ఈ బియ్యం మీరు తింటారా సారూ?

ABN , First Publish Date - 2021-10-12T05:18:10+05:30 IST

చెత్తా, చెదారం, పురుగులు, నూకలతో అందిస్తున్న రేషన్‌ బియ్యాన్ని మీరు తింటారా సారూ అంటూ అల్లాదుర్గం మండలంలోని లబ్ధిదారులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. అక్టోబరుకు సంబంధించి సరఫరా చేసిన బియ్యంలో చెత్తా, చెదారం, లక్క, తెల్లపురుగులు, నూకలు ఉన్నాయి.

ఈ బియ్యం మీరు తింటారా సారూ?
అల్లాదుర్గంలో పంపిణీ చేసిన చెత్తా, చెదారం, నూకలతో ఉన్న రేషన్‌ బియ్యాన్ని చూపిస్తున్న మహిళ

ఇవి ఉచిత బియ్యమా.. చెత్త బియ్యమా?  

చెత్త, నూకల రేషన్‌ పంపిణీపై లబ్ధిదారుల ఆగ్రహం


మెదక్/అల్లాదుర్గం: చెత్తా, చెదారం, పురుగులు, నూకలతో అందిస్తున్న రేషన్‌ బియ్యాన్ని మీరు తింటారా సారూ అంటూ అల్లాదుర్గం మండలంలోని లబ్ధిదారులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. అక్టోబరుకు సంబంధించి సరఫరా చేసిన బియ్యంలో చెత్తా, చెదారం, లక్క, తెల్లపురుగులు, నూకలు ఉన్నాయి. ఈ బియ్యాన్ని పరిశీలించని రేషన్‌ డీలర్లు లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు యత్నించగా వినియోగదారులు ‘‘ ఈబియ్యం మాకొద్దు..’’ అంటూ తిరిగివెళ్తున్నారు. అల్లాదుర్గం మండలంలోని ముస్లాపూర్‌లోని ఓ రేషన్‌ దుకాణానికి నాణ్యతలేని బియ్యం బస్తాలు వచ్చాయని, వాటిని లబ్ధిదారులు తీసుకోకపోవడంతో పక్కన పెట్టినట్లు రేషన్‌ డీలర్‌ తెలిపారు. నాసిరకం బియ్యం బస్తాలను మండలంలోని పలు రేషన్‌ దుకాణాలకు సరఫరా చేయగా డీలర్లు వాటిని తిరిగి పంపకుండా ఇతర బియ్యంతో కలిపి సరఫరా చేస్తున్నారని పలువురు చెబుతున్నారు. బస్తాలకు రంధ్రాలు పడి బియ్యం పోతున్నాయని తాము తీవ్రంగా నష్టపోతున్నామని డీలర్లు ఆవేదన చెందుతున్నారు. పౌరసరఫరా గోదాంలో వృథాగా పడి ఉన్న బియ్యాన్ని బస్తాల్లో నింపి సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఉచిత బియ్యం అని గొప్పలు చెబుతూ ఇలా నాణ్యత లేని, అత్యంత అధ్వానంగా ఉండే బియ్యాన్ని సరఫరా చేయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి ఇలాంటి నాణ్యత లేని బియ్యం పంపిణీ చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



Updated Date - 2021-10-12T05:18:10+05:30 IST