విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపరాదు

ABN , First Publish Date - 2022-07-01T04:48:09+05:30 IST

జిల్లాలో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపకుండా తమ విధులు సక్రమంగా నిర్వర్తించాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా తెలిపారు.

విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపరాదు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా

కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా

రాయచోటి (కలెక్టరేట్‌), జూన్‌ 30: జిల్లాలో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపకుండా తమ విధులు సక్రమంగా నిర్వర్తించాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని స్పందన హాల్‌లో అన్నమయ్య జిల్లాలోని డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకుల సర్వీస్‌ పునరుద్ధరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో 8 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయని, ఇందులో 47 మంది ఒప్పంద అధ్యాపకులు పనిచేస్తున్నారన్నారు. వీరందరూ ఏడాదికి ఒకసారి తప్పకుండా తమ సర్వీసు రెన్యూవల్‌ చేయించుకుంటున్నారని తెలిపారు. ఒప్పంద అధ్యాపకులు సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు అర్థమయ్యే విధంగా విద్యాబోధన చేయాలన్నారు. అధ్యాపకులు కళాశాలలకు సక్రమంగా రాకపోయినా, అధ్యాపకులు బోధించే సబ్జెక్టుల్లో విద్యార్థులు ఫెయిల్‌ అయినా, సంబంధిత అధికారుల సర్వీసు రెన్యూవల్‌ చేయకుండా వారిని తొలగిస్తారన్నారు. కావున అధ్యాపకులు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా విద్యా బోధన చేసి నియమ నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఉందని, ప్రతి విద్యార్థి మంచి మార్కులతో ఉత్తీర్ణులైతే తప్ప మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదన్నారు. అధ్యాపకులు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతి విద్యార్థి మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యే విధంగా నాణ్యమైన విద్యాబోధన చేయాలని తెలిపారు. సమావేశంలో పీలేరు లీడ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుధాకర్‌రెడ్డి, జిల్లాలోని ఒప్పంద అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-01T04:48:09+05:30 IST