హస్తం రేఖలు మారేనా?

Jul 28 2021 @ 00:18AM
అమర వీరుల స్తూపం వద్ద మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నాయకులు

- కాంగ్రెస్‌ జిల్లా పార్టీలో మొదలైన కదలిక
- ఆగస్టు 9న జిల్లాకు రానున్న టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి
- నాయకత్వ లోపంతో డీలా పడిన స్థానిక పార్టీ శ్రేణులు
- ఏజెన్సీ ప్రాంతంలోని రైతు సమస్యలపై దృష్టి సారించిన నేతలు
- దళిత, ఆదివాసీ దండోరా పేరిట పర్యటన  

ఆదిలాబాద్‌, జూలై 27(ఆంధ్రజ్యోతి): టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి జిల్లాకు రానున్న రేవంత్‌రెడ్డితో కాంగ్రెస్‌ పార్టీలో కదలిక మొదలైంది. ఏడేళ్లుగా అధికారానికి దూరమై నిరాశతో కనిపిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే ఆగస్టు 9న రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన ఖరారైంది. దీనిలో భాగంగా ఇంద్రవెల్లి మండలంలో దళిత, ఆదివాసీ దండోరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే ఈ కార్యక్రమం జిల్లా నుంచే ప్రారంభంకానుంది. అయితే సరైన నాయకత్వం లేకపోవడంతో పలువురు నేతలు, కార్యకర్తలు పార్టీకి దూరమయ్యారు.  అంతేకాకుండా జిల్లాలో ప్రస్తుతం పార్టీ పరిస్థితి నామమాత్రంగానే కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో  రేవంత్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లా నేతలు కసరత్తు మొదలుపెట్టారు. మంగళవారం ఇంద్రవెల్లి మండలంలో బహిరంగ సభను ఏర్పాటు చేసే స్థలాన్ని ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల నేతలు కలిసి పరిశీలించారు. గత కొన్నేళ్లుగా పార్టీని ముందుకు నడిపించే నాయకత్వం లేకపోవడం, తెలంగాణ ఉద్యమ ప్రభావంతో, ప్రజల ఆదరణను కోల్పోతూ వస్తోంది.  యువతలో క్రేజ్‌ ఉన్న రేవంత్‌రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా అధిష్ఠానం నియమించడం కాంగ్రెస్‌ పార్టీకికాస్త కలిసి వచ్చే అవకాశంగా కనిపిస్తుంస్తోంది. డీసీసీ అధ్యక్ష పదవికి భార్గవ్‌దేశ్‌పాండే రాజీనామా చేయడంతో ఇన్‌చార్జి అధ్యక్షుడితోనే పార్టీని నెట్టుకొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఒకరిద్దరు సీనియర్‌ నాయకులు కాంగ్రెస్‌ పార్టీకి దూరం కావడంతో కష్టకాలమే కనిపిస్తోంది. పార్టీపై అభిమానంతో ఉన్న కాస్త నేతలంతా అధికారం లేదన్న నిరాశతో కనిపిస్తున్నారు. దీనికి తోడు జిల్లా నేతల మధ్య గ్రూపు విభేధాలు పెరిగిపోవడంతో పార్టీకి తలనొప్పి గా మారుతున్నాయి. నిర్మల్‌ జిల్లాకు చెందిన మహేశ్వర్‌రెడ్డి ఓ వర్గానికే మద్దతునిస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అధికార పార్టీ, బీజేపీలను తట్టుకుని నిలబడే సత్తా కాంగ్రెస్‌ పార్టీకి ఉంటుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి రేవంత్‌రెడ్డి రాకతో జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో కొంత జోష్‌ కనిపించే అవకాశాలు లేక పోలేదు.
ఎదురు చూసే ఓపిక లేక..
ఏళ్ల తరబడి అధికారం కోసం ఎదురు చూసే ఓపిక లేక కొంత మంది నేతలు, కార్యకర్తలు పార్టీకి దూరమవుతున్నారు. గుండెలనిండా అభిమానం ఉన్నా.. అధికారం లేదన్న కారణంగా ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు. అవకాశాలు కలిసి రావడంతో పార్టీని వీడుతున్నారు. గడిచిన ఏడేళ్లలో ఎంతో మంది కార్యకర్తలు, నేతలు కనిపించకుండానే పోయారు. పార్టీని వీడిన వారంతా తిరిగి పార్టీలోకి రావాలని టీపీసీసీ చీఫ్‌ ఇప్పటికే పిలుపునిచ్చినప్పటికీ.. జిల్లాలో స్పందన కనిపించడం లేదు. సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నా.. మంచి ఊపులో ఉన్న అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల ఒత్తిళ్లకు తలొగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆపద సమయంలో అండగా నిలిచే నాథుడే లేక పోవడంతో కార్యకర్తలంతా చెల్లాచెదురై పోతున్నారు. కొంత మంది పార్టీలో ఉన్న దూరంగానే ఉంటూ వస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం పని చేయాలన్న తపన ఉన్న అధికారం లేదన్న భావనతో ఢీలా పడిపోతున్నారు. పార్టీ చేపడుతున్న ఆందోళన కార్యక్రమాలకు కూడా కార్యకర్తలు, నేతలు అంతగా హాజరు కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో టీపీసీసీ చీఫ్‌ జిల్లా పర్యాటన ఎలా విజయవంతమవుతుందోనన్న అభిప్రాయాలు  పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతున్నాయి. ఉన్నంతలో కొందరు నేతలు కూడా అధికారం లేదన్న భావనతో అంటిముట్టనట్లుగానే కనిపిస్తున్నారు.
పోడుపై ప్రధాన దృష్టి
ఇంద్రవెల్లి మండల కేంద్రంగా నిర్వహించే దళిత, ఆదివాసీ దండోరా కార్యక్రమంలో పోడు సాగు సమస్యలపైననే కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఏజెన్సీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్లాన్‌ చేస్తోంది. ఏజెన్సీలో గిరిజనేతర రైతులు ప్రభుత్వ పథకాలకు దూరమవుతూనే ఉన్నారు. అలాగే ఎన్నో ఏళ్లుగా అటవీ భూములను సాగు చేసుకుంటున్న ఆదివాసీ, గిరిజనులకు ప్రభుత్వం పట్టాలివ్వక పోవడంపై గిరిజనులు మండిపడుతున్నారు. ఇలాంటి సమస్యలనే ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్‌ పార్టీ ప్రజల ముందుకు రానుంది. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాలో పర్యటించి ఏజెన్సీ సమస్యలను పరిష్కరిస్తామని చెబుతున్నా.. ఆచరణ సాధ్యం కావడం లేదు. ఇప్పటికీ వేలా మంది గిరిజనేతర రైతులకు రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు వర్తించడం లేదు. పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదంటున్నారు. అటవీ హక్కు పత్రాలు ఉన్న భూముల్లోనూ అధికారులు మొక్కలు నాటడంతో గిరిజనులు, అటవీ శాఖాధికారుల మధ్య ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితులను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఎత్తుగడలు వేస్తున్నారు. జిల్లాలో ఏజెన్సీ మండలాలైన ఉట్నూర్‌, బజార్‌హత్నూర్‌, తలమడుగు మండలాల్లో పార్టీ పరిస్థితి కొంతమెరుగ్గానే కనిపించడంతో ఏజెన్సీపై మరింత పట్టు సాధించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తోంది.
సభాస్థలిని పరిశీలించిన పార్టీ నేతలు
ఇంద్రవెల్లి: ఆగస్టు 9న నిర్వహించే ఆదివాసీ దండోరా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్‌ఖాన్‌, విశ్వప్రసాద్‌ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక అమరవీరుల స్తూపం వద్ద ఉన్న స్థలాన్ని పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొనే ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఆదివాసీలు తరలిరావలని కోరారు. ప్రభుత్వంలోని అవినీతి, అక్రమాలను ప్రజలకు తెలిపేందుకే ఈ కార్యక్రమం అన్నారు. ఇందులో గండ్రత్‌ సుజాత, భరత్‌ చౌహాన్‌, గణేష్‌  రాథోడ్‌, గణేష్‌ రెడ్డి, నర్సయ్య, నరేష్‌జాదవ్‌, వెన్నల అశోక్‌, మండల నాయకులు పాల్గొన్నారు. 

Follow Us on: