maharastra crisis : Uddhav Thackeray రాజీనామా చేయొద్దు.. BJPతో జట్టు కడితే చాలు.. రెబల్ ఎమ్మెల్యేల ప్రకటన

ABN , First Publish Date - 2022-06-23T19:24:37+05:30 IST

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో ట్విస్ట్.. తిరుగుబాటు సూత్రధారి ఏక్‌నాథ్ సారధ్యంలోని రెబల్ ఎమ్మెల్యేలు కీలక ప్రకటన చేశారు.

maharastra crisis : Uddhav Thackeray రాజీనామా చేయొద్దు.. BJPతో జట్టు కడితే చాలు.. రెబల్ ఎమ్మెల్యేల ప్రకటన

ముంబై: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం(Maharastra political crisis)లో మరో ట్విస్ట్. తిరుగుబాటు సూత్రధారి ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) సారధ్యంలోని రెబల్ ఎమ్మెల్యేలు కీలక ప్రకటన చేశారు. ఉద్ధవ్ థాక్రే(Uddav Thackeray) సీఎం గద్దె దిగిపోవాల్సిన అవసరం లేదని, బీజేపీ(BJP)తో జట్టు కడితేచాలని ప్రకటించారు. ఈ మేరకు రెబల్ శిబిరంలో ఉన్న శివసేన ఎమ్మెల్యే దీపక్ కేస్కర్(Dipak keskar) వెల్లడించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రే రాజీనామాను తాము కోరుకోవడం లేదు. బీజేపీతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నామని దిపక్ కేస్కర్ పేర్కొన్నారు.


‘ ముఖ్యమంత్రిపై మాకు కోపం లేదు. ప్రభుత్వ కూటమిలోని ఇతరులపై మాకు ఆగ్రహం ఉంది.’ అని కేస్కర్ అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంటే మహారాష్ట్రకు ప్రయోజనాలు ఉంటాయని ఆశిస్తున్నామన్నారు. అత్యధిక మంది ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ షిండే వైపే ఉన్నారని చెప్పారు. ఉద్దవ్ థాక్రేతో ఇప్పటికే పలుమార్లు మాట్లాడాం. కానీ ఆయన రాజీనామా చేస్తానంటున్నారు. రాజీనామా వద్దని మేము కోరుతున్నామని పేర్కొన్నారు. మొత్తం 41 మంది ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ షిండే వెంటవున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో కీలకమైన మంత్రి పదవులన్ని కాంగ్రెస్, ఎన్‌సీపీల వద్దనే ఉన్నాయని ఆరోపించారు. శివసేన వద్ద కేవలం పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖలు మాత్రమే ఉన్నాయని అసంతృప్తిని వ్యక్తం చేశారు. 


కాగా ఎమ్మెల్యే దీపక్ కేస్కర్ గురువారం ఉదయమే గువహటిలో రెబల్ ఎమ్మెల్యేల శిబిరంలో చేరారు. గత 2 రోజులుగా ఉద్ధవ్ థాక్రే పక్కనే కనిపించిన ఆయన గురువారం ఉదయం అసోం వెళ్లారు. తనతోపాటు ఇద్దరు సేన ఎమ్మెల్యేలు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే గువహటి వచ్చారని చెప్పారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బీజేపీతో జట్టుకట్టాలని ఇక్కడున్న ఎమ్మెల్యేలు భావిస్తున్నారని దీపక్ కేస్కర్ చెప్పారు. 


ఉద్ధవ్ మీటింగ్‌కి 12 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరు

ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే భావోగ్వేదంతో ఎమ్మెల్యేలకు చేసిన విజ్ఞప్తి విఫలమైంది. వర్షాలో ఆయన నిర్వహించిన భేటీ కేవలం 12 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చారని సమాచారం. ఉద్ధవ్‌తో కలిసి ఆ పార్టీకి ప్రస్తుతం 13 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఎమ్మెల్యేలు అజయ్ చౌదరీ, రవీంద్ర వైకర్, రాజన్ సాల్వీ, వైభవ్ నాయక్, నితిన్ దేశ్‌ముఖ్, ఉదయ్ సామంత్, సునీల్ రౌత్, సునీల్ ప్రభు, దిలీప్ పాటిల్, రమేష్ కొర్గాన్‌కర్, ప్రకాశ్ ఫతర్పెకర్ మీటింగ్‌కు హాజరయిన వారిలో ఉన్నారు.

Updated Date - 2022-06-23T19:24:37+05:30 IST