ఏదన్నా చేయండి

ABN , First Publish Date - 2021-04-29T05:46:18+05:30 IST

దేశంలో ఇప్పుడు అలముకుని ఉన్న విషాద బీభత్స వాతావరణం ఎప్పుడు చెదిరిపోతుంది, మళ్లీ ఒకనాటి సాధారణ పరిస్థితులు ఎప్పుడు ఏర్పడతాయి...

ఏదన్నా చేయండి

దేశంలో ఇప్పుడు అలముకుని ఉన్న విషాద బీభత్స వాతావరణం ఎప్పుడు చెదిరిపోతుంది, మళ్లీ ఒకనాటి సాధారణ పరిస్థితులు ఎప్పుడు ఏర్పడతాయి, అని అందరూ ఆత్రుతగా ఉన్నారు. ఒక్కటంటే ఒక్కటి ఆశావహ పరిణామం కనిపించకపోవడం ప్రజల మనస్థితిని మరింతగా కుంగదీస్తున్నది. వ్యాధి వేగాన్ని, చికిత్సా వ్యవస్థల సామర్థ్యాన్ని సమస్థాయిలోకి తేవడానికి ప్రభుత్వాలు ఏవో తమ ప్రయత్నాలు తాము చేస్తున్నాయి. ప్రాణవాయు రవాణాలో వాయుసేన పాల్గొంటున్నది. రోగులకు సేవలందించడానికి సైన్యం ముందుకు వస్తున్నది. ప్రపంచదేశాలు ఉదారంగా అవీ ఇవీ పంపిస్తున్నాయి. ఇంకో ఆరునెలల తరువాత అయినా చేతికి అందే విధంగా కొన్ని వసతుల ఏర్పాట్లకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్యక్తులుగా, ఒక వృత్తివర్గంగా వైద్యులు, ఆరోగ్యసిబ్బంది ఈ సమయంలో అందిస్తున్న సేవలు మానవ శక్తి, ప్రవృత్తి మీద ఆశాభావాన్ని మిగిలిస్తున్నాయి. అక్కడక్కడ, గొప్ప మనుషులు, తమ సర్వశక్తులు ధారపోస్తూ, మనుషులను బతికించడానికి, నరకయాతనలను సాధ్యమైనంతగా తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రయత్నాలను గమనిస్తూ, కొరతలను సూచిస్తూ, నిర్ణయాలకూ అమలుకూ నడుమ అగాధాన్ని పూడ్చుతూ, వనరులకు అందుబాటుకు మధ్య ఎడం చెరిపేస్తూ బలమైన పౌరసమాజం, సంఘటితంగా, రంగంలో ఉంటే బాగుండేది. ప్రభుత్వ పరిమితులు ప్రజలకు తెలిసేవి. ప్రజలేమనుకుంటున్నారో ప్రభుత్వానికీ తెలిసివచ్చేది. 


రెండో విడత కరోనా ఉధృతిలో, ప్రాణావసరాల కొరత తీవ్రతలో, దేశవ్యాప్తంగా అంత్యక్రియల ధూమం ఆకాశాన్ని దట్టంగా కప్పేస్తున్న విషాదంలో, కేంద్రప్రభుత్వం సహజంగానే విమర్శల పాలయింది. కరోనా వ్యాధి నిర్వహణ, నిర్మూలన, అందుకు తగిన ప్రజాజీవితనిర్ణయాలు-, అన్నిటిలోనూ సర్వంసహా నిర్ణయాధికారంతో వ్యవహరిస్తున్నందున, పరిస్థితుల మంచిచెడ్డలకు కేంద్రం బాధ్యత వహించకతప్పదు. కానీ, ఆ విమర్శలు ప్రజల రాజకీయ నిర్ణయంగా పరిణమిస్తుందని చెప్పలేము. మే 2వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపులో తలకిందులయ్యే పెద్ద ఫలితాలేమీ ఉండవు. మొన్న జరిగిన అసెంబ్లీల ఎన్నికల్లో ప్రతిపక్షాల చేతిలో ఉన్నవి, మళ్లీ ప్రతిపక్షాల చేతికే వెళ్లేవి అధికం ఉన్నాయి. వచ్చే ఫలితాలను ఎట్లా అయినా వ్యాఖ్యానించుకోవచ్చు. బెంగాల్‌లో బిజెపికి గెలుపు లభిస్తే, దానిని కరోనా విధానాల గెలుపుగా కూడా వ్యాఖ్యానించుకోవచ్చు. కరోనా విధానాల వైఫల్యం గురించి దేశవిదేశాల పత్రికలు హోరెత్తుతుండగా, దానిని బలహీనంగా ప్రతిధ్వనించడానికి దేశంలోని జాతీయ ప్రతిపక్షాలు ప్రయత్నించడం లేదు. ప్రభుత్వాలపై ఎదురుగాలి పెరిగినప్పుడు, దానిపై సవారీచేస్తూ ముందుకువచ్చే ప్రతిపక్షం ఉండాలి. 


ఇంత గత్తర కాలంలో, రాజకీయాల గురించి మాట్లాడుకోవచ్చునా? అటువంటి విచక్షణ ఉంటే గింటే ప్రజలకు ఉంటుందేమో కానీ, రాజకీయ పక్షాలకు లేదు. పరిస్థితి ఇంతగా విషమించినా, బెంగాల్‌లో మిగిలిన విడతలను కలిపి ఒకే విడతగా మార్చడానికి ప్రభుత్వం ఒప్పుకోలేదు. దేశంలో జరుగుతున్న మరణాలన్నిటికీ ఎన్నికల సంఘమే బాధ్యత వహించాలని చెన్నై హైకోర్టు గట్టి అభిప్రాయమే ప్రకటించింది. ప్రభుత్వాలను అదిలించకపోతే పనిచేయవని గుర్తించి, కోర్టులు అనేక రాష్ట్రాల్లో విస్పష్టమైన ఆదేశాలిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికలు కూడా ఒప్పుకుందాం, స్థానిక సంస్థల ఎన్నికలనైనా వాయిదా వేస్తే నష్టమేమిటి? ప్రచార ర్యాలీలు చూస్తుంటే, ఇంతటి బాధ్యతారాహిత్యం ప్రజాస్వామ్యం పేరుతో చెలామణీ అవుతోందేమిటి అని ఆశ్చర్యం వేస్తుంది. కుంభమేళా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మేళా ముగిసిపోయిందని, మే 14 నుంచి చార్ ధామ్ యాత్ర మొదలవుతుందని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది కూడా. తన ర్యాలీకి అంత మంది వచ్చినందుకు ప్రధానమంత్రే మురిసిపోతారు. ఆరునూరైనా పదోతరగతి పరీక్షలు జరిపి, విద్యార్థుల భవిష్యత్తు కాపాడవలసిందేనంటారు మరో ముఖ్యమంత్రి. సగం సగం జనమైనా సినిమాలు నడవాల్సిందే, రాత్రి ఎనిమిది దాకా అయినా పబ్బుల పబ్బం గడవాల్సిందే. 


పాలకులకు విచక్షణ అంటూ ఉండాలి కదా? లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారం కాదు. కానీ, జనం ఊహించుకుని ఆందోళన చెందుతున్నారు. పోయిన ఏడాది లాగానే ఇప్పుడు కూడా తగిన సమయం ఇవ్వకుండా అకస్మాత్తుగా విధిస్తారేమో? అది తప్ప ఇతర పరిష్కారాలు చర్చల్లో ఉంటే, మరెవరైనా ప్రతిపాదిస్తే, లాక్‌డౌన్ కథనాలు ఇంతగా వచ్చేవి కావు. కేంద్రం వద్ద అన్ని అస్త్రాలు అయిపోయాయి కాబట్టి, అట్టహాసంగా ప్రకటించిన మూడో విడత టీకా కార్యక్రమం కూడా అరకొరగా మాత్రమే జరగబోతోంది కనుక, ప్రజలను శాంతింపజేయడానికి లాక్‌డౌన్‌, ఆరోగ్య అత్యవసర పరిస్థితో విధించవలసి వస్తుందని అనుకుంటున్నారు. వ్యాధి వ్యాప్తి రేటు ఎక్కువ ఉన్న జిల్లాల్లో మాత్రమే లాక్‌డౌన్‌లు విధిస్తారని మరొక కథనం. అటువంటి జిల్లాల సంఖ్య కూడా తక్కువేమీ లేదు. ఇక కొన్ని రాష్ట్రాలు అయితే, పాజిటివ్‌ల సంఖ్య, మరణాల సంఖ్య అన్నిటినీ తగ్గించి చూపించడంలో ప్రావీణ్యం సంపాదించాయి. కోర్టులు ఎన్నిసార్లు మందలించినా సరే, వారి సంఖ్యలు ప్రమాదస్థాయిని దాటిపోవు. ఎట్లాగైనా, వాస్తవికతను మభ్యపరచి అంతా బాగానే ఉన్నదన్న భ్రమ కల్పించడానికి ప్రయత్నమే తప్ప, ప్రజలను విశ్వాసంలోకి తీసుకుని పారదర్శకతతో, తగిన చర్యలు తీసుకోవడం లేదు. ఇండియా తప్పుడు లెక్కలు చెబుతోందని బయటి దేశాలు బాహాటంగానే చెప్పుకుంటున్నాయి. అనేక దేశాలు భారతీయులకు ప్రవేశం నిరాకరిస్తున్నాయి. 


ఈ విన్యాసాలు సరే, పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయన్న నమ్మకం ప్రజలకు కలిగేదెట్లా? లాక్‌డౌన్ అనేది ఆర్థికంగా, ఉపాధి రీత్యా ప్రమాదకరమైనది. కానీ, వ్యాధి తీవ్రత రీత్యా, ప్రజాజీవనంలో స్వచ్ఛందంగానే కొంత మందకొడితనం వచ్చింది. కొన్ని చోట్ల ఏ నిబంధనలూ లేకుండా జనం చెలరేగిపోతున్నారు. ఇది మంచి, ఇది చెడు అని చెప్పవచ్చును కదా కనీసం? ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. ప్రచారం ఉధృతంగా జరపవచ్చు. జాగ్రత్తల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించవచ్చు. పర్యవసానాల గురించి భయపెట్టవచ్చు. ప్రధానమంత్రి తప్ప మరో నాయకుడు ప్రజలతో మాట్లాడడు. ఆయనేమో అంతా బాగున్నదనో, అంతా తమ ఘనత అనో చెబుతారు. ఇతరులు కూడా మాట్లాడి సందేహాలు తీర్చవచ్చు, ధైర్యం చెప్పవచ్చు. కొన్ని ఎంపిక చేసిన రంగాలు మినహా తక్కినదంతా కొన్ని రోజులు మూసివేసేట్లు చేయవచ్చు. అనవసరమైన ప్రయాణాలను నిరోధించవచ్చు. జనసమ్మర్దం ఎక్కడా జరగకుండా ఆపవచ్చు. తమకు ఓట్లు వేసేట్టు నచ్చచెబుతున్నట్టే, కట్టుబాట్లు పాటించమని కూడా ప్రజలను ఒప్పించవచ్చు. 


ఏదో ఒకటి చేయండి. ఈ చెడ్డరోజులు పోతాయని, పరిస్థితి మారుతుందని కొంతైనా నమ్మకం కలగడానికి నాయకులు, పాలకులు ఏదైనా చేయండి.

Updated Date - 2021-04-29T05:46:18+05:30 IST