Wife Image as Whatsapp DP: భార్య ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించండి.. ఎందుకంటే..

ABN , First Publish Date - 2022-04-29T23:32:41+05:30 IST

చాలామంది భార్యపై ఉన్న ప్రేమతో ఆమె ఫొటోను వాట్సాప్ డిస్‌ప్లే పిక్చర్‌గా పెడుతుంటారు. ఫేస్ బుక్ కవర్ ఫొటోగానో, ప్రొఫైల్ పిక్ గానో పోస్ట్ చేస్తుంటారు. కానీ..

Wife Image as Whatsapp DP: భార్య ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించండి.. ఎందుకంటే..

చెన్నై: చాలామంది భార్యపై ఉన్న ప్రేమతో ఆమె ఫొటోను వాట్సాప్ డిస్‌ప్లే పిక్చర్‌గా పెడుతుంటారు. ఫేస్ బుక్ కవర్ ఫొటోగానో, ప్రొఫైల్ పిక్ గానో పోస్ట్ చేస్తుంటారు. కానీ.. సైబర్ నేరగాళ్లకు అలాంటి భర్తలే టార్గెట్ అవుతున్నారు. చెన్నైలో ఈ తరహా ఘటనే ఒకటి వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని అయ్యన్నవరం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తనను ఓ అగంతకుడు తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని అయ్యన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.



అసలు విషయం ఏంటని పోలీసులు ఆరా తీయగా.. సదరు వ్యక్తి తన భార్య ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకున్నాడు. ఆ ఫొటోను ఓ సైబర్ కేటుగాడు డౌన్‌లోడ్ చేసి మార్ఫింగ్ చేశాడు. ఆమె మాములు ఫొటోను ఓ నగ్న ఫొటోగా మార్చేసి ఆమె భర్తను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అడిగినంత డబ్బు ఇవ్వాలని లేకపోతే ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. ఏం చేయాలో పాలుపోని ఆ భర్త పోలీసులను ఆశ్రయించాడు. కేసును పోలీసులు సైబర్ విభాగానికి బదిలీ చేశారు. సైబర్ క్రైం పోలీసులు ఆ కేటుగాడు పని పట్టేందుకు రంగంలోకి దిగారు. అతని ఐపీ అడ్రస్ తెలుసుకుని ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇలా ఉంది సైబర్ నేరగాళ్ల వ్యవహారం. మన వాట్సాప్ డీపీని కూడా తస్కరించి బెదిరించే స్థాయిలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు సాగుతున్నాయి.



ఈ కేసులో పోలీసులు మరో కోణం కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. ఎవరో తెలిసిన వారే అతని భార్య ఫొటోను సేవ్ చేసుకుని ఇలా డబ్బు కోసం మార్ఫింగ్ చేసి బెదిరిస్తున్నారేమోనన్న కోణంలో కూడా పోలీసుల విచారణ సాగుతోంది. మహిళలనే కాదు వారి ఫొటోలు కనిపించినా ఆ ఫొటోలను ఇలా మార్ఫింగ్ చేసి వేధింపులకు గురిచేసే స్థాయికి పరిస్థితి దిగజారింది. అందువల్ల.. ఇంట్లోని మహిళలపై అభిమానంతోనో, ప్రేమతోనో వారి ఫొటోలను వాట్సాప్ డీపీగా పెట్టకపోవడమే మంచిదని ఈ ఘటన చెప్పకనే చెబుతోంది. ఒకవేళ.. అలా మహిళల ఫొటోను డీపీగా పెట్టుకున్నా సన్నిహితులకు మాత్రమే కనిపించేలా సెట్టింగ్స్ మార్చుకోవడం శ్రేయస్కరం. అందుకు చేయాల్సిందల్లా ఒకటే. వాట్సాప్‌లోకి వెళ్లి కుడి వైపున కనిపించే మూడు డాట్స్‌పై క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ప్రైవసీ సెట్టింగ్స్ క్లిక్ చేసి మన వ్యక్తిగత వివరాలు, డీపీ, స్టేటస్ ఎవరికి కనిపించాలో అలా ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. వ్యక్తిగత వివరాలను, ఫొటోలను సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేసి సైబర్ నేరగాళ్లకు టార్గెట్ అవ్వకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2022-04-29T23:32:41+05:30 IST