నగదు రూపంలో రుసుములు వద్దు

ABN , First Publish Date - 2022-05-20T09:33:58+05:30 IST

ప్రయివేటు వైద్య కళాశాలలు నగదు రూపంలో రుములు వసూలు చేయడాన్ని గురువారం సుప్రీంకోర్టు నిషేధించింది.

నగదు రూపంలో రుసుములు వద్దు

ప్రయివేటు వైద్య కళాశాలలకు సుప్రీంకోర్టు ఆదేశం

షెడ్యూలు ప్రకారం కౌన్సెలింగ్‌ పూర్తి చేయాలని సూచన

న్యూఢిల్లీ, మే19: ప్రయివేటు వైద్య కళాశాలలు నగదు రూపంలో రుములు వసూలు చేయడాన్ని గురువారం సుప్రీంకోర్టు నిషేధించింది. క్యాపిటేషన్‌ ఫీజు బెడదను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకొంది. జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. 2004-05, 2005-06, 2006-07 విద్యా సంవత్సరాలకు సంబంధించి అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్సుల రుసుముల విషయంలో ఫీ ఫిక్సేషన్‌ కమిటీ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు ఇచ్చింది. పలుమార్లు ఆదేశాలు ఇచ్చినప్పటికీ క్యాపిటేషన్‌ ఫీజులు వసూలు చేస్తుండడాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఈ సమస్య పరిష్కారానికి సీనియర్‌ న్యాయవాది సల్మాన్‌ ఖుర్షీద్‌ను కోర్టు సహాయకునిగా నియమించింది. ఆయన ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకొని పలు సూచనలను ఉత్తర్వుల్లో పొందుపరిచింది. 

క్యాపిటేషన్‌ ఫీజు వసూళ్లపై ఫిర్యాదులు చేయడానికి వీలుగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓ వెబ్‌పోర్టల్‌ను ఏర్పాటు చేయాలి. దీన్ని నేషనల్‌ ఇన్ఫర్మాటిక్‌ సెంటర్‌ నిర్వహించాలి.

ఈ పోర్టల్‌పై విద్యార్థులకు అవగాహన కలిగేలా ప్రవేశాల సమయంలో అన్ని ఇంగ్లిషు, స్థానిక వార్తా పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలి. కౌన్సెలింగ్‌ చేసినప్పుడే దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులకు కరపత్రాలు ఇవ్వాలి. ఇందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు బాధ్యత తీసుకోవాలి.

అడ్మిషన్ల తేదీకి కనీసం రెండు వారాల ముందే స్ట్రే వేకెన్సీ రౌండ్‌ సహా అన్ని రకాల కౌన్సెలింగ్‌ ముగిసేలా నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌, డెంటల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాలు షెడ్యూలును ఖరారు చేయాలి.

స్ట్రే వేకెన్సీ రౌండ్‌లో అడ్మిషన్లు పొందిన అభ్యర్థులు నీట్‌లో సాధించిన ర్యాంకులను బహిర్గత పరచాలి. కేవలం మెరిట్‌ ఆధారంగానే ఈ విభాగంలో సీట్లు కేటాయించాలి. ఇందుకు విరుద్ధంగా జరిగితే సంబంధిత ప్రయివేటు వైద్య కళాశాలలపై కఠిన చర్యలు ఉంటాయి.

రుసుములను నిర్ణయించే ముందు అందులోని అన్ని అంశాలను ఫీ ఫిక్సేషన్‌ కమిటీలు నిర్ధరించాలి. యాజమాన్యాలు ఇతరత్రా రూపాల్లో   అదనపు రుసుములు వసూలు చేసుకోవడానికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదు. నిర్ణయించిన రుసుముకన్నా అదనంగా వసూలు చేయాలనుకున్నా, జాబితాలోని ఇతర అంశాల పేరుతో ఫీజు వసూలు చేయాలనుకున్నా అందుకు తప్పనిసరిగా ఫీ ఫిక్సేషన్‌ కమిటీ అనుమతి తీసుకోవాలి.

ప్రయివేటు వైద్య కళాశాలల యాజమాన్యాలు ఎట్టి పరిస్థితుల్లోనూ రుసుములను నగదు రూపంలో వసూలు చేయకూడదు. క్యాపిటేషన్‌ ఫీజు వసూలు చేయకుండా నిరోధించడానికే ఈ నిర్ణయం. ఎవరైనా నగదు రూపంలో ఫీజు చెల్లించాలని అడిగితే వారిపై వెబ్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేసే స్వేచ్ఛ విద్యార్థులకు, సంబంధీకులకు ఉంది.

నిర్ణయించిన టైమ్‌ షెడ్యూలుకు అనుగుణంగా ఆల్‌ ఇండియా కోటా, స్టేట్‌ కోటాల కౌన్సెలింగ్‌ పూర్తయ్యేలా డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌, రాష్ట్రాల్లోని సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి. 

Updated Date - 2022-05-20T09:33:58+05:30 IST