ఏమిటీ నత్తనడక?

Jun 11 2021 @ 02:59AM

పీపీఏ షెడ్యూల్‌ ప్రకారం పనులు చేయరేం?

భూసేకరణ, సహాయ పునరావాసమేదీ?

పోలవరం పూర్తి చేయడమంటే హెడ్‌వర్క్స్‌ నిర్మాణం ఒక్కటే కాదు

ఈ నెలాఖరుకల్లా నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి

రాష్ట్రానికి జలశక్తి శాఖ ఆదేశం

ప్రాజెక్టు పురోగతిపై వర్చువల్‌ సమీక్ష

20,398 కోట్లే ఇస్తామంటే చేయలేం

47,774 కోట్ల అంచనాలను 

ఆమోదించండి: రాష్ట్ర జలవనరుల శాఖ 

నిధులపై కేంద్రం నుంచి లభించని హామీ

ఒత్తిడి పెంచితేనే సాధ్యం: నిపుణులు


అమరావతి, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయని కేంద్ర జలశక్తి శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం రాష్ట్రప్రభుత్వం పనులు చేపట్టకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. లక్ష్యాలను పూర్తి చేసే దిశగా పనులు ఎందుకు పరుగులు పెట్టడం లేదని నిలదీసింది. ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌తో పోల్చితే భూసేకరణ, నిర్వాసితులకు సహాయ పునరావాస కార్యక్రమాల పూర్తికి ప్రాధాన్యమివ్వడం లేదని అభిప్రాయపడింది. ఈ నెలాఖరు నాటికి 41.15 మీటర్ల కాంటూరు పరిధిలోని ముంపు ప్రాంతాల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించింది. ప్రాజెక్టు పనుల పురోగతిపై జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ గురువారం ఢిల్లీ నుంచి వర్చువల్‌ విధానంలో సమీక్ష నిర్వహించారు. కేంద్ర జలసంఘం చైర్మన్‌ హాల్దర్‌, డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌ చైర్మన్‌ ఏబీ పాండ్యా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌, రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్‌ సి.నారాయణరెడ్డి, ప్రాజెక్టు సీఈ సుధాకరబాబు తదితరులు పాల్గొన్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌ పనుల్లో కీలకమైన అప్రోచ్‌ చానల్‌, స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాం పనుల తీరుపై పంకజ్‌ కుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమయంలో అయ్యర్‌ జోక్యం చేసుకుని.. తాము ఎప్పటికప్పుడు ఇస్తున్న సూచనలు, లక్ష్యాలను పాటించడం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా.. భూసేకరణ, సహాయ పునరావాసంపై దృష్టి సారించడం లేదన్నారు. భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల వ్యయం అకస్మాత్తుగా ఎందుకు పెరిగిపోయిందని.. నిర్వాసిత కుటుంబాల సంఖ్య కూడా గణనీయంగా ఎందుకు పెరిగిందని గతంలో మాదిరిగా జలశక్తి శాఖ మళ్లీ సందేహం వ్యక్తం చేసింది. ప్రాజెక్టును పూర్తి చేయడమంటే హెడ్‌వర్క్స్‌ నిర్మాణం ఒక్కటే కాదని.. నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం కూడా అని తేల్చిచెప్పింది.


అలాగైతే పూర్తికాదు..

2013-14 అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లకే పరిమితమవుతామంటే భూసేకరణ , సహాయ పునరావాసం, హెడ్‌వర్క్స్‌ నిర్మాణం పనులు పూర్తిచేయడం అసాధ్యమని జల వనరులశాఖ పేర్కొంది. 2017-18 అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఆమోదం తెలపాలని.. లేదా సవరించిన అంచనా వ్యయం రూ.47,774.47 కోట్లకైనా సమ్మతి తెలపాలని కోరింది. పోలవరం పనుల వేగాన్ని పెంచాలని.. ప్రథమంగా 41.15 మీటర్ల కాంటూరు ముంపు ప్రాంతాల ప్రజలను ఈ నెలాఖరుకల్లా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్న ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయంపై కాకుండా.. పనుల వారీగా అంచనాలు వేసి.. నిధులు ఆ మేరకే విడుదల చేస్తామంటే.. నిర్మాణం పూర్తి కాదని స్పష్టం చేసింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం 18 ఏళ్లు నిండిన వారందరినీ నిర్వాసిత కుటుంబ సభ్యులుగా పేర్కొన్నందున .. కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరిగిందని వెల్లడించింది. పోలవరం నిర్మాణం కోసం రాష్ట్రప్రభుత్వం రూ.1,900 కోట్లు వ్యయం చేసిందని.. ఇందులో రూ.333 కోట్లు రీయింబర్స్‌ చేశారని.. మరో రూ.500 కోట్ల బిల్లులను తిరస్కరించి వెనక్కి పంపేశారని.. ఇలా చేస్తే పనులు పూర్తి చేయడమెలాగని ప్రశ్నించింది. 


నిధులు రీయింబర్స్‌ కాకపోతే.. రాష్ట్రప్రభుత్వం ముందస్తుగా వ్యయం చేయలేదని నిస్సహాయత వ్యక్తం చేసింది. అయితే నిధులపై జలశక్తి శాఖ నుంచి స్పష్టమైన హామీ రాలేదని తెలిసింది. ఈ విషయంలో రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంచనా వ్యయాన్ని రూ.20,398.61 కోట్లకే పరిమితం చేస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని.. ఇప్పుడీ అంచనాలను పెంచాలంటే మళ్లీ మంత్రివర్గ ఆమోదం పొందాలని.. ఇందుకోసం కేంద్ర పెద్దలపై ఒత్తిడి తీసుకురాక తప్పదని నీటిరంగ నిపుణులు అంటున్నారు. ఇది జరిగేదాకా ప్రాజెక్టు పనులపై జలశక్తి శాఖ అసంతృప్తి, నిధుల మంజూరుపై మౌనం కొనసాగుతాయని అభిప్రాయపడుతున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.