వాక్సిన్లు మనలను రక్షిస్తాయా?

ABN , First Publish Date - 2021-04-22T06:14:32+05:30 IST

వ్యాక్సినేషన్ ప్రక్రియతో, భయానక కొవిడ్ మహమ్మారిని సమర్థంగా ప్రతిఘటించగలమనే ఆశ అంకురించీ అంకురించగానే, కరోనా విషక్రిమి మనపై మళ్ళీ మరింత...

వాక్సిన్లు మనలను రక్షిస్తాయా?

ఇహలోక ప్రేమ అయినా, పరలోక ప్రేమ అయినా సమస్త సృష్టికి కర్త అయిన పరాత్పరుడిని చేరడానికి మనకు దారి చూపుతుంది.

జలాలుద్దీన్ రూమీ

వ్యాక్సినేషన్ ప్రక్రియతో, భయానక కొవిడ్ మహమ్మారిని సమర్థంగా ప్రతిఘటించగలమనే ఆశ అంకురించీ అంకురించగానే, కరోనా విషక్రిమి మనపై మళ్ళీ మరింత తీవ్రస్థాయిలో విరుచుకుపడసాగింది. భయం, వ్యాకులత, అర్థరాహిత్య భావనను మన మనస్సులో నింపివేస్తోంది. మన మనోజగత్తు అల్లకల్లోలమైపోతోంది. ప్రతి ఉదయమూ (‘దుఃఖ ఉపశమనం అయిన’) నిద్ర నుంచి లేచీ లేవగానే కొత్త మృత్యు గణాంకాలను చూస్తూ భయం భయంగా దైనందిన జీవితంలోకి మనం వెళుతున్నాం. అవ్యవస్థిత, కిక్కిరిసిన శ్మశానాల గురించి, ఆసుపత్రులలో ఐసియు పడకలు, వెంటిలేటర్ల కొరత గురించి పత్రికలు, టీవీలు, ఇంకా అధునాతన సమాచార మాధ్యమాలు మనకు పదేపదే గుర్తు చేస్తున్నాయి; లేదు లేదు హెచ్చరిస్తున్నాయి. మన శరీరం క్షతగాత్ర అయినట్టు, మన మనస్సు గాయపడినట్టు, మన జీవన గమనం దుర్బలమవుతున్నట్టు మనకు స్వయంగా తెలిసివస్తోంది. అవునా? ఈ దుస్సహ పరిస్థితి మనకు ఇంకెంత మాత్రం ఉషస్సులు లేవని, పువ్వుల పలకరింపులు, పక్షుల ఆలాపనలు ముగిసాయనే నిరుత్సాహం కలిగిస్తోంది. ప్రార్థనలు, కృతజ్ఞతలు, జీవనోల్లాసాన్ని మరింత ఝరీభరితం చేసే స్పందనలు అంతమవనున్నాయా? లేదూ, సర్వవ్యాప్తమవుతున్న అంధకారం మనలను తన గాఢపరిష్వంగంలోకి తీసుకొంటున్నట్టు అనిపిస్తోందా? ఏమైనా, ఇప్పుడు మన మనస్సులను ఒకే ఒక ప్రశ్న ప్రగాఢంగా ఆవహించి ఉంది: వాక్సిన్లు మనలను రక్షిస్తాయా? 


కరోనా వైరస్ ప్రభావాన్ని కనీస స్థాయికి తగ్గించే అత్యంత సమర్థ, ప్రభావశీల సంజీవనిని ఆధునిక వైద్యం, బహుశా, మనకు ఇవ్వవచ్చు. కనుకనే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఒక విశేష ప్రాముఖ్యతను కలిగి ఉంది. అయినప్పటికీ వాక్సిన్లు మనం కోల్పోయిన దానిని మళ్ళీ మనకు తిరిగి ఇవ్వలేవనే వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. మనం కోల్పోయినదేమిటి? అంతరంగంలో అల్లకల్లోలం, అస్తిత్వ అనిశ్చితి నడుమ అర్థవంతమైన జీవనం కోసం అన్వేషణ. వాక్సిన్ల కంటే ప్రేమ -మన అంతిమ తపన లేదా వెతుకులాట- ఏమాత్రం తక్కువ ప్రాధాన్యం కలది కాదనే సత్యాన్ని మనం గుర్తించాల్సిన సందర్భమిది. జీవనశక్తిని ఉద్భూతం చేసే జీవితచెలమ అయిన ఈ ప్రేమ ఏమిటి? 


ఆధునికత ఒక మనస్థితి. నవీన నాగరకత దాని భౌతిక స్వరూపం. ఈ ఆధునికత మృత్యువు అనే ఒక అస్తిత్వ వాస్తవంతో హాయిగా ఉండలేకపోతోంది. భౌతిక ప్రపంచాన్ని సంపూర్ణంగా జయించాలని, ధరిత్రిపై మానవుని సార్వభౌమత్వాన్ని ఎలాంటి మినహాయింపులు లేకుండా నెలకొల్పాలని ఆ మనస్థితి నిరంతరమూ మానవులను పురిగొల్పుతోంది. అందుకు అది అపరిమిత సాంకేతికతను, -ఆర్థిక అభివృద్ధిని, దానితో పాటు వినియోగదారీ మనస్తత్వాన్ని సమాజాలు, వ్యక్తులలో జనింప చేస్తోంది. అయితే మృత్యువు అనేది పుట్టుకలోనే అంతర్‌గర్భితమయి ఉంది. ఈ సత్యాన్ని సదా ఎరుకలో ఉంచుకుంటే మనం హుందాగా మరణించగలుగుతాము. లేదూ అర్థవంతంగా చనిపోవడమంటే జీవితం పట్ల గాఢానురక్తితో జీవించడమూ, సాంద్రతరంగా ప్రేమ నిచ్చి ప్రేమను పుచ్చుకోవడమే ‘జీవితం వెలుగు అయినప్పుడు మృత్యువు ఆనందమవుతుందని’ ఒక తాత్త్వికుడు అన్నాడు. మరి ఆధునికత ఏమో మృత్యువును ఏవగించుకుంటోంది. ఈ తిరస్కరణే జీవితాన్ని సారహీనం చేస్తోంది. నిజానికి, ఆధునికత భయాన్ని జయించలేదు. నిత్యనూతన సాంకేతికతలతో వెలుగొందుతున్న పెట్టుబడిదారీ వ్యవస్థలో జీవనసౌఖ్యాలు అమిత ఆకర్షణీయంగా ఉన్నా, ఎంతగా మనకు అందుబాటులో ఉన్నా మనం ఎడతెగని భయంతో జీవిస్తున్నాం. వృద్ధాప్యం మీదపడుతుందనే ఆందోళన, ఆస్తులు, భౌతిక సుఖాలను కోల్పోతామనే భయం, అన్నింటికీ మించి చావు గురించిన చింత. కరోనా విషక్రిమి మనలను మళ్ళీ ఘోరంగా భయపెడుతోంది. హేతుచింతన శిఖరాలూ లోయలను మనం అధిరోహించాం, విశాల దృక్కులతో అవలోకించాం; మనోవిజ్ఞానం, ఆధ్యాత్మికతను కలగలిపిన ‘జీవిత శిక్షకులు’ సమాజ, వైయక్తిక జీవితాలను అమితంగా ప్రభావితం చేస్తున్నప్పటికీ మనం జీవనసమరంలో పరాజితులమై పలాయనం చిత్తగిస్తున్నాం. ఆధునిక నాగరీకులుగా మనం, మన గురించి మనం అనుకుంటున్నంత శక్తిమంతులం కానే కాము. 


మృత్యువు అనివార్యత జీవనలయలో ఉన్నది. ఈ సత్యాన్ని అంగీకరించి, ఆంతరీకరించుకోవడం శూన్యవాద ప్రేరిత ఆత్మహత్యా సదృశ ధోరణులను చూపడం కాదు. వాక్సిన్లతో మనలను రక్షించడానికి ముందుకు వచ్చిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, డాక్టర్లను అభినందించవలసిన అవసరం లేదని మీరూ, నేను భావిస్తే అది పొరపాటే అవుతుంది. వాక్సిన్ అనంతరం కూడా మన భవిష్యత్తు అజ్ఞాతమనే సత్యాన్ని ఆమోదించగల సామర్థ్యమది; జీవించడమంటే ‘రేపటి’ గురించి భయపడడం ఎంత మాత్రం కాదు. మరి వాస్తవంగా ముఖ్యమైనది, ఆవశ్యకమైనది ఏమిటి? మీరు, నేను జీవిస్తున్న ఈ క్షణం. ఇదే వాస్తవం. ఆ వాస్తవాన్ని మనం గుర్తించాలి. ఈ క్షణాన్ని, అంటే జీవితం జీవిస్తున్న సమయాన్ని మనం కృతజ్ఞతతో జీవించాలి; సంపూర్ణ జాగరూకతతో జీవించాలి. మనం జీవిస్తున్న క్షణపు సజీవతను మనం కోల్పోకూడదు. అది కోల్పోతే ఎన్ని డోసుల వాక్సిన్లూ మనలను రక్షించలేవు. సకల మానసిక అధైర్యాలతో కూడిన మన భయకేంద్రిత జీవనాన్ని అవి మౌలికంగా మార్చలేవు.


ఇటువంటి జాగరూకతతోనే మనం బాంధవ్యాల స్ఫూర్తిని అలవరచుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడే, ఇప్పుడే గాఢానురక్తితో, సాంద్రతరంగా జీవితాన్ని జీవించగలగాలి. అప్పుడే పక్షుల కిలకిలరావాలను వినగలుగుతాం; ప్రాతఃవేళ ఉదయిస్తున్న సూర్యకిరణాల ఆప్యాయతను సంవేదించగలుగుతాం; అవధులు లేని శిశువు నవ్వులో సరిగమలను ఆస్వాదిస్తాం. ‘శిశువు చిత్రనిద్రలో ప్రాచీన స్మృతులూచే చప్పుడు’ వినగలుగుతాం. ఇటువంటి సాంద్రతర జీవన సందర్భంలోనే అడ్డుగోడలు కట్టిన అహంకార ధోరణులు విడనాడగలుగుతాం. మనం సీతాకోక చిలుకలమవుతాం. ఇనుడిలా ప్రకాశిస్తాం; సాగరంలో కెరటాల మవుతాం. మరింత స్పష్టంగా చెప్పాలంటే మనమే విశ్వంగా వికసిస్తాం. ఈ భావోద్వేగాల సంగమం మనలోని అన్నిరకాల భయాలను తొలగిస్తుంది. ప్రేమించే శక్తిని, ప్రేమను అందుకునే విశాలత్వాన్ని సమృద్ధంగా పెంచుతుంది. వైరస్ ప్రతి దానిని అస్థిరపరుస్తుంటే మనం ఎంత భయవిహ్వలతకు గురవుతున్నామో ఊహించుకోండి. ఇది ఒంటరితనపు భయం. సామాజిక దూరం పాటిస్తుండడం వల్ల ఇది మరింత తీవ్రమవుతోంది. మానవ అనుబంధాల ఆప్యాయతలను కోల్పోతామనే భయాన్ని కలిగిస్తోంది. కరోనా సోకిన కళంకాన్ని ఎదుర్కోవలసి వస్తుందనే, ఆసుపత్రిలో ఐసీయులో ఒంటరిగా ఉండిపోవలసివస్తుందనే భయాన్ని అది కలిగిస్తోంది. జీవితం ఒక విరోధాభాసం సుమా! అహంభావ పూరిత అతిశయం ఒక భ్రమ మాత్రమేనని నిర్దాక్షిణ్య వైరస్ మనకు స్పష్టం చేస్తోంది. ఇరుగు పొరుగును, తోబుట్టువులను ప్రేమించి, వారి నుంచి మమకారాన్ని పొందడం కంటే జీవితంలో ముఖ్యమైనది మరేదీ లేదనే సత్యాన్ని వైరస్ స్పష్టం చేస్తోంది. ఆ అవ్యాజానురాగమే అం తిమ వైద్యం. అది, వాక్సిన్ కంటే శక్తిమంతమైన సంజీవని. 


ఎటువంటి వికృత ప్రపంచాన్ని మనం సృష్టించాం! అపరిమిత అహాలు, నిర్లక్ష్యపూరిత వినియోగదారీ జీవనశైలి; టెక్నో-సైన్స్ గర్వాతిశయంతో మనం వేర్పాటుగోడలు నిర్మించుకున్నాం- మృత్యువు నుంచి జీవితాన్ని, అనంతం నుంచి పరిమితాన్ని, ఆత్మ నుంచి దేహాన్ని, కవిత్వం నుంచి హేతువును, జీవన్మరణాల సౌందర్యం నుంచి సైన్స్‌ను వేరు చేశాం. తత్ఫలితమే భయం సర్వవ్యాప్తమవడం, మన జీవితాన్ని అర్థరాహిత్యం ఆవహించడం. ‘సాధారణ’ పరిస్థితులలో ఆధ్యాత్మిక దారిద్ర్యం నుంచి దాక్కుంటాం; వినోదాలలో అతిలాలసతో మునిగి తేలు తాం. ఇప్పుడు భయానక కొవిడ్–-19 ఆ సాధారణ పరిస్థితులను చెల్లాచెదురు చేసింది. మనం గతి తప్పాం. సర్వత్రా వాక్సిన్ సామర్థ్యం గురించిన ఆందోళన. మహమ్మారి ప్రభావంతో పెచ్చరిల్లిన నైరాశ్యాన్ని ఎదుర్కొనేందుకు డ్రగ్స్‌పై ఆధారపడడం తదితర కారణాలతో జీవితం తన సమృద్ధ సృజనశీలతను కోల్పోయింది. మహమ్మారితో మనకు దాపురించిన ప్రధాన అస్తిత్వ సంక్షోభమిది. ఇంతకూ ఆధ్యాత్మిక పరివర్తనతో మనలను మనం ఉద్ధరించుకోవడానికి సంసిద్ధంగా ఉన్నామా?

అవిజిత్ పాఠక్ 

సామాజిక శాస్త్రవేత్త 

(ది ట్రిబ్యూన్)

Updated Date - 2021-04-22T06:14:32+05:30 IST