమలు చేయాల్సిన తాజా ఆర్&ఆర్ వల్లనే 900శాతం పెరిగింది. ఆంధ్రప్రదేశ్ నేటికి రూ.17,656.82కోట్లు ఖర్చుపెట్టగా మార్చి 1, 2014 తర్వాత రూ.12,520.91కోట్లు ఖర్చుపెట్టారు. దాంట్లో కేంద్రప్రభుత్వం 8507 కోట్ల రూపాయలు మాత్రమే ఇంతవరకూ ఇచ్చింది.


జూన్ 25, 2018న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాస్తూ రూ.57,950.86 కోట్ల అంచనాలను పంపించాము అని చెప్పడం జరిగింది తప్ప కేంద్ర 29వేల కోట్ల నిర్ణయాన్ని ఆమోదించలేదు. మార్చి 2, 2020న జలశక్తి మంత్రిత్వశాఖ ఒక సమాచార హక్కు ద్వారా అడిగిన ప్రశ్నకు స్పష్టంగా సమాధానం ఇస్తూ - కేంద్రప్రభుత్వం మార్చి 1, 2014తో మొదలుకొని, ఆ రోజుకు ఉన్న అంచనాలను అనుసరించి, ఇరిగేషన్ కంపోనెంట్‌లో మిగిలిన ఖర్చును 100శాతం ఇస్తుందని, అందులో భూసేకరణ, పునరావాసమూ భాగమేననీ పేర్కొంది.


అన్నిటికంటే ముఖ్యం పార్లమెంటులో భారత ప్రభుత్వం అధికారికంగా సంబంధిత మంత్రివర్యులచే జూలై 15, 2019లో ఎంపీ విజయసాయి రెడ్డిగారి ప్రశ్నకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన ప్రకటన ఇలా ఉంది: ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2017–-18 సంవత్సరాలకు ధరలను అనుసరించి సవరించిన రూ.57,297.42 కోట్ల ఖర్చు అంచనాను జనవరి 2018లో జాతీయ జల కమిషన్‌కు అందజేసింది. ఫిబ్రవరి 11, 2019న జలశక్తి మంత్రిత్వ శాఖ తన 141వ సమావేశంలో ఈ అంచనాను పరిశీలించి 2017–18 సంవత్సరాల ధరలకు అనుసరించి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకు రూ.55,548.87 కోట్ల ఖర్చు అంచనాను ఆమోదించింది. ఇందులో ఇరిగేషన్ కాంపోనెంట్ రూ.50,987.96.’ అంటే ఇరిగేషన్ కంపోనెంట్ రూ.50,987.96 కోట్లుగా కేంద్రం సుస్పష్టంగా ఆమోదించింది. ఇక సమస్య ఏది?


కేంద్రంలోని నాయకులు తమకే ప్రాజెక్టు ప్రతిష్ట మొత్తం దక్కాలనుకుంటే దాన్ని వారే చేపట్టి పూర్తి సామర్థ్యంతో పూర్తి చేయమనండి.ఎవరు కట్టినా అత్యంత సురక్షిత ప్రమాణాలతో కట్టాలనేది అత్యంత ముఖ్యమైన విషయం. 2015లో ప్రధాని కార్యాలయం నుంచి ప్రాజెక్టుకు 70శాతం నిధులు ఇస్తే సరిపోతుందన్న లేఖ జలవనరుల శాఖకు వస్తే, విభజన చట్టం ప్రకారం 100శాతం నిధులు ఇచ్చి తీరాలని నాటి మంత్రి ఉమాభారతి ప్రధానికి స్పష్టం చేశారు. వారిని వెంటనే ఆ శాఖ నుంచి తొలగించారు. మొదటి నుంచి కొందరు ఈ ప్రాజెక్టు మోకాలు అడ్డుతున్నారు. ఎత్తు తగ్గించినా ఆనందమే అనీ, దాన్ని బ్యారేజీగా మార్చుకుని మురిసిపోవాలని, ఏపీలో కొందరితో, అలాగే వేరే రాష్ట్రాల, ప్రాంతాల వారితో మురిపించాలని, మాలో మాకే తగువులు పెట్టాలని చూస్తున్నారు. అది సరికాదు. 


ఈ జాతీయ ప్రాజెక్టు ఆర్&ఆర్ ప్యాకేజీలో అవినీతి జరుగుతుంది అనుకుంటే కేంద్రమే ప్రత్యక్షంగా పూర్తి చేయాలి. ఇంతకుముందు తెదేపా-భాజపా ఉమ్మడి ప్రభుత్వంలో, లేదా ఇప్పటి వైకాపా ప్రభుత్వంలో అవినీతి జరిగితే అంతర్జాతీయ నిపుణులనతో ఆడిట్ పెట్టి బాధ్యులని శిక్షించాలి. ఊరికే ఒకరిపై ఒకరు బురద చిమ్ముకునే ఈ రాజకీయాలు మాకొద్దు.


అంతిమంగా ప్రాజెక్టుకు అసలైన త్యాగం చేస్తున్న నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్యాకేజి కచ్చితంగా అమలుచేసి న్యాయం చేయాలి. పైగా వారిలో ఎక్కువమంది ఆదివాసీలు కూడా. వారికి ఇబ్బందే అయినా విస్తృత ప్రయోజనాల కోసం పీడిత వర్గాలే త్యాగం చేయాల్సి వచ్చింది. అంతటి అనుబంధం ఉన్న ఇళ్లను, ఊళ్లను, నేలను వారు వదులుకున్నందుకు వారి త్యాగానికి అదనంగా అందరూ చేతులెత్తి మొక్కాలి. రైతుకు పరిహారం, కొంత భూమికి భూమి ఇచ్చినా ఎక్కడైనా వారిది కచ్చితంగా త్యాగమే. కేంద్రం వెంటనే 2017–18 ఎస్‌ఎస్‌ఆర్ అంచనాల ప్రకారం (తాజా సవరణలతో సహా) విద్యుత్ కంపోనెంట్ మినహా రూ.50,987.96 కోట్లుకి ఆమోదం తెలపాలి. ఇవ్వాల్సిన నిధులు తక్షణం విడుదల చేయాలి. 


ఇక పోలవరానికి మొత్తం సామర్థ్యం లేకుండా అరకొరగా పూర్తి చేయాలని చూస్తే పోరాటం తప్పదు. ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నాడు ఏమి చెప్పారో ప్రజలు మరచిపోలేదు. అధికార ప్రతిపక్షాలు రాజకీయస్వార్థం వదిలి ఇప్పుడైనా కలసికట్టుగా పోరాడి పోలవరం ప్రాజెక్టును, రాయతీలతో ప్రత్యేక తరగతి హోదాను, విభజన హామీలను సాధించకపోతే రాష్ట్రం నిండా మునుగుతుంది. ఈ రోజు ముఖ్యమంత్రిని కొందరు తప్పుదారి పట్టిస్తే, వారు దానిని నమ్మితే డా.వైయస్సార్ ఆత్మ క్షమించదు. రాజకీయాల కోసం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తే ఎన్టీఆర్ ఆత్మ ఊరుకోదు. ఆంధ్రులు అసలే సహించరు.

చలసాని శ్రీనివాస్

Updated Date - 2020-11-25T06:12:13+05:30 IST