మాకు న్యాయం చేయండి

ABN , First Publish Date - 2021-12-07T04:29:57+05:30 IST

మాకు న్యాయం చేయాలని అధికారులు, పోలీసుల చుట్టూ 2005 నుంచి తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఓ రైతు ప్రజావాణి కార్యక్రమానికి పెట్రోల్‌ బాటిల్‌తో వచ్చి ఆందోళన చేసిన సంఘటన సోమవారం సిద్దిపేట కలెక్టరేట్‌లో చోటుచేసుకున్నది.

మాకు న్యాయం చేయండి
భూమి వివరాలను వెల్లడిస్తున్న తేలు బుచ్చయ్య, అంజయ్య కుటుంబసభ్యులు

‘ప్రజావాణి’లో పెట్రోల్‌ బాటిల్‌తో రైతు ఆందోళన

2005 నుంచి తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన


సిద్దిపేట టౌన్‌, డిసెంబరు 6 : మాకు న్యాయం చేయాలని అధికారులు, పోలీసుల చుట్టూ 2005 నుంచి తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఓ రైతు ప్రజావాణి కార్యక్రమానికి పెట్రోల్‌ బాటిల్‌తో వచ్చి ఆందోళన చేసిన సంఘటన సోమవారం సిద్దిపేట కలెక్టరేట్‌లో చోటుచేసుకున్నది. రైతు తెలిపిన వివరాల ప్రకారం.. కొండపాక మండలంలోని మర్పడ్గ గ్రామానికి చెందిన తేలు బుచ్చయ్య, అంజయ్య అన్నదమ్ములు. వారికి తండ్రి కిష్టయ్య పేరున ఎకరా 13 గుంటల వ్యవసాయ భూమి ఉన్నది. తండ్రి మరణానంతరం అన్నదమ్ములిద్దరూ భూమిని పంచుకున్నారు. అనంతరం ఎవరి పేరుమీద వారు పట్టా చేసుకున్నారు. అయితే వేరే గ్రామానికి చెందిన వ్యక్తులు ఈ భూమిని ఆక్రమించుకుని పాస్‌బుక్‌లు పొందడమే కాకుండా ఈ అన్నదమ్ముల పేరున మార్పిడి జరిగిన భూమిని తమ పేరుపై పట్టా మార్పిడి కూడా చేసుకున్నారు. ఇటీవల మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ కోసం వారు భూములను కోల్పోయారు. దీంతో వారిద్దరి కుటుంబాకు అందాల్సిన నష్టపరిహారాన్ని ఆక్రమణదారులు తీసుకున్నారు. ఇదే విషయమై 2005 నుంచి జిల్లా అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. ప్రజావాణిలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయింది. సోమవారం కూడా కుటంబసభ్యులతో కలిసి అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌కు ఫిర్యాధు చేసేందుకు వచ్చి ఒక్కసారిగా అంజయ్య న్యాయం జరగడంలేదని వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ బాటిల్‌ను తీశాడు. వెంటనే గమనించిన పోలీస్‌ కానిస్టేబుళ్లు, సిబ్బంది అంజయ్యను సముదాయించి అక్కడి నుంచి పంపించివేశారు. బయటకు వచ్చిన అంజయ్య కుటుంబసభ్యులు తమ భూమి ఇప్పించి న్యాయం చేయాలంటూ రోదిస్తూ వేడుకున్నారు.

త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీదారుల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేటలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో ఆయన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన వినతులను సంబంధిత శాఖల అధికారులు తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ అర్జీలను శాఖల వారీగా పంపిస్తున్నామన్నారు. కాగా ప్రజావాణిలో మొత్తం 38 ఫిర్యాదులు వచ్చాయి. కొందరు దివ్యాంగులు వినతిపత్రం ఇవ్వడానికి రాగా గమనించిన ముజామిల్‌ఖాన్‌ వారి వద్దకు వెళ్లి వినతిపత్రాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీఆర్వో చెన్నయ్య వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-07T04:29:57+05:30 IST