పన్ను పెంపు వద్దు

Jun 17 2021 @ 02:28AM

రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు  

వార్డు సచివాలయాల ఎదుట ఆందోళనలు

భారీగా పాల్గొన్న ప్రజలు, ప్రజాసంఘాల నేతలు

నేడు కూడా కొనసాగనున్న నిరసనలు 


 (ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

పట్టణాల్లో ఆస్తి పన్ను పెంపుపై ప్రజలు గళం విప్పారు. ఆస్తి విలువల ఆధారంగా ఆస్తి పన్ను విధింపుతోపాటు చెత్త పన్ను విధించాలన్న నిర్ణయాలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో ఆంధ్రప్రదేశ్‌ పట్టణ పౌర సమాఖ్య రెండు రోజుల ఆందోళనలకు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. తొలిరోజైన బుధవారం 13 జిల్లాల్లోనూ నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల్లో ఆందోళనలు నిర్వహించారు. దాదాపు అన్ని పట్టణ స్థానిక సంస్థల్లోనూ ఆందోళనలు కొనసాగాయి. వార్డు సచివాలయాలు, వీధి కూడళ్లు, కాలనీలు, అపార్ట్‌మెంట్ల సముదాయాల్లో ఆందోళనలు నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలతోపాటు ప్రజాసంఘాలు, వర్తక, వాణిజ్య అసోసియేషన్ల సభ్యులు పెద్దసంఖ్యలో ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. పన్నుల భారం మోపొద్దంటూ అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. గురువారం కూడా ఆందోళనలు కొనసాగనున్నాయి. కరోనాతో ప్రజలు అల్లాడుతున్న సమయంలో పన్నుల పేరిట పిండుడు తగదంటూ విజయవాడ బీసెంట్‌ రోడ్డులో వినూత్నంగా నిరసన తెలిపారు. మంచంపై ఆక్సిజన్‌తో ఉన్న కొవిడ్‌ బాధితుడిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల పేరుతో పీల్చి పిప్పి చేస్తున్న తీరును ప్రదర్శించారు. ఏపీ పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్‌ సీహెచ్‌ బాబూరావు మాట్లాడుతూ పన్నుల పెంపు వల్ల ప్రజలపై పడబోయే భారం పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నట్లు 15 శాతానికి మాత్రమే పరిమితమవబోదని ఆరోపించారు. అవాస్తవాలతో బొత్స ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు.  


ఇప్పటికైనా ప్రభుత్వాలు దిగి రాకుంటే ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆస్తి పన్ను పెంపును నిరసిస్తూ బీజేపీ నేతలు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ‘‘పట్టణాలు, నగరాల అభివృద్ధికి మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిధులిస్తోంది. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ప్రజలపై పన్నులు వేస్తోంది. జగనన్న బాదుడు (ఇంటి పన్ను పెంపు)తో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధమూ లేదు. ఆదాయం జగన్‌ ప్రభుత్వం ఆర్జిస్తూ, అపనింద మాత్రం కేంద్రంపై వేస్తోంది’’ అని బీజేపీ నేతలు మండిపడ్డారు. పీఎంఏవై కింద కేంద్రం నిధులిస్తే, ఎక్కడా మోదీ పేరు పెట్టకుండా జగనన్న కాలనీలుగా ప్రచారం చేసుకుంటున్నారని, పన్నుల విషయంలో మాత్రం జగనన్న బాదుడుకు కేంద్రాన్ని నిందించడమేంటన్నారు. హిందూ ఆలయాల నుంచి నిధులు తస్కరిస్తున్న సీఎం ఏపీలో మినహా ఎక్కడా లేరని విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ వద్ద ఆందోళనలో బీజేపీ రాష్ట్రకార్యదర్శి నాగోతు రమేశ్‌ నాయుడు విమర్శించారు. పన్నుల పెంపు నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని జాతీయ లేబర్‌ బోర్డు చైౖర్మన్‌ వల్లూరి జయప్రకాశ్‌ నారాయణ హెచ్చరించారు. విశాఖలో జీవీఎంసీ  ఎదుట గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నాలో ‘అన్న వచ్చాడు...పన్ను పెంచాడు’ అంటూ బీజేపీ నేతలు నినాదాలు చేశారు. బ్యానర్లు ప్రదర్శించారు. పన్ను పెంపు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ డిమాండ్‌ చేశారు. అన్న వచ్చి ఏదో చేస్తాడనుకుంటే, నడ్డి విరగ్గొట్టే పనులు చేస్తున్నాడని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజు విమర్శించారు.   

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.