చెరువులో చుక్కనీరు నిల్వ ఉంచకండి!

ABN , First Publish Date - 2022-06-28T04:59:28+05:30 IST

చెరువులో చుక్కనీరు నిల్వ ఉంచకండి!

చెరువులో చుక్కనీరు నిల్వ ఉంచకండి!
చెటేరు కుంట కల్వర్టు పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి మల్లారెడ్డి


  • కల్వర్టు పనుల శంకుస్థాపన సందర్భంగా మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్య
  • మంత్రి వ్యాఖ్యలపై స్థానికుల విచారం

ఘటకేసర్‌, జూన్‌ 27: కల్వర్టు పనులకు, నిర్మాణం కొట్టుకపోకుండా ఉండేందుకు అడ్డంకిగా మారితే చెరువులో చుక్క నీరు కూడా లేకుండా పైపులు వేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారులతో అన్నారు. ఆయన మాటలతో స్థానికులు విస్తుపోయారు. చెరువు, కుంటలను కాపాడాలని చెప్పాల్సిన మంత్రే ఈ విధంగా మాట్లాడడం సరికాదని చర్చించుకున్నారు. సోమవారం మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండల పరిషత్‌ సమీపంలోని చెటేరు కుంట కల్వర్టు నిర్మాణ పనుల శంకుస్థాపన సందర్భంగా మంత్రి ఈవిధంగా మాట్లాడారు. రెండేళ్ల క్రితం భారీ వర్షం, వరదకు కల్వర్టు కట్టకు గండిపడింది. కల్వర్టుపై బీటీ కొట్టుకుపోయింది. దీంతో ఆర్‌అండ్‌బీ రోడ్డు మరమ్మతులకు రూ.23లక్షలు మంజూరు చేసింది. మంత్రి స్థానిక ప్రజాప్రతినిధలతో కలిసి సోమవారం పనులకు శంకుస్థాపన చేశారు. ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ అధికారులను వివరాలు అడిగారు. ప్రస్తుతం కల్వర్టులో రెండు పైపులు ఉన్నాయని, మారో మూడు పైపులు వేసి మరమ్మతులు పూర్తి చేస్తామని ఆర్‌అండ్‌బీ అధికారులు తెలిపారు. విడులైన నిధులు అంతవరకే సరిపోతాయన్నారు. వారి అభిప్రాయంతో నీటిపారుదల శాఖ అధికారులు విభేదించారు. మరిన్ని పైపులు వేస్తే భారీ వరద వస్తే మళ్లీ గండి పడుతుందని, అందుకే ఇక్కడ బ్యాక్‌ కల్వర్ట్‌ నిర్మించాలన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. ‘‘బ్యాక్‌ కల్వర్ట్‌ లేదు. ఏమీ లేదు. పైన శ్మశాన వాటిక సైతం ఉంది. మరిన్ని పైప్‌లు వేసి పనులు పూర్తిచేయండి. పైపులను మరింత లోతునుంచి వేసి చెరువులో చుక్క నీరు నిలువ ఉండకుండా కిందికి పోయేట్లు చూండండి’’ అని అన్నారు. మంత్రి మల్లారెడ్డి మాటలకు అక్కడున్న వారు నిశ్చేష్టులయ్యారు. చెరువు, కుంటల్లో నిండుగా నీరుండాలని, వాటిని సంరక్షించాలని చెప్పాల్సిన మంత్రే చెరువులో చుక్క నీరు లేకుండా ఖాళీ చేయించాలని చెప్పడం సరికాదన్నారు.

మంత్రి ముందే తిట్టుకున్న నాయకులు

చెటేరు కుంట కల్వర్టు పనుల శంకుస్థాపనకు వచ్చిన మంత్రి ఎదుటే టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు ‘నువ్వు దొంగ అంటే నువ్వే దొంగ’ అని తిట్టుకున్నారు. శంకుస్థాపన కార్యక్రమం ముగియగానే మంత్రి మల్లారెడ్డి సొసైటీ చైర్మన్‌ రాంరెడ్డిని ‘నీ పుట్టిన రోజు ఎప్పుడు?’ అని అడిగారు. రాంరెడ్డి స్పందించ లేదు. దీంతో మంత్రి మల్లారెడ్డి సొసైటీ డైరెక్టర్‌ ధర్మారెడ్డిని రాంరెడ్డి బర్త్‌ డే ఎప్పుడు? అని అడిగారు. దీంతో ఆగ్రహించిన రాంరెడ్డి ‘నా గురించి వాడిని అడగడం ఏంది. వాడో దొంగ’ అని అన్నారు. దీంతో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ‘‘నాపై కేసుల్లేవు. నేను జైలుకు వెళ్లలేదు. నేనెలా దొంగనవుతా?’’ అని ఎదురు ప్రశ్నించాడు. ఇంతలో మంత్రి కలుగజేసుకొని ‘మీకు పడిరాకుంటే మౌనంగా ఉండాలి కానీ దొంగఅనడం సరికాదు.’ అంటూ ముందుకువెళ్లారు. కార్యక్రమంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి, చైర్‌పర్సన్‌ పావనిజంగయ్య, వైస్‌చైర్మన్‌ పల్గుల మాధవరెడ్డి, కౌన్సిలర్లు రమాదేవి, మల్లేష్‌, సంగీత, వెంకట్‌రెడ్డి, అంజనేయులు, శ్రీనివా్‌సగౌడ్‌, రాధాకృష్ణ, కె.అంజిరెడ్డి, రమేష్‌, హరిశంకర్‌, విజయ్‌, నరేష్‌, అధికారులు పాల్గొన్నారు.

అర్హులందరికీ  డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లు

కీసర: అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లు కేటాయిస్తామని కార్మిక శాఖ మంత్రి చామాకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం కీసర తహసీల్దార్‌ కార్యాలయంలో ఘట్‌కేసర్‌, ిపీర్జాదిగూడ, బోడ్డుప్పల్‌ ప్రాంతాలకు సంబంధించి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కేటాయింపునకు డ్రా  తీశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి  మాట్లాడారు. పేదలకు సొంతింటి కల నేరవేర్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేిసీఆర్‌ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పథకం ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. పథకం ద్వారా ఇళ్లు లేని నిరుపేదలకు ఎంతో లబ్ధిచేకూరుతుందన్నారు. కాగా కీసర మండలానికి సంబంధించి అసలైన లబ్ధిదారుల పేర్లు నమోదు కాలేదని గ్రామస్థులు ఆరోపించడంతో కీసరలో ఉన్న ఇళ్లకు సంబంధించి డ్రా వాయిదా వేశారు. కార్యక్రమంలో ఆర్‌డీవో రవి, ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-28T04:59:28+05:30 IST