సీమ అవసరాలు పట్టవా?

ABN , First Publish Date - 2021-07-26T05:46:24+05:30 IST

రాయలసీమ తాగు, సాగు నీటి అవసరాలపై ఆందోళన వ్యక్తమవుతోంది.

సీమ అవసరాలు పట్టవా?

  1. శ్రీశైలం నీటిని తోడేస్తున్న తెలంగాణ
  2. జీఎన్‌ఎస్‌ఎస్‌, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌, కేసీ కెనాల్‌కు నీటిపై ఆందోళన
  3. చెన్నైకి నీటి సరఫరా బాధ్యత ఏపీపైనే
  4. కేఆర్‌ఎంబీకి పదే పదే గుర్తు చేస్తున్న అధికారులు


కర్నూలు, ఆంధ్రజ్యోతి: రాయలసీమ తాగు, సాగు నీటి అవసరాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీశైలం నుంచి నీటి విడుదలపై రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ఆగ్రహిస్తున్నాయి. ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి లేఖలైతే రాస్తోంది కానీ.. తెలంగాణకు అడ్డుకట్ట వేయలేక పోతోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దామాషా పద్ధతిన తమకు కేటాయింపు కావాలని ఏపీ ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి మరో లేఖ రాసింది. ఇప్పటికే 82.40 టీఎంసీలను ఎలాంటి ఇండెంట్లు లేకుండానే తెలంగాణ విద్యుత్‌ అవసరాలకు ఉపయోగించుకుంది. రాయలసీమతో పాటు చెన్నైకి నీరందించే బాధ్యత కూడా ఏపీపైనే ఉంది. శ్రీశైలంలో 854 అడుగుల నీరు చేరితేగానీ పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా రాయలసీమకు తాగు, సాగు నీటికి మళ్లించలేం. కానీ 800 అడుగుల నుంచే విద్యుదుత్పత్తి పేరిట తెలంగాణ నీటిని తోడేస్తోంది. దీనివల్ల భారీ వరదలు వస్తేనే డ్యాం నిండుతుంది. ప్రస్తుతం వరద ప్రవాహం 30 రోజులకు మించి ఉండదని చెబుతున్నారు. ఈ వ్యవధిలో పోతిరెడ్డిపాడు వద్ద అప్రోచ్‌ కెనాల్‌ను విస్తరిస్తేనే వీలైనంత నీటిని తీసుకోవచ్చు. ఆ ఆలోచనల నుంచే సీమ ఎత్తిపోతల పథకం రూపుదిద్దుకుంది. 854 అడుగుల వరకూ నీరు వచ్చేదాకా తెలుగు రాష్ట్రాలు విద్యుదుత్పత్తి చేయకూడదు. కానీ తెలంగాణ ముందుగానే చేస్తోంది. తెలంగాణ లిఫ్ట్‌ స్కీంలకు సోలార్‌ సిస్టం, ఇతర మార్గాల ద్వారా విద్యుదుత్పత్తి పట్టించుకోవడం లేదు. 


మా వాటాలు కావాలి


తెలంగాణ లిఫ్ట్‌ స్కీమ్స్‌ విద్యుత్‌ అవసరాల భారమంతా ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుపైనే పడుతోంది. ఏపీ తాగు, సాగు అవసరాలను వదిలేసి విద్యుదుత్పత్తికే టీఎస్‌ ప్రభుత్వం మంకు పట్టు పడుతోంది. చివరకు కేఆర్‌ఎంబీ జోక్యాన్ని కూడా బేఖాతరు చేస్తోంది. రెండు విద్యుదుత్పత్తి ప్లాంట్ల ద్వారా 180 టీఎంసీలే వాడుకోవాలన్న బచావత్‌ కమిటీ సూచనలను కూడా తెలంగాణ ప్రభుత్వం లెక్క చేయడం లేదు. తెలంగాణ విధానాలతో ఏపీలో సీమ ప్రాజెక్టును నిర్మించి తీరాల్సిం దేనని రాష్ట్ర ప్రభుత్వ భావిస్తున్నట్లు తెలుస్తోం ది. ఏపీ, తెలంగాణ మధ్య ఒప్పందాల ప్రకారం 66:34 పద్ధతిన నీటి వాటాలు ఉండాలి. కానీ ఇందుకు భిన్నంగా తెలంగాణ వ్యవహరిస్తోంది. ఇప్పటికే శ్రీశైలం జలాశయం నుంచి 43.25 టీఎంసీలు, నాగార్జున సాగర్‌ నుంచి 27.23 టీఎంసీలు, పులిచింతల నుంచి 11.92 టీఎంసీలు మొత్తం ఇప్పటికి 82.40 టీఎంసీలను తెలంగాణ ప్రభుత్వం వాడుకుంది. 


రాయలసీమపై భారం


3,850 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా 2014కు ముందు 2 పైపుల ద్వారానే నీటిని ఎత్తిపోశారు. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు స్థాయిని 6 పైపులకు పెంచింది. అయినా ఆ ప్రాజెక్టు 2,025 క్యూసెక్కులకు మించి సరఫరా చేయలేకపోతోంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి 27 టీఎంసీలు కావాలని ఇండెంట్‌ పెట్టింది. హంద్రీనీవా ద్వారా 7 టీఎంసీలు,   కేసీ కెనాల్‌ ద్వారా 2 టీఎంసీలు, జీఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి 8 టీఎంసీలు అందాల్సి ఉంటుంది. ఇదిగాక చెన్నై ప్రజల తాగు నీటి అవసరాలకు 3 టీఎంసీలు, తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా 7 టీఎంసీలు ఇవ్వాలి.  ఏపీకి అందాల్సిన ఈ వాటాలను పట్టించుకోకుండా తెలంగాణ అవలంబిస్తున్న వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవు తున్నాయి. 


చర్చలు అత్యవసరం..


కేవలం లేఖల ద్వారా నీటి సమస్య పరిష్కారం కాదు. రెండు రాష్ట్రాల సీఎంలు కూర్చొని చర్చించుకోవాలి. ఏవేవో కారణాల తో నీటి సమస్యను పట్టించుకోకపోతే ఏపీకి కష్టాలు తప్పవు. చర్చలు ఎంత ఆలస్యమైతే అంత నీరు వృథా అవుతుంది. రాయమలసీమకు నష్టం జరుగుతుంది. ప్రస్తుతం వరదలు ప్రారంభమయ్యాయి. తక్షణమే చర్యలకు సీఎంలు ప్రయత్నించాలి. వరదలు ఎప్పుడు ఆగుతాయో తెలియని నేపథ్యంలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి. 

- సుబ్బరాయుడు, రిటైర్డ్‌ ఇంజనీర్‌ 


సంగమేశ్వరుడి జలాధివాసం


ఆత్మకూరు/కొత్తపల్లి, జూలై 25:  జూరాల నుంచి భారీగా వరదనీరు చేరడంతో సంగమేశ్వరాలయం జలాధివాసమైంది. ఆదివారం మధ్యాహ్నం వరకు శిఖరాగ్రం దర్శనమిచ్చింది. సాయంత్రానికి పూర్తిగా జలాధివాసమైంది. సంగమేశ్వరం ఎగువ పుష్కర ఘాట్ల వద్దకు నీరు చేరడంతో వీక్షించేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. ఎగువ ఉమామహేశ్వరాలయంలో పూజలు కొనసాగుతున్నాయి. 


 శ్రీశైలానికి  కృష్ణా ప్రవాహం


శ్రీశైలం, జులై 25: ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైల జలాశయానికి వరద ఉధృతి భారీగా పెరిగింది. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి  జూరాల నుంచి 4,05,064 క్యూసెక్కులు వరద చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 864.60 అడుగులుగా నమోదైంది. జలాశయం గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 120.9532 టీఎంసీల నిల్వలు నమోదయ్యాయి. ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి కోసం 25,426 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తోంది. ఈ నీరు నాగార్జున సాగర్‌కు వెళుతోంది. 


తుంగభద్రకు భారీ వరద


ఆదోని, జూలై 25: కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయం నిండకుండలా మారింది. జలాశయం కార్యదర్శి నాగమోహన్‌ ఆదివారం 10 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. జలాశయం ఎగువన ఉన్న హరిహర, శివమొగ్గ, ఆగుంబే, మలేనాడు, చిక్కమగళూరు, తీర్థహల్లి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.   దీంతో ఆదివారం సాయంత్రానికి 2,57,621 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి చేరుతోందని బోర్డు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 85 టీఎంసీల నిల్వలు ఉన్నాయి. మరో 15 టీఎంసీలు చేరితే జలాశయం పూర్తిస్థాయిలో నిండుతుంది. ఈ ఏడాది అనుకున్న సమయం కంటే ముందుగానే తుంగభద్ర జలాశయం నిండుతోంది. నదీ పరీవాహక ప్రాంతాల్లో ప్రజలను బోర్డు అధికారులు, రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులకుగానూ ప్రస్తుతం 1627 అడుగుల వరకూ నీరు చేరింది. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 100.855 టీఎంసీలు కాగా, 85 టీఎంసీల నిల్వలు నమోదయ్యాయి. వరద ఇదే స్థాయిలో కొనసాగితే రెండు రోజుల్లో జలాశయం పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 10 గేట్లు తెరిచి 13,500 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేశారు. ఇన్‌ఫ్లో పెరిగితే నీటి విడుదల మరింత పెంచుతామని బోర్డు అధికారులు తెలిపారు. నీరు విడుదల కార్యక్రమంలో ఈఈ సురేష్‌ రెడ్డి, విజిలెన్స్‌ ఈఈ శ్రీనివాస్‌ రెడ్డి, ఎస్‌డీవోలు సుందరమి, అమర్‌నాథ్‌, ఈఈ మధుసూదన్‌ పాల్గొన్నారు. 


హంద్రీ నీవాకు నీటి విడుదల


నందికొట్కూరు రూరల్‌, జూలై 25: మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి కాలువకు నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే ఆర్థర్‌ ఆదివారం నీటిని విడుదల చేశారు. ఒక పంపు ద్వారా 337 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అఽధికారులు సాయంత్రం మరో రెండు పంపులను ఆన్‌ చేశారు. మొత్తం 1011 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. ఎగవన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద పెరిగింది. శ్రీశైలం డ్యాంలో నీటి మట్టం  864.60 అడుగులకు చేరింది. మల్యాల ఎత్తిపోతల అప్రోచ్‌ కాలువకు నీరు చేరువ కావడంతో ఎత్తిపోతలను ప్రారంభించామని అధికారులు తెలిపారు. గత ఏడాది 40 టీఎంసీలకు గాను 39.5 టీఎంసీల నీటిని ఎత్తిపోశామని అధికారులు తెలిపారు. కేసీ కాల్వకు మల్యాల ఎత్తిపోతల ద్వారా 2.76 క్యూసెక్కుల నీటిని అందించామని తెలిపారు. కృష్ణా నదికి సకాలంలో నీరు చేరడం ఆనందంగా ఉందని నాయకులు పేర్కొన్నారు. అధికారులు ప్రాజెక్టులపై నిఘా వేయాలని, రాయలసీమ రైతులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో హంద్రీనీవా ఈఈ సుధాకరెడ్డి, డీఈ రాజన్‌ బాబు, ఏఈలు వేణుగోపాల్‌, మహీంద్రారెడ్డి, నాయకులు, రైతులు పాల్గొన్నారు.


పోతిరెడ్డిపాడుకు నీటి విడుదల 


జూపాడుబంగ్లా, జూలై 25: పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యేలు ఆర్థర్‌, శిల్పచక్ర పాణి రెడ్డి ఆదివారం నీటిని విడుదల చేశారు. మూడు గేట్ల నుంచి 4 వేల క్యూసెక్కుల నీటిని సర్పంచ్‌ నిర్మలమ్మ అధ్యక్షతన దిగువకు వదిలారు. ఈ నీటిని బానకచర్ల నీటి సముదాయం నుంచి తెలుగుగంగ కాల్వకు మళ్లిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డి, డీఈ రాజీవ్‌ బాపూజీ, ఏఈ విష్ణువర్ధన్‌ రెడ్డి, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-26T05:46:24+05:30 IST