లిఫ్ట్‌ల నిర్వహణపై పట్టింపేదీ?

ABN , First Publish Date - 2022-06-27T06:08:10+05:30 IST

తెలంగాణ ప్రభు త్వం ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తవుతున్నా లిఫ్ట్‌ల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

లిఫ్ట్‌ల నిర్వహణపై పట్టింపేదీ?
తిరుమలగిరి(సాగర్‌) మండలం అల్వాలలో శిలావస్థకు చేరుకున్న ఆర్‌-1 లిఫ్టును పరిశీలిస్తున్న జూలకంటి రంగారెడ్డి

 నిధుల కేటాయింపులో ప్రభుత్వ వైఫల్యం 

ఐదు నియోజకవర్గాల్లో ఇబ్బందులు పడుతున్న లిఫ్ట్‌ పరిధిలోని రైతులు 

నల్లగొండ, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ ప్రభు త్వం ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తవుతున్నా లిఫ్ట్‌ల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 2014, 2018 ఎన్నికల ప్రచారం సందర్భంలో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాగర్‌ ఎడమ కాల్వ పై ఉన్న అన్ని లిఫ్ట్‌లను ప్రాజెక్టులో అంతర్భాగంగా ప్రభుత్వమే నిర్వహిస్తోందని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనడమే కాకుండా ప్రచారంలో హామీ కూడా ఇచ్చారు. అయితే ఇప్పటివరకు నిధులు విడుదల చేయకపోవడంతోపాటు సిబ్బందిని కూడా నియమించకుండా రైతులకే ఆ బాధ్యతను వదిలివేయడంతో లిఫ్ట్‌ల నిర్వహణ చేయలేక రైతులు ఇబ్బందులపాలవుతున్నా రు. ఉమ్మడి జిల్లాలోని నాగార్జునసాగర్‌, మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, సూర్యాపేట, కోదాడ సాగర్‌ ఎడమ కాల్వ పరిధిలో ఉన్న వేలాది మంది లిఫ్ట్‌ పరిధిలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆ ప్రాంత రైతులు అనేకసార్లు మంత్రులు, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లినా నేటికీ పరిష్కారంకాలేదు. నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ పైన ఉన్న లిఫ్ట్‌లన్నింటినీ ప్రభుత్వమే నిర్వహించాలని రైతులనుంచి డిమాండ్‌ వ్యక్తమవుతోంది. బావులు, కాల్వల పూడికలు, తూములు, మోటార్లు, షట్టర్లు, ప్యానల్‌ బోర్డులు, పంపులు, పైపులైన్లవంటి పనులు ప్రభుత్వమే చేపట్టాలని రైతులు కోరుతున్నారు. 


ఉద్యమానికి సన్నద్ధమవుతున్న రైతులు

లిఫ్ట్‌ల నిర్వహణను ప్రభుత్వమే చేపట్టాలని కోరుతూ మరోసారి రైతులు ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 27న (సోమవారం) ఐబీసీఈ కార్యాలయం ఎదుట ధర్నాకు సన్నద్ధమవుతున్నారు. ఎడమ కాల్వపై ప్రత్యేక లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ ఏర్పాటుచేసి లక్ష ఎకరాలకు నీరు ఇస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వం ఆవైపు చర్యలు తీసుకోవడంలేదు. ప్రాజెక్టులో అం తర్భాగంగా లిఫ్ట్‌లు ఉంటాయని పేర్కొన్నప్పుడు, ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. గతంలో అప్పటి ప్రభుత్వం లిఫ్ట్‌లు ఏర్పాటు చేయడానికి ముందుకు రాకపోవడంతో రైతులే స్వయంగా 1970 సంవత్సరంలో కోఆపరేటివ్‌ సొసైటీలు ఏర్పాటు చేసుకుని భూములు బ్యాంకుల్లో కుదవబెట్టి అప్పులు తీసుకుని 18 లిఫ్ట్‌లను ఏర్పాటు చేసుకున్నారు. అయితే అనేక ఇబ్బందులు పడుతూ 1981 వరకు లిఫ్ట్‌లను నడిపించగలిగారు. ఆ తర్వాత లిఫ్ట్‌ల నిర్వహణ రైతుల నుంచి కాకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళనను అప్పట్లో చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి చేసింది. దీంతో ఆ నాటి ప్రభుత్వం ఐడీసీ డిపార్టుమెంట్‌కు లిఫ్ట్‌ల బాధ్యతలను అప్పజెప్పింది. ఆ తర్వాత అంచలంచెలుగా 54 లిఫ్ట్‌లు ఎడమ కాల్వపై ఐడీసీ డిపార్టుమెంట్‌ ద్వారా ఏర్పాటు చేశారు. అయితే అప్పట్లో లిఫ్ట్‌లకు కరెంటు సరఫరా సక్రమంగా లేకపోవడంతో సగం ఆయకట్టుకు నీరు అం దని పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో 2007లో నాగార్జునసాగర్‌ నుంచి నడిగూడెం మండలంలో ఉన్న చివరి లిఫ్ట్‌ వరకు రైతులందరినీ ఏ కం చేసిన సీపీఎం వారం రోజులపాటు పాదయాత్ర చేపట్టింది. దీంతో సపరేట్‌ ఫీడర్‌ లైన్‌ ఏర్పాటు చేయించి 18గంటలపాటు కరెంటు సరఫరా అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.


సిబ్బంది నియామకంలో జాప్యం

లిఫ్ట్‌ల నిర్వహణకు ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన సిబ్బందిని నియమించకపోవడం వల్ల మోటార్లు దెబ్బతినడం, కాల్వలు దెబ్బతినడంతో తిరిగి లిఫ్ట్‌లు నడవలేని పరిస్థితికి తయారయ్యాయి. ఇక 2013-14 సంవత్సరంలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులకు ప్రపంచ బ్యాంకు నుంచి రూ.4వేలకోట్ల నిధులు కేటాయించారు. వీటి నుంచి లిఫ్ట్‌ల పూర్తిస్థాయి మరమ్మతులకు రూ.200కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని ఐడీసీ అధికారులు కోరినా రూ.100కోట్లు మాత్రమే కేటాయింపులు జరిగాయి. దీంతో ఆ నిధులతో కేవలం 50శాతం పనులు మాత్రమే చేపట్టి అర్ధాంతరంగా వదిలేశారు. ఇదిలా ఉంటే లిఫ్ట్‌లన్నింటినీ ఐడీసీ నుంచి తప్పించి ఎన్‌ఎస్పీకి నిర్వహణ బాధ్యతను అప్పగించారు. ఆ తర్వాత ఎన్‌ఎస్పీ నుంచి కూడా నిర్వహణ బాధ్యతలు తీసేసి ఐబీ డిపార్టుమెంట్‌కు అప్పజెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో లిఫ్ట్‌ల పట్ల నిర్లక్ష్యం మాదిరిగానే రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అదే పరిస్థితి ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 


ప్రభుత్వం దిగొచ్చే వరకూ పోరాటం :  జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం రాష్ట్రనేత 

లిఫ్ట్‌ నిర్వహణను ప్రభుత్వం చేపట్టే వరకు పోరాటం కొనసాగిస్తాం. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే లిఫ్ట్‌లు అటకెక్కిపోయే పరిస్థితి ఉంది. నిధుల కేటాయింపు చేయకపోవడం, సిబ్బందిని నియమించకపోవడంతోనే సమస్యలు వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో లిఫ్ట్‌ల పట్ల ఏ విధంగానైతే నిర్లక్ష్యం జరిగిందో ప్రస్తుతం అం తకంటే ఎక్కువగా నిర్లక్ష్యం చేయబడుతున్నాయి. ప్రస్తుత ముఖ్యమం త్రి కేసీఆర్‌ ఉద్యమనాయకుడిగా ఆ తర్వాత 2014, 2018 సంవత్సరం లో ఎన్నికల ప్రచారంలో ఎడమ కాల్వపై ఉన్న లిఫ్ట్‌లను ప్రాజెక్టులో అంతర్భాగంగా ప్రభుత్వం నడిపిస్తుందని హామీ ఇచ్చి ప్రస్తుతం మాత్రం పట్టించుకోవడం లేదు.  

Updated Date - 2022-06-27T06:08:10+05:30 IST