ఒక్క పోస్టూ రద్దు చేయనన్నారే..?

Published: Mon, 28 Mar 2022 03:20:13 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఒక్క పోస్టూ రద్దు చేయనన్నారే..?

ఏకంగా 4,764 ఎస్జీటీ ఉద్యోగాలకు కోతా!

భవిష్యత్తులో పోస్టుల భర్తీ ప్రశ్నార్థకమే

ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల ఆగ్రహం

జీవో వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ 

రద్దుపై ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’

‘ఉపాధ్యాయ ఖాళీలపై వేటు’ శీర్షికతో కథనం

జనవరి 3నే వెల్లడి.. ఇప్పుడు బట్టబయలు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రభుత్వం 4,764 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులను రద్దు చేయడంపై ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నేతలు, నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగాల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వకపోగా, ఉన్న పోస్టులను రద్దు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఒక్క స్కూలును కూడా మూసేయబోమని, ఒక్క పోస్టునూ రద్దు చేయబోమని, పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ అబద్ధమని మండిపడుతున్నారు. ప్రాథమిక పాఠశాలల్లోని వేలాది సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులను రద్దు చేయడం వల్ల భవిష్యత్తులో పిల్లల విద్యపై తీవ్రప్రభావం పడనుందని ఆందోళన వ్యక్తం చేశారు. మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల జీతాల పద్దు మార్చాలని కోరినందుకు ఎస్జీటీ పోస్టులు రద్దు చేయడం వింతగా ఉందని విమర్శిస్తున్నారు. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తూ, ఎస్జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని.. అంటే భవిష్యత్తులో ఎస్జీటీ పోస్టులను భర్తీ చేయడం ప్రశ్నార్థకమేనని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉండగా, భర్తీ చేయకుండా ఉన్న వాటిని రద్దు చేయడాన్ని తప్పుపడుతున్నారు. 


జీవోను ఉపసంహరించుకోవాలి: ఏపీటీఎఫ్‌ 

రాష్ట్ర ప్రభుత్వం 4,764 ఎస్జీటీ పోస్టులను రద్దు చేస్తూ జారీ చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని ఏపీటీఎఫ్‌ అధ్యక్షుడు భానుమూర్తి, ప్రధాన కార్యదర్శి పాండురంగవరప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. 12 సంవత్సరాల క్రితం మంజూరైన మోడల్‌ స్కూళ్ల పోస్టుల కోసం, ఇప్పుడు ఎస్జీటీ పోస్టులను రద్దు చేయడం ఏమాత్రం సహేతుకంగా లేదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేసినప్పుడు ఆ పోస్టులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసి నిధులను విడుదల చేసిందని తెలిపారు. చాలాకాలం పాటు జీతాలు కూడా కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి ఇచ్చారని వెల్లడించారు. 2017లో కేంద్ర ప్రభుత్వ పన్నుల్లో రాష్ట్రానికి ఇచ్చే వాటాను 31 శాతం నుంచి 42 శాతానికి పెంచడంతో కొన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలను రాష్ట్రం భరించాలని ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. ఆదర్శ పాఠశాలల నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎస్జీటీ పోస్టులు రద్దు చేయడం సరికాదని విమర్శించారు. 


రద్దు నిర్ణయం సరికాదు: సమన్వయ వేదిక  

ఎస్జీటీ పోస్టులను రద్దు చేయాలన్న నిర్ణయం సరికాదని, ప్రభుత్వం వెంటనే జీవోను వెనక్కు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసరెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం అప్పట్లో 254 జీవో ద్వారా మోడల్‌ స్కూళ్ల టీచర్ల పోస్టులకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. వారికోసం ఇప్పుడు ఎస్జీటీ  పోస్టులను రద్దు చేయడాన్ని తప్పుపట్టారు. పోస్టులు రద్దు చేయకుండా మోడల్‌ స్కూళ్ల టీచర్లకు 010 పద్దు కింద జీతాలు చెల్లించేలా సర్వీస్‌ నిబంధన విడుదల చేయాలన్నారు. 


ఒక్క పోస్టూ రద్దు కాదంటే..  అర్థం ఇదా?: ఎస్‌ఎ్‌ఫఐ 

ఎస్జీటీ పోస్టులను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని ఎస్‌ఎ్‌ఫఐ అధ్యక్ష, కార్యదర్శులు ప్రసన్న కుమార్‌, అశోక్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఒక్క పోస్టూ రద్దు కాదు.. ఒక్క స్కూలునూ మూయబోమంటే అర్థం ఇదా? అని ప్రశ్నించారు. ఇప్పటికే పాఠశాలల్లో 25,000 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని, వాటి భర్తీ ఊసెత్తకుండా ఉన్న పోస్టులను రద్దు చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయంతో భవిష్యత్తులో డీఎస్సీ ఉండబోదని, టీచర్‌ పోస్టుల భర్తీ హామీ మాటలకే పరిమితమని అర్థమవుతోందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  


రద్దు చేయడం దారుణం: యూటీఎఫ్‌

విజయవాడ(పాయకాపురం), మార్చి 25: మోడల్‌ స్కూళ్లలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు సర్వీస్‌ నిబంధనల పేరుతో 4764 ఎస్జీటీ పో స్టులు రద్దు చేయడం దారుణమని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి  మనోహర్‌ కుమార్‌ అన్నారు. ఇప్పటికే ప్రాథమిక పాఠశాలల్లో టీచర్ల కొరత ఉందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పేద పిల్లల చదువు పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎస్జీటీ పోస్టులను రద్దు చేయరాదని, ఖాళీగా ఉన్న వేలాది ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. 


ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’ 

రాష్ట్ర ప్రభుత్వం 4,764 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులను రద్దు చేసినట్టు ‘ఆంధ్రజ్యోతి’లో జనవరి 3వ తేదీనే కథనం ప్రచురితమైంది. ‘ఉపాధ్యాయ ఖాళీలపై వేటు’ అనే శీర్షికతో ప్రచురించిన కథనం ఇప్పుడు నిజమైంది. జనవరిలోనే సర్కారు రహస్యంగా తీసుకున్న ఈ నిర్ణయం ఎట్టకేలకు బట్టబయలైంది. గురువారం రాత్రి ఈ పోస్టులను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 4,764 ఎస్జీటీ పోస్టులను రద్దు చేసిందని, కుంటి సాకులతో ఖాళీల భర్తీ ప్రక్రియను ఎగ్గొట్టడమే గాక అత్యంత రహస్యంగా ఉత్తర్వులు జారీ చేసిందని ‘ఆంధ్రజ్యోతి’ కథనం పేర్కొంది. ఆ ఉత్తర్వులు ‘ఆంధ్రజ్యోతి’కి లభించాయని వెల్లడించింది. మోడల్‌ స్కూళ్ల సిబ్బందికి సర్వీసు నిబంధనల సాకుతో చీకటి నిర్ణయం తీసుకుందని, 010 పద్దు కింద జీతాలు కోరినందుకు అడ్డగోలుగా మెలిక పెట్టిందని, ప్రభుత్వ రహస్య నిర్ణయాన్ని బట్టబయలు చేసింది. 

ఒక్క పోస్టూ రద్దు చేయనన్నారే..?


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.